Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలుజడేజా పోరాడినా..

జడేజా పోరాడినా..

- Advertisement -

లార్డ్స్‌ టెస్టులో భారత్‌ ఓటమి
22 పరుగులతో ఇంగ్లాండ్‌ పైచేయి
నవతెలంగాణ-లండన్‌

లార్డ్స్‌ టెస్టులో భారత్‌ లక్ష్యం 193 పరుగులు. 39.3 ఓవర్లలో టీమ్‌ ఇండియా 112 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్‌సేనపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. నాలుగు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించినా.. మరోసారి ఓటమి తప్పటం లేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ దశలో రవీంద్ర జడేజా (61 నాటౌట్‌, 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అసమాన పోరాట పటిమ చూపించాడు. టెయిలెండర్లతో కలిసి ఇంగ్లాండ్‌ను భయపెట్టాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13), జశ్‌ప్రీత్‌ బుమ్రా (5), మహ్మద్‌ సిరాజ్‌ (4)తో కలిసి స్ఫూర్తిదాయక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో భారత్‌కు సైతం గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (1/6) గాయం వేధిస్తున్నా మాయ చేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ను అవుట్‌ చేసి ఇంగ్లాండ్‌కు మెరుపు విజయాన్ని అందించాడు. 74.5 ఓవర్లలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులు చేసింది. 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ఉద్విగ విజయం సాధించింది. రవీంద్ర జడేజా అర్థ సెంచరీతో అజేయంగా నిలిచాడు. టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ 2-1తో ముందంజ వేసింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో నాల్గో టెస్టు 24 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.


ఆ ఇద్దరి వైఫల్యంతో..
ఓవర్‌నైట్‌ స్కోరు 58/4తో ఐదో రోజు ఛేదనకు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (39, 58 బంతుల్లో 6 ఫోర్లు) ఎంతోసేపు వికెట్‌ నిలుపుకోలేదు. జైస్వాల్‌ (0), గిల్‌ (6), కరుణ్‌ నాయర్‌ (14), ఆకాశ్‌ దీప్‌ (1) నాల్గో రోజే నిష్క్రమించారు. దీంతో భారత్‌ ఆశలన్నీ రిషబ్‌ పంత్‌పైనే పెట్టుకుంది. భీకర ఫామ్‌లో పంత్‌కు ఇటువంటి ఉత్కంఠ ఛేదన కొత్త కాదు. కానీ జోఫ్రా ఆర్చర్‌ మెరుపు బంతికి పంత్‌ (9) వికెట్‌ కోల్పోయాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (0) సైతం ఆర్చర్‌కు దాసోహం అయ్యాడు. ఇద్దరు కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరటంతో భారత్‌ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. అయినా.. నితీశ్‌తో 91 బంతుల్లో 30 పరుగులు, బుమ్రాతో 132 బంతుల్లో 35 పరుగులు, సిరాజ్‌తో 80 బంతుల్లో 23 పరుగులు జోడించిన జడేజా.. భారత్‌ను ఆఖరు వరకు రేసులో నిలిపాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 150 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జడేజా ఓ ఎండ్‌లో నిలబడినా ఇంగ్లాండ్‌ టెయిలెండర్ల కథ ముగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.


సిరాజ్‌కు జరిమానా
మహ్మద్‌ సిరాజ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పడింది. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ను అవుట్‌ చేసిన సిరాజ్‌.. దూకుడుగా సంబురాలు చేసుకున్నాడు. డకెట్‌ పెవిలియన్‌కు వెళ్తుండగా అతడిని కవ్వించాడు. ఐసీసీ క్రమశిక్షణావళి ఆర్టికల్‌ 2.5ని ఉల్లంఘించిన సిరాజ్‌కు మ్యాచ్‌ రిఫరీ ఫీజులో కోత, ఓ డీమెరిట్‌ పాయింట్‌ను విధించారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 387/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 387/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 192/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 170/10 (జడేజా 61 నాటౌట్‌, రాహుల్‌ 39, ఆర్చర్‌ 3/55, స్టోక్స్‌ 3/48)

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img