- ప్రభుత్వానికి బాధితుడి తల్లిదండ్రుల మొర..
- నవతెలంగాణ – బంజారా హిల్స్
- తన కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన నిందితులు, పోలీసులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత బాలుడి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు దంపతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో తన కుమారుడు పక్క ఇంట్లో స్నానం చేస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారని, తన కుమారుని సదర వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తన కుమారుని తీసుకు రమ్మనడంతో తీసుకెళ్లామని చెప్పారు.
పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు తన కుమారుని విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఇంటి సమీపంలోని వ్యక్తులు దాడి చేయడంతోనే తన కుమారుడికి నడవలేని పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ.. ఆనాటి నుంచి స్థానిక ప్రయివేట్ ఆస్పత్రితో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదంటూ మనోవేదనకు గురయ్యారు. ఈ విషయమై తాము ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు పశ్చిమ మండల డీసీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని అన్నారు. దీంతో తాము మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు పలుమార్లు ఫోన్ చేసి కలుద్దామని ఒత్తిడి చేశారని చెప్పారు. తమ వద్దకు వచ్చిన పోలీసులు ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టాలంటూ.. ఎంతో కొంత సహాయం చేస్తామని ఒత్తిడి చేశారని చెప్పారు. మైనర్ అయిన తన కుమారుని గత ఏడాది డిసెంబర్ 15 నుంచి 17 వరకు పోలీస్ స్టేషన్లో నే ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.
అటు ఇంటి సమీపంలోని వ్యక్తుల దాడి, ఇటు పోలీసుల విచక్షణరాహితమైన దాడితోనే తన కుమారుడికి ఈ దుస్థితి నెలకొందని బోరున విలపించారు. మేము న్యాయం కోసం పోరాడుతున్న విషయం తెలుసుకొని, తమ కుమారుడు మొదటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తప్పుడు సర్టిఫికెట్లను పుట్టించారని ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమారుడు ఎన్సిసి(NCC) లో కూడా ఉన్నాడని చెప్పారు.
ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తమ కుమారుడు దుస్థితికి కారణమైన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించి, దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ స్పందించకుంటే న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో మద్దతుగా మాల సంఘం నాయకులు బత్తుల రామ్ ప్రసాద్, తెలంగాణ శ్యాం లు హాజరయ్యారు.
ఆరోపణలు అవాస్తవం.. జూబ్లీహిల్స్ పోలీసులపై రాంబాబు కుటుంబం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని జూబ్లీహిల్స్ ఏసీపీ పేరున ఓ పత్రిక ప్రటన విడుదల చేశారు.