పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోడీ స్పందన ఎలా వుంటుందా అని ప్రపంచమంతా చూస్తుంటే ఆయన బీహార్‌కు వెళ్లి అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కీలక హిందీ రాష్ట్రంలో కొంత ఇంగ్లీషులో మాట్లాడుతూ… నా నరాల్లో రక్తం కాదు, ఆగ్రహం ప్రవహిస్తున్నది అనేట్టు చెప్పుకొచ్చారు. విదేశాలకు అర్థం కావడం కోసం ఇంగ్లీషులో మాట్లాడారనుకోవచ్చు గానీ దాడి జరిగిన కాశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాలనూ దేశ రాజధానిని వదలిపెట్టి బీహార్ వెళ్లి ఇవి మాట్లాడాల్సిన అవసరమేమొచ్చింది? ఎన్నికలు అక్టోబరులో వస్తాయన్న వాస్తవమే ఆయనతో అలా మాట్లాడించింది. ఉగ్రవాద ఘాతుకానికి గురైన రాష్ట్రంలో ఏం చేయాలనే దానికన్నా ఆ అంశాన్ని రాజకీయంగా కీలకమైన బీహార్‌లో ఎలా ఉపయోగించుకోవాలన్నదే ఆయనకు ప్రధానమై పోయిందని అందరూ వ్యాఖ్యానించారు. అయితే మోడీ గానీ ఆయన పార్టీ బీజేపీ గానీ ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకునే రకం కాదు. ఏదో విధంగా విజయం సాధించడం ప్రాబల్యం పెంచుకోవడమే వారి ఏకైక సూత్రం. దేశంలో మూడుసార్లు ఏదోలా అధికారంలోకి వచ్చినా వారికి కొరుకుడు పడని రాష్ట్రాలు కొన్ని వున్నాయి. వాటిలో బీహార్ ఒకటి. ఎప్పుడో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం లేదా యాభయ్యేళ్ల ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారైనా వారు బీహార్‌లో సొంతంగా అధికారంలోకి రాలేకపోయారు. అవకాశవాద ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అటూ ఇటూ మారుతుండడాన్ని ఉపయోగించుకునే వారు మనుగడ సాగిస్తున్నారు. షరా మామూలుగా ఈ క్రమంలో నితీశ్‌ను వెనకకు నెట్టి తామే పెద్ద శక్తిగా తయారైనారు కూడా. అయినా వంటరిగా పోరాడగలిగిన సత్తా, ధైర్యం కూడా బీజేపీకి లేవు. 2020 శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీతో కలసి పోటీ చేసిన జేడీయూ కన్నా వారికే అధిక స్థానాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలతో అతి పెద్ద పార్టీగా వస్తే బీజేపీ 74 స్థానాలతో రెండవ స్థానంలో వచ్చింది. 44 తెచ్చుకున్న జేడీయూ మూడో స్థానంతో ఆగిపోయింది. అయినా ఒప్పందం మేరకు మొదట ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ నితీశ్ నే ముఖ్యమంత్రిని చేశారు. కానీ తన ప్రాబల్యం తగ్గిపోవడం సహించలేని నితీశ్ 2017లో చేసినట్టే 2022లో మళ్లీ జట్టు మార్చి బీజేపీతో కలిశారు. బీజేపీ ఆయన నాయకత్వాన్ని కొనసాగిస్తున్నా గతంలో ఇచ్చిన ప్రాధాన్యత మాత్రం తగ్గించేసింది. హిందూత్వ రాజకీయాలు సరేసరి. అయినా ముఖ్యమంత్రి పీఠమే పరమావధిగా భావించే నితీశ్ తల వంచి బతికేస్తున్నారు. గతంలోని నితీశ్‌కూ ఇప్పటికి అసలు పోలికే లేదని అందరూ అంటున్న పరిస్థితి.
బీహార్‌లో భిన్న పరిస్థితులు
బీహార్ ఎన్నికలలో కులం ప్రధాన పాత్ర వహిస్తుందని చెబుతుంటారు గానీ వాస్తవంలో అక్కడ పేదరికం, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం కూడా దాని వెనక వుంటాయని గమనించాలి. భూస్వామ్య పీడన దారుణంగా కొనసాగిన రాష్ట్రమది. ఆర్‌జేడీ గత ఇరవై ఏళ్లలో మధ్యలో రెండుసార్లు రెండేళ్ల చొప్పున మాత్రమే అదీ భాగస్వామిగా వుండటం తప్ప ప్రతిపక్షంలోనే వుంది. స్వతహాగా ముస్లిం, యాదవ ఓటర్లు దానికి పునాదిగా వుంటారని భావిస్తారు. ఈసారి ముందే మేల్కొని కుష్వాహా, ధానుక్, మల్లా వంటి ఇతర వెనకబడిన కులాల వారిని కూడా తన వైపు తిప్పుకోవడానికి కేంద్రీకరించి పని చేసింది. ఈ వర్గాలకు చెందిన వారిని అత్యధికంగా లోక్‌సభకు పోటీ చేయించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చింది. ఇదే తరహాలో కాంగ్రెస్, బీఎస్‌పీలు జాతవ్‌లపై కేంద్రీకరించాయి. కొన్ని ప్రాంతాలలో దళితుల లో సీపీఐ(ఎం.ఎల్) పార్టీకి పట్టు కలిగి వుంటుంది. ఇండియా కూటమిలో వీరందరూ భాగస్వాములుగా వుండటం ఒకటైతే మిగిలిన చోట్లవలె గాక ఇక్కడ ఆ కూటమి గట్టిగానే కొనసాగడం పరిస్థితిలో కీలకాంశంగా వుంటున్నది. అందువల్లనే పైకి ఏమి చెప్పినా తాము నితీశ్‌ను ముందు పెట్టుకుని పోవలసిందేనని బీజేపీ నాయకులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. మహిళా ఒటర్లలో ఆయనకు పట్టు ఎక్కువని వారి అంచనా. దానికి తగినట్టే ఎన్నికలు రాబోతున్న వేళ నితీశ్ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రకటన చేయడం వారిని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రమే. అయితే ధరలు, అత్యాచారాలు, మత రాజకీయాల కారణంగా మొత్తంగానే ఆయన బలహీనపడిపోయిన మాట నిజం.
వామపక్షాల చొరవ, ఇండియా కొనసాగింపు
మోడీని ప్రధాని అభ్యర్థిగానే అంగీరించబోనని 2014లో బీరాలు పలికి కూటములు మార్చి పదవి కాపాడుకున్న నితీశ్ తర్వాత 2017లో ప్లేటు ఫిరాయించి వుండకపోతే బీహార్‌లోనే గాక దేశంలో కూడా రాజకీయాలు మరోలా వుండేవేమో. ఇదే మళ్లీ 2022లోనూ ఆయన పునరావృతం చేశారు. అందుకే ఆయనను ‘పల్టు బాబు’ అని బీహార్ ప్రజలు, నాయకులు అపహాస్యం చేస్తుంటారు. ఈ విషయంలో తనతో పోటీ పడగలిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ ఇద్దరు నాయకులు మనుగడ కోసం బీజేపీని మోయకపోతే మోడీ మూడోసారి ప్రధాని కాగలిగేవారు కాదనవచ్చు. కాకపోతే ప్రసుతం ఏపీలో వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకి అనుకూలంగా వుంటే బీహార్‌లో మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి యాదవ్ ఇండియా వేదికను కొనసాగిస్తూ నితీశ్‌కు ప్రధాన సవాలుదారుగా ముందుకొచ్చారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే వంటి వారు కూడా దాదాపు బీహార్‌లోనే తరచూ కనిపించడం గమనించదగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనవసరంగా పట్టు పట్టి అధిక స్థానాలు తీసుకుని ఓటమిపాలై వుండకపోతే నితీశ్ బీజేపీతో కలిసినా సర్కారులోకి రాగలిగేవారు కాదు. అందుకే ఇప్పుడు ముందు నుంచే దాని స్థానాలు తగ్గించేందుకు తేజస్వి రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవంక వామపక్షాలకు ఒకప్పటి బలం తగ్గినా 2020లో కూడా 4.4 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో ఎం.ఎల్ పార్టీది ప్రధాన స్థానం కాగా వారి పెద్దన్న వైఖరి వామపక్ష ఐక్యత తగినంతగా పెరగకుండా ఆటంకమవుతున్నదని సీపీఐ(ఎం) భావిస్తున్నది. ఈ కాలంలో చెప్పుకోదగిన అనేక పోరాటాలు, ఉద్యమాలు కూడా జరిగాయి. సీపీఐకి కూడా సంప్రదాయికంగా కొన్ని కేంద్రాలున్నాయి. మొన్నటి జులై 9 సమ్మెకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు ఎం.ఎ.బేబి, డి.రాజా బీహార్‌లోనే వుండటం గమనించదగింది. ఉత్తర భారత దేశంలో బీజేపీ చేజిక్కని ఈ ఏకైక రాష్ట్రాన్ని ఈసారైనా బీజేపీ వ్యతిరేక పాలనలోకి తీసుకురావడం కీలక కర్తవ్యంగా మారింది. మిగతా పార్టీలు కేవలం కులాల లెక్కలే తీసుకుంటే వామపక్షాలు మాత్రం జాతీయ స్థాయిలో కార్పొరేట్, మతతత్వ కూటమిని ఓడించడం కీలకంగా భావిస్తున్నాయి. బీహార్‌లో ఇండియా వేదిక యథాతథంగా కొనసాగడానికి వామపక్షాల పాత్ర కూడా మరో ముఖ్య కారణం. ఇందుకు భిన్నంగా నితీశ్ కుమార్ 2024 ఎన్నికలకు ముందు కూడా రకరకాలుగా ఊగిసలాటలు సాగించిన తీరు దేశంలో నవ్వుల పాలైంది. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కూడా నాలుగో కూటమి అంటూ బీహార్ కూడా సందర్శించడం నాయకత్వం ఎవరు వహించాలనే దానిపై ఉభయులూ చెరో విధంగా మాట్లాడటం గుర్తుండే వుంటుంది. అవకాశవాద రాజకీయాలకు పగ్గాలు వేసి లౌకిక శక్తుల ఐక్యత కొనసాగించాలంటే వామపక్షాల పాత్ర వుండాలనే దానికి బీహార్ ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో అవినీతి, ఏకపక్ష పోకడల వంటి ఆరోపణలు ఎన్ని వున్నా బీజేపీతో ఒకసారి కూడా పరోక్షంగానైనా చేయి కలపకపోవడం ఆయన లౌకిక నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. సరిగ్గా ఈ కారణంగానే ఇతర పాలక పార్టీల నాయకుల వలె గాక ఆయనది మాత్రమే జంగిల్ రాజ్ ఆటవిక పాలన అని మోడియా మోత మోగిస్తుంటుంది. ‘సుశాశన్ బాబు’ బిరుదు ధరించిన నితీశ్ హయాంలో ఏకంగా 18 వంతెనలే కొట్టుకుపోవడం కన్నా ఇందుకు మరో ఉదాహరణ అవసరం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరాచకం తాండవించిందని గగ్గోలు పెట్టిన బడా మీడియా ఇప్పుడు మాత్రం దీన్ని ప్రముఖంగా చెప్పడంలేదంటే బీజేపీ వెనక వుండటమే కారణం. ఇప్పటికీ కూడా ఈ వర్గాలు బీజేపీ నితీశ్ కలయికనే ఎక్కువగా చూపుతూ ఇండియా వేదిక అవకాశాలను తక్కువగానే చూపిస్తున్నాయి. అయితే అవినీతి, అసమర్థ పాలనకు తోడు నితీశ్ కుమార్ ప్రతిష్ట దిగజారడంతో పాటు ఆరోగ్యం కూడా ఈ కాలంలో బాగా దెబ్బతిన్నది. వేదికలపైనే ఆయన ఏం మాట్లాడుతున్నారోనని మొహాలు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. బహిరంగ సభల్లో ఐఎఎస్‌లను వేడుకోవడం, కాళ్లు పట్టుకోవడం వంటి విపరీతాలను చూసి జనం విస్తుపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆయన ప్రగతి యాత్ర వంటి తతంగాలతో శక్తిని మించి తంటాలు పడుతున్నారు. బీహార్ అంటేనే నితీశ్ గుర్తుకు వస్తాడనేది వారి జపంగా మారింది. గతంలో అమిత్‌షా వంటి వారు నాయకత్వం కూచుని మాట్లాడుకోవటం అన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ‘దో హజార్ పచీస్ ఫిర్ సే నితీష్’ నినాదం ఎత్తుకున్నారు.
మైనార్టీలపై కుట్ర? సుప్రీం తీర్పు?
ఇందుకు భిన్నంగా లాలూ పగ్గాలు తేజస్వికి అప్పగించడమే గాక మరో కుమారుడైన తేజ్ ప్రతాప్‌ను బయటికి పంపించేశారు. సోషల్ ఇంజనీరింగ్ అనే ఈ బీసీ, ఎస్‌సీ కులాల సమీకరణ వ్యూహంతో సమిస్తిపూర్, దర్భంగా, మధుబని, కోశ్లీ, మిథిలాంచల్ వంటి చోట్ల కూడా ఆర్జేడీ కూటమి పట్టు పెంచుకున్నట్టు అంచనాలు వేస్తున్నారు. దీనికే తేజస్వి మా బాప్ అలయన్స్ (ముస్లిం యాదవ్, బహుజన, అగాధీ, ఆధీ అబాడి) అని పేరు పెట్టారు. యూపీలో మాయావతిని 2012లో ముఖ్యమంత్రిని చేసిన ఫార్ములాను అనుసరిస్తున్నట్టు మీడియా వ్యాఖ్యానిస్తున్నది. బీజేపీ మత రాజకీయాలు, హిందూత్వ పోకడలు మైనార్టీలను దూరం చేస్తుండగా బీహార్‌లో ఆ అవకాశం మరింత ఎక్కువగా వుంది. మోడీ 2015లో కూడా అప్పటి నితీశ్, లాలూ కలయికను పాకిస్తాన్ కూటమిగా ప్రచారం చేసి భంగపడటం తెలిసిందే. మొన్న పహల్గాం దాడి తర్వాత ఆయన బీహార్ నుంచే నరాల్లో సిందూర్ ప్రవహస్తోందని పెద్దగా ప్రకటించడం దాన్ని గుర్తుచేసింది. అయితే ఇలాంటి అతిశయోక్తులు లౌకిక వాదులనూ అల్ప సంఖ్యాకులను మరింత దూరం చేశాయి. కనుకనే ఇప్పుడు ‘సర్’ (ఎస్‌ఐఆర్) పేరిట ఎన్నికల సంఘం ద్వారా ఓట్ల అత్యవసర తనిఖీ చేపట్టడానికి కారణమదే. దొడ్డిదారిలో పౌరసత్వ సవరణ చట్టం వర్తింపచేసి లక్షలాది మైనార్టీ ఓట్లను తొలగించడం ద్వారా మొత్తం 89 స్థానాల్లో ఫలితాలు తారుమారు చేయొచ్చన్నది ఇక్కడ కుటిల ఎత్తుగడ. ఓటు పోయినవారు దానిపై కోర్టుకు వెళ్లడానికి కూడా సమయం వుండదని స్వయంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. రాజ్యాంగ పరంగా ఓట్ల జాబితాల తనిఖీకి అభ్యంతరం చెప్పకపోయినా ఈ సమయంలో 11 పత్రాలు చూపించాలంటూ మెడపైన కత్తి పెడితే ఎలాగని ప్రశ్నించింది. జులై 20 దీనిపై తదుపరి విచారణ వుండబోతుంది. ఏ దశలోనైనా సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయమైనా ప్రకటించవచ్చుననే వాస్తవం ఎన్‌డీఏకు కొంత ఆందోళనగా వుంది. వలస కార్మికులు అధికంగా వుండే బీహార్‌లో సాధారణ నివాసం వుండే చోట మాత్రమే ఓటు వుంటుందని ఎన్నికల సంఘం ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కలనే 12 లక్షల మంది దాకా బీహార్ కార్మికులు వుంటారని అంచనా. వారు బీహార్‌లోనే వున్నా స్థిరమైన ఇల్లు వంటివి వుండవు గనక అధికార పత్రాలన్నీ వుండకపోవచ్చు. వారందరినీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం చొరబాటుదారులుగా చూపించి ఓట్లు తీసేయడం పెద్ద కుట్ర. మహారాష్ట్ర ఎన్నికల తరుణంలో చేసిన ఈ కుట్ర బీహార్‌లో ముందే ప్రారంభించారని ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ముందే చేసిన ఆరోపణ అంతర్జాతీయంగా ప్రచారమైంది. ఈ పూర్వ రంగంలో అటు రాజకీయ కలయికలు ఇటు రాజ్యాంగ పరమైన అంశాలు ఎలా ముగుస్తాయో చూడాలి. ఇరవై ఏళ్ల నితీశ్ పాలనకు ఈ ఏడాది చివరి అంకమేనా? కేంద్రంలో స్వంతంగా మెజార్టీ కోల్పోయిన బీజేపీకి బీహార్ మరో చివరి దెబ్బ వేస్తుందా?
– తెలకపల్లి రవి
చరమాంకంలో నితీశ్ పాలన? ఈసీకి సుప్రీం షాక్?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES