ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా 40 ఏండ్లు పూర్తి చేసుకుంటే అదో గొప్పగా భావిస్తున్న కాలంలో మనం బతుకుతున్నాం. ఎందుకంటే 30 దాటితే చాలు షుగర్‌లు, బీజీలు, మోకాళ్ల నొప్పులు, చివరకు గుండె జబ్బులు కూడా వచ్చిపడుతున్నాయి. అలాంటిది ఈ అవ్వకు 110 ఏండ్లు ఉంటాయంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే! అన్నింటికీ మించి ఈ వయసులోనూ భలే హుషారుగా ఉన్నది. తన పని తానే చేసుకుంటుంది. మాటల్లో తడబాటు లేదు, వినికిడి లోపం లేదు, కంటి చూపు తగ్గలేదు, మనిషిలో శక్తి లోపం లేదు. నేటి కాలుష్య సమాజంలో ఇలాంటి మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన వారిలో ఒకరు మన అలుగుబెల్లి రామ నర్సమ్మ.
‘అవ్వ ఏందే ఇంత గట్టిగా ఉన్నావ్.. 110 ఏండ్లు వచ్చినవి.. నీ జీవిత రహస్యం ఏంటి. ఓ నొప్పి లేదూ.. ఓ రోగం లేదు.. నీ జీవితం ధన్యమైపోయిందే అవ్వ.. నిన్ను కన్నందుకు మీ అమ్మాయ్యకు మొక్కల్నే’. ‘ఏమో బిడ్డ.. నా చేతుల్లో ఏమున్నది.. మా కాలంలో బువ్వ దొరికేదే మాకష్టం ఉండే. కూలినాలి పనులు మాకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయం పని చేసుకొని బతికే వాళ్ళం. ఒక పూట బువ్వ, ఒక పూట గటక తినే జీవించేవాళ్ళం. పొద్దున లేచిన కానించి రాత్రి పడుకునే వరకు వ్యవసాయం, కూలినాలి పనులు తప్ప మాకు వేరే ధ్యాస ఉండేది కాదు బిడ్డా. ఇప్పుడు మీకు ఏమి కావాలంటే అవి దొరుకుతున్నాయి. అన్ని రకాల వస్తువులు వున్నాయి. తీరొక రకాల వంటలను రుచులను తింటున్నారు. మీదే బాగున్నది మాది ఏమున్నది’ అంటూ నవ్వుతుంది అవ్వ.
రోగమంటే తెలియదు
నల్లగొండ జిల్లా, కట్టంగూరు మండలం, పరడా గ్రామానికి చెందిన ఎళ్ళ బ్రహ్మయ్య, రామక్కకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు పుట్టారు. ఆ కూతురే అలుగుబెల్లి రామ నర్సమ్మ. ప్రస్తుతం ఈమె వయసు 110 ఏండ్లు. ఇప్పటికీ ఎంతో హుషారుగా జీవిస్తున్నది. ఈ అవ్వకు ఇద్దరు కూతుళ్లు, మనవళ్లు, మనవరాలు, ముని మనవళ్లు ఉన్నారు. అవ్వ భర్త రాంరెడ్డి చాలా ఏండ్ల కిందటే చనిపోయాడు. అయినా ఎప్పుడూ నిరుత్సాహం లేకుండా బతుకు పోరాటం సాగిస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ ఆమె దరి చేరలేదు. ఎలాంటి మందులూ వాడకుండా ఆనందంగా జీవిస్తుంది. తన బిడ్డల ఇంట్లో, మునిమనవళ్లతో ఆడుకుంటూ హాయిగా కాలం గడుపుతుంది.
మూడతరాల మనుమలతో…
రామ నర్సమ్మ ఒక పూట మాత్రమే అన్నం తింటుంది. మరో పూట బిస్కెట్లతో సరిపెట్టుకుంటుంది. ఈమెను చూస్తే ఎవ్వరైనా సరే ఆశ్చర్య పోకుండా ఉండలేరు. మూడుతరాల మనుమలు, మనుమరాళ్లను చూస్తూ ఆనందంగా జీవనం గడుపుతున్నది. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడి సగటు జీవితం 50 నుండి 70 ఏండ్లు మాత్రమే. అంతకు మించి బతకడమే మహాగగనం. 40 ఏండ్లు దాటాయంటే అనేక రకాల రోగాలతో సతమవుతున్నాము. హాస్పిటల్స్‌లలో డబ్బులు దార పోయాల్సిన పరిస్థితి. మందు బిళ్ల లేనిదే జీవితం గడవడం కష్టమే. దీనికి కారణం కలుషిత ఆహారం. మనం తినే ప్రతి ఆహారం కల్తి. చివరకు మనుషులు కూడా కలుషితం అవుతున్న కాలం. ఇలాంటి కాలంలో ఈ అవ్వ అందరికీ ఆదర్శంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
అవ్వ ఏం తినేదానివే?
‘మా కాలంలో బువ్వ దొరికేదే మా కష్టంగా ఉన్న పరిస్థితి. పొలాల దగ్గర ఒండ్రు మట్టి ముద్దలు చేసుకొని తినేవాళ్ళం. మేము పండించిన వడ్లు, జొన్నలు రాగులు, రోట్లో దంచుకొని పొట్టు చేరుకొని వండుకొని తినేవాళ్ళు. అదే మాకు బంగారం అప్పట్లో. మేము పండించుకున్న కూరగాయలు, ఆకు కూరలే తినేవాళ్ళం. మందులు మాకులు వంటివి ఏవీ మాకు తెలవదు బిడ్డ’ అంటూ ఏమాత్రం తడుముకోకుండా, తడబడకుండా చెప్పేసింది.
ఆరోగ్యం ఎలా ఉంది?
‘నా ఆరోగ్యానికి ఏమైంది బిడ్డ. నాకు ఇంకా ఏం కావాలి 110 ఏండ్లు వచ్చినాయి. నా తోడబుట్టిన అన్నదమ్ములు, వదినలు ఎప్పుడో చనిపోయారు మా ఆయన యాభై ఐదేండ్ల కిందటే చనిపోయాడు. మూడు తరాల మనుమళ్లు, మనవరాళ్లు పిల్లలను చూసుకున్నా. ఇది చాలు నాకు. చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డకి ఇప్పుడు 80 ఏండ్లు వచ్చాయి. ఇప్పటి వరకు చెవులు, కండ్లు బాగా పని చేస్తున్నాయి. మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నాను. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి బిడ్డ’ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.
అప్పట్లో ఏమైనా పోరాటాల్లో పాల్గొన్నావా అవ్వా?
అప్పట్లో గ్రామాలపై రజాకార్లు దాడి చేసేవారు. కాల్చి చంపే వాళ్ళు. మా ఊరికి వచ్చినప్పుడు మేము దాచుకున్నాం. మమ్ములను పట్టుకొని దెబ్బలు కొట్టారు. మేము పారిపోయాం.
ఇప్పటి తరానికి ఏం చెబుతావు?
ఏముంది బిడ్డ చెప్పా.. అంతా తెలిసిందే. అందరూ కలిసిమెలిసి ఉండాలి. కుటుంబంతో గౌరవ మర్యాదలుగా ఉండాలి. ఈ పాడు పడ్డ తిండి అంతా తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఈ కొట్లాటకు, గొడవలకు దూరంగా ఉండండి. సమాజంలో గౌరవంగా బతకండి.