జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరినేటి ఆధునిక సమాజంలో విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే పుస్తక పఠనం చాలా అవసరమని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ముందు ఏర్పాటుచేసిన నవ తెలంగాణ బుక్ హౌస్ స్టాల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వివిధ విషయాలు తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలంటే పుస్తకం అవసరం అన్నారు. పుస్తకం ఒక మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. సోషల్ మీడియా లేక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చిన వార్తలు సమగ్రంగా ఉండవని దినపత్రికలలో ప్రతి విషయం కులంకషంగా వ్రాస్తారని తెలిపారు. పత్రికలు, పుస్తకాలు చదివి పోటీ పరీక్షలలో రాణించవచ్చని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనను యువత, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. నవతెలంగాణ బుక్ హౌస్ వారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పుస్తకాలను ప్రదర్శనకు పెట్టడం అభినందనీయం అన్నారు.
బుక్ స్టాల్ లో ఉన్న పుస్తకాలు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, న్యాయవాది వెన్నెల, నవతెలంగాణ దినపత్రిక విలేకరులు ఉస్మాన్ షరీఫ్, కొలుపుల వివేకానంద, పాక జహంగీర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు హమీద్, నాయకులు ఉడుత వెంకటేష్, ఎడ్ల శ్రీను, రియాజ్, బుక్ స్టాల్ నిర్వాహకులు రఘువరన్ పాల్గొన్నారు.