నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో వాహనంలోని ఐదుగురు పర్యాటకులు మరణించారు. రాంబన్ జిల్లాలోని సేనాబతి వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో పడిన పర్యాటకుల వాహనం టాటా సుమో నుజ్జునుజ్జుగా మారింది.
తీవ్ర గాయాలతో నలుగురు పర్యాటకులు అక్కడికక్కడే చనిపోయారని, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో పర్యాటకుడు చనిపోయాడని అధికారులు తెలిపారు. గాయాలపాలైన మిగతా పర్యాటకులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాంబన్ జిల్లా యంత్రాంగం రూ.1 లక్ష పరిహారం ప్రకటించింది.