– బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-బోడుప్పల్
కాంగ్రెస్ డైరెక్షన్‌లోనే మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేశారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధమూ లేదని తాను చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సామెతలో భాగమేనన్నారు. ఆదివారం తనపైనా.. తన మీడియా సంస్థపైనా కవిత మనుషులు విచక్షణారహితంగా దాడులు చేయడమే కాకుండా తనను చంపే కుట్ర చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాన మంత్రిని కలిసి 9వ షెడ్యూల్‌లో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ పార్టీ డ్రామాలు మొదలు పెట్టిందని, దానికి కవిత వంత పడుతున్నారని విమర్శించారు. బీసీలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని, ఇప్పుడు బీసీలందరూ సంఘటితమయ్యారని అన్నారు. తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. తనపై హత్యాయత్నం చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. దాడికి గురైన వారిపైనే కేసులు నమోదు చేయడం వెనుక పోలీసుల ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని వాపోయారు. తనపై జాగృతి పేరిట జరిగిన హత్యాయత్నంపై శాసనమండలి చైర్మెన్‌తోపాటు బీసీ కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మెన్ సుదగాని హరిశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డైరెక్షన్‌లోనే కవిత యాక్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES