– అమ్మకాల్లో 10 శాతం పెరుగుదల
– సగటున నాలుగేండ్లలోపే అమ్మకం
– రూ.4 లక్షల కోట్లకు మార్కెట్
న్యూఢిల్లీ : కొత్త కార్ల ధరలు భారీగా పెరగడంతో అనేక మంది పాత కార్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉపయోగించిన (యూస్డ్) కార్ల విక్రయాలు 60 లక్షల యూనిట్లను దాటే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. విలువ ఆధారిత డిమాండ్, డిజిటల్ క్రయ విక్రయ వేదికల విస్తరణ, వాహన ఫైనాన్స్ లభ్యత మెరుగుదల ఈ మార్కెట్‌కు మద్దతును అందిస్తుందని పేర్కొంది. క్రిసిల్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం.. కొత్త కార్ల అమ్మకాలతో పోల్చితే ఉపయోగించిన కార్ల విక్రయాలు 1.4 నిష్పత్తికి చేరుకున్నాయి. అంటే రెండు కొత్త కార్ల అమ్మకాలు జరిగితే.. మూడు పాత కార్లు విక్రయానికి వస్తున్నాయి. ఇది ఐదేండ్ల క్రితం 1.0 కంటే తక్కువగా ఉండేది. అంటే అప్పుడు ఒక్కటికి.. ఒక్కటిగా అమ్మకాలు జరిగేవి. ఉపయోగించిన కార్ల విలువ కొత్త కార్ల కంటే రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతోంది. ఈ యూస్డ్ కార్ల మార్కెట్ విలువ సుమారు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది కొత్త కార్ల విక్రయాల విలువతో దాదాపు సమానంగా ఉండటం విశేషం. ఆర్థిక సంవత్సరాలు 2017-24 మధ్య యూజ్డ్ కార్ల విక్రయాలు మందకోడిగా 5 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు వృద్ధి చోటుచేసుకోనుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి అంచనా వేశారు. ”ఉపయోగించిన కార్ల విక్రయాల నిష్పత్తి ఐదేండ్ల క్రితం 1.0 కంటే తక్కువ నుంచి 1.4 రెట్లకు మెరుగుపడడం, వినియోగదారుల విశ్వాసం పెరగడం, డిజిటల్ విక్రేతల వేదికలు పెరగడం ఈ రంగంలో మార్పును సూచిస్తుంది. ఉపయోగించిన కార్ల సగటు విక్రయ వయస్సు 3.7 ఏండ్లకు చేరుకుందని అంచనా. ఇది వేగవంతమైన మార్పు, ఇది పాత, కొత్త వాహనాల పట్ల పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.” అని అనుజ్ సేథి పేర్కొన్నారు.
పాత కారు కొనేస్తే పోలా..!
- Advertisement -
- Advertisement -