నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తాము చేపట్టిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారని, ఆమె ఎప్పుడు పోరాటం చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు క్రెడిట్‌ను కవిత తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ స్పందించారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆమె చెబుతున్న మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు.
తీహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారని నిలదీశారు. అసలు కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని అన్నారు. ఇలాంటి నిర్ణయాలని అభినందించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు రావడం లేదని విమర్శించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు పలికిందని తెలిపారు. కానీ బీసీలకు మేలు జరిగే ఈ నిర్ణయంపై మాత్రం నోరు మెదపడం లేదని విమర్శించారు. కడుపునిండా విషం పెట్టుకొని కౌగిలించుకొన్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని అన్నారు.