Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యలో అంతరాలు

విద్యలో అంతరాలు

- Advertisement -

– అసమానతలు లేని విద్యతోనే భవిష్యత్‌
– పౌర స్పందన వేదిక రౌండ్‌ టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
: విద్యలో అంతరాలు ఉండకూడదనీ, అసమానతలు లేని విద్యే సమాజ భవిష్యత్‌కు దారి చూపుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”విద్యలో అంతరాలు సమసిపోయేదెట్టా?” అనే అంశంపై వేదిక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ 1991 తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా ప్రయివేటు పాఠశాలల్లోనూ తీవ్ర అంతరాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్థిక స్థోమత ఆధారంగానే చదువు దొరుకుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దిక్కులేనోళ్లకేనా? అనే చర్చ సాగాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, పౌరసమాజం స్పందించాల్సినంతగా స్పందించటం లేదని చెప్పారు. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే..రాబోయే కాలంలో సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యలో ఏర్పడిన అసమానతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశమివ్వకూడదని సూచించారు. సామాజికంగా వెనుకబడిన వారే ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారనేది ఒక సత్యమని చెప్పారు. కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ, తక్కువ ఫీజులు తీసుకుంటున్న ప్రయివేటు పాఠశాలల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు 95శాతానికి పైగా చదువుతున్నారని వివరించారు. చదువుల్లో ఉన్న అంతరాలు బాల, బాలికల మనుస్సుల్లో హెచ్చుతగ్గులు కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైర్డ్‌ డీఈవో నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో విద్య అతి ముఖ్యమైన అంశమన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలున్నా..వాటికంటే ఇదే కీలకమైందని చెప్పారు.అయితే దీనిలో అసమానతలు తొలగించాలని సూచించారు. పాఠశాల అంటేనే భవిష్యత్‌ అని వ్యాఖ్యానించారు. అసమానతలు లేని, నాణ్యమైన విద్యను ప్రభుత్వాలు అందించటం ఒక ప్రాథమిక హక్కని తెలిపారు.పాఠశాల స్థాయిలో కామన్‌ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఎంవీ ఫౌండేషన్‌ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ అసమానతల విద్యను రాజకీయ సమస్యగా చూసినప్పుడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రయివేట్‌ విద్యకు అనుమతులిస్తున్న క్రమంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయటం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని నిలదీశారు.
డీబీఎఫ్‌ జాతీయ అధ్యక్షులు శంకర్‌ మాట్లాడుతూ దిక్కులేని పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలల్లో అతి తక్కువ మంది ఉన్నారని వివరించారు. ప్రయివేటు రంగంలో 36లక్షల మంది ఉంటే..అందులో 37వేల మంది మాత్రమే దళిత, గిరిజన విద్యార్థులని చెప్పారు. బెస్ట్‌ అవైల్‌బుల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సంబంధించిన బకాయిలను నేటికీ ప్రభుత్వం చెల్లించకపోవటం మూలంగా వారి సర్టిఫికెట్లు ఆయా పాఠశాలల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇదంతా ప్రభుత్వం సృష్టించే అసమానత కాకపోతే మరేంటని? ప్రశ్నించారు.
తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం మాట్లాడుతూ విద్యలో ప్రయివేట్‌ రంగం పట్టు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేట్‌లోనూ అసమానతలు పెరిగాయని చెప్పారు. వ్యాపారీకరణలో విద్యకూడా ఒక భాగమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత ఉండదని నమ్మించే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో పట్నం నాయకులు కేవీఎస్‌ఎన్‌ రాజు,పేరెంట్‌ కమిటీ అధ్యక్షులు మహబూబ్‌అలీ, నాగార్జున సురేంద్రబాబు, సాయిబాబు,తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -