Tuesday, July 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదలది బతుకు పోరు

పేదలది బతుకు పోరు

- Advertisement -

తలదాచుకోవడానికి గూడు లేని పరిస్థితి
ఇండ్లు, ఇండ్ల జాగాలివ్వాలి
గుడిసెలే లేని దేశమన్న మోడీకి పేదల గోడు వినిపిస్తలేదా..?
11 ఏండ్లలో పేదలకు ఇచ్చిన ఇండ్లెన్నీ..
ప్రతిపక్షంలో ప్రజల పక్షం..అధికారంలో కార్పొరేట్ల పక్షమా..?
బసవతారకనగర్‌ వాసులకు ఇచ్చిన హామీని సీఎం అమలు చేయాలి
పేదలకు ఇండ్లు ఇచ్చే వరకూ పోరాటం
వారి కోసం జైలుకైనా వెళ్తాం.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

పేదలది బతుకు పోరాటమనీ, వారికి తలదాచుకోవడానికి గూడు, విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నాయకులు వారికి సేవ చేయాల్సింది పోయి.. వారి భూములను అప్పనంగా కాజేసి కార్పొరేట్లకు అప్పగిస్తున్న పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రాజ్యం వస్తేనే వారి సమస్యలు తీరుతాయని.. దాని కోసమే ఎర్రజెండా పోరాటమని స్పష్టం చేశారు. సోమవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘పేదలకు ఇండ్లు, ఇండ్ల జాగాలు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇండ్లు లేని నిరుపేదలు తరలివచ్చారు. తమకు ఇండ్లు, ఇండ్ల జాగాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ‘ఓట్లు మావి.. బోగం మీదా?, మీరు బంగ్లాల్లో.. మేము మురికి కంపుల్లో.. మూసీ వాడల్లోనా..? మీ పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్లల్లో.. మా పిల్లలకు సర్కారు బడులా.. మీకు ఎందుకు ఆ భోగాలు.. మాకెందుకు ఈ తిప్పలు’ అంటూ నినాదాలు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గూడు కోసం ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ గుడిసె వేసుకుంటామని, ఎవరొచ్చి ఆపుతారో ఆపండి’ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో గుడిసెలే లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామని చెబితే… పేదలందరికీ పక్కా ఇండ్లు ఇస్తారని భావించామని, కానీ అధికారంలోకొచ్చి 11 ఏండ్లు గడుస్తున్నా ఎక్కడా ఇండ్లు ఇచ్చింది లేదని అన్నారు. పైగా పేదల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లంటూ పదేండ్లపాటు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 30 లక్షల మంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారన్నారు. అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల జాగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు, ఇండ్ల జాగాలు ఇవ్వకపోగా వారు వేసుకున్న గుడిసెలపై దాడులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని బసవతారకం కాలనీవాసులపై గూండాలతో దాడులు చేయించి, పేదల నుంచి ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బసవతారకం కాలనీవాసులకు అండగా ఉంటానని హామీఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వేసుకున్న గుడిసెలు కూడా కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాహెబ్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 71లో 142 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 25 ఎకరాలే మిగిలిందన్నారు. సుమారు 115 ఎకరాలు కబ్జాకు గురైతే దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు. మిగిలిన 25 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటామంటే అరెస్టులు చేస్తోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములన్నీ పేదలకు చెందాల్సిందేనని, ఆ భూములు ఇండ్లు లేని వారికి కేటాయించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇవ్వకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెల పోరాటం కొనసాగుతుందన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ గుడిసెలు వేస్తామని, పేదల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. అంతకుముందు కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి జిల్లాలోని పరిస్థితులపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యదర్శులు నర్సిరెడ్డి, ఎల్లయ్య, వెంకన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేల్‌, చంద్రమోహన్‌, జి.కవిత, జగదీశ్‌, ఈ.నర్సింహ, కె. జగన్‌ తదితరులు పాల్గొన్నారు.


గ్రేటర్‌ వరంగల్‌లో..
గ్రేటర్‌ వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పారుకి స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు, రత్నమాల, ఆరూర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -