Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవలస కార్మికుల సంక్షేమ రాష్ట్రం కేరళ !

వలస కార్మికుల సంక్షేమ రాష్ట్రం కేరళ !

- Advertisement -

– ఈ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసిన తొలి రాష్ట్రం
– జెనీవా ఐఎల్‌ఓ సమావేశంలో పత్రం సమర్పించిన
– కేరళ ప్రణాళికా బోర్డు సభ్యులు రవి రామన్‌
జెనీవా :
వ్యవస్థాగత, సంఘటిత కార్మిక సంక్షేమ చర్యలు చేపట్టడం, సర్వతోముఖాభివృద్ధిని సాధించడం ద్వారా కేరళ సంక్షేమ రాష్ట్రానికి, ముఖ్యంగా వలస వచ్చిన కార్మికుల సంక్షేమానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ నెల 2 నుంచి 4వరకు జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)లో ‘రెగ్యులేటింగ్‌ ఫర్‌ డీసెంట్‌ వర్క్‌’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సమర్పించిన ఒక పత్రం ఈ అంశాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యుడు కె.రవి రామన్‌ ఈ పత్రాన్ని సమర్పించారు. వలస కార్మికుల సంక్షేమ వ్యవస్థ దిశగా మరింత మెరుగైన ఆర్థిక, ద్రవ్య వ్యూహాన్ని రూపొందించే అవకాశాన్ని కూడా ఈ పత్రం సూచించింది. అలాగే ఈ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ కార్మికులకు గౌరవప్రదమైన పనిని కల్పించడానికి హామీ కల్పించడంతో సహా వారి జీవన పరిస్థితులను మెరుగ్గా ఉండేలా చేయడానికీ, మరో ఐదేండ్లపాటు వారి సంక్షేమ ప్రయోజనాలు కొనసాగించడానికి రాష్ట్రానికి అయ్యే వ్యయం రూ.454కోట్లుగా ఉంటుందని కూడా ఆ పత్రం అంచనా వేసింది. అంతరాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ) చట్టం, 1979ని సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రం కేరళ అని రామన్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చిన కార్మికుల వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా వారికి సమగ్ర సంక్షేమ ప్యాకేజీ అందచేయడం ద్వారా ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేశారన్నారు. వలస కార్మికుల సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం కార్మిక విభాగం, అలాగే కేరళ బిల్డింగ్‌ అండ్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డుతో కలిసి సంయుక్తంగా దాన్ని అమలు చేస్తోంది. వలసకార్మికుల ఆరోగ్య, విద్యాపరమైన అవసరాలకు సాయమందించడం, ఒకవేళ చనిపోతే అందుకు సంబంధించిన ప్రయోజనాలు ఇవ్వడం, మృతి చెందిన కార్మికుడి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి పంపించడం, శాశ్వత వైకల్యం పొంది, పనిచేయలేని పక్షంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయమందించడం, వైద్య ప్రయోజనాలు, ఒకవేళ పని నుంచి తొలగిస్తే అందుకు సంబంధించిన భృతి, విద్యాపరమైన గ్రాంట్లు, ప్రసూతి లబ్ది ఇలా మొత్తంగా వారికి అవసరమైన సామాజిక భద్రతా చర్యలు తీసుకుంటోంది. కార్మిక విభాగం, సంక్షేమ బోర్డు, రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఈ మూడు కలిసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వలస వచ్చిన కార్మికులు నెలకు దాదాపుగా రూ.4వేలు చొప్పున మిగులు ఆదాయం లేదా పొదుపు మొత్తాలు దాచుకోగలుగుతారు. పైగా ఇందులో దాదాపు 32శాతాన్ని అంటే ఏడాదికి రూ.30వేలకు పైగా మొత్తాన్ని స్వగ్రామంలోని కుటుంబాలకు పంపుతారు. ఇలా కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వార్షికంగా వెళ్లే మొత్తం దాదాపుగా రూ.7500కోట్ల నుంచి రూ.8వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, జనాభా మార్పులు, సంతానోత్పత్తి రేటులో మార్పులు ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వలసలకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా కేరళ రాష్ట్రానికి ఆ హోదాను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆ పత్రం పేర్కొన్నది. రాష్ట్రంలో వృద్ధులు అంటే ఏ పని చేయలేని వారి నిష్పత్తి దాదాపుగా 14 శాతం ఉంది. అంటే జాతీయ సగటు 9శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. అలాగే సంతానోత్పత్తి రేటు కూడా 1.5కి క్షీణించింది. అంటే రీ ప్లేస్‌మెంట్‌ స్థాయి కన్నా బాగా తక్కువ. ఈ పరిస్థితి స్థానికంగా కార్మికుల సంఖ్య క్షీణించడానికి దారి తీస్తోంది. కార్మిక శక్తిలో గణనీయమైన భాగం ఉండే షెడ్యూల్డు కులాల్లో ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో సగటు జనాభా వృద్ధిరేటు నెగిటివ్‌లోకి వెళుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు ఈ పరిస్థితికి చేరుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మరణ, సంతానోత్పత్తి రేటు ఒక నిశ్చల స్థాయికి చేరుకోవడంతో కార్మికుల కోసం కేరళ డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం ఆ అవసరాన్ని, కొరతను అంతరాష్ట్ర వలస కార్మికులు తీరుస్తున్నారు. వారికి ఇవ్వజూపే వేతనాలు కూడా అధికమే. ఈ వేతనాలు అఖిల భారత సగటు రూ.417.3గా ఉండగా, కేరళలో రూ.893.6గా ఉన్నాయి. అధిక సంతానోత్పత్తి గల, తక్కువ వేతనాలు కలిగిన ప్రాంతాల నుంచి తక్కువ సంతానోత్పత్తి, అధిక వేతనాలు కలిగిన ప్రాంతాలకు సాధారణంగా వలసలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఇలా కార్మికులు వలసవచ్చే రాష్ట్రాల్లో కూడా సంతానోత్పత్తి రేట్లు క్షీణించడం, పెరుగుతున్న వేతనాలతో కేరళకు సమీప భవిష్యత్తులో వచ్చే వలస కార్మికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని రామన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -