నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. మరో నాలుగు రోజుల్లో అంటే జులై 15న టెస్లా భారత్‌లో తొలి షోరూంను అఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ముంబై జియో వరల్డ్‌లో ఈ షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షో రూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సదరు నివేదికలు వెల్లడించాయి.
ఈ షోరూం కోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారని తెలిసింది. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం.