– జీడిమెట్లలో వృద్ధ దంపతులకు అస్వస్థత
– కూకట్‌పల్లి ఘటనలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
నవతెలంగాణ – సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కల్తీ కల్లు ఘటన కలకలం రేపుతోంది. కల్లు తాగిన వృద్ధ దంపతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన లచ్చిరాం, ఆయన భార్య సాక్రిభారు రెండ్రోజుల కిందట గాజుల రామారంలో తమ కుమార్తె రేఖ వద్దకొచ్చారు. ఆదివారం సాయంత్రం రాంరెడ్డి నగర్‌లోని ఓ కల్లు దుకాణంలో కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన దంపతులను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తొమ్మిదికి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య
కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగమణి సోమవారం చనిపోయారు. శుక్రవారం సాయిచరణ్ కాలనీకి చెందిన చాకలి పెద్దగంగారం(70) చనిపోయిన విషయం తెలిసిందే. గత మంగళవారం (ఈ నెల 8న) కేపీహెచ్‌బీ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లో హైదర్‌నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్లు తాగి అస్వస్థతకు గురికాగా.. నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చేరారు. కాగా, కల్తీ కల్లు కేసులో కాంగ్రెస్ నేత కూన సత్యంగౌడ్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుమారులు రవితేజగౌడ్, సాయితేజగౌడ్‌ను కూడా అరెస్టు చేశారు. వీరు హైదర్‌నగర్, ఎస్పీనగర్, ఇంగ్రానగర్‌లో కల్లు దుకాణాలు నడిపిస్తున్నారు. ఈ మూడు దుకాణాల్లోని కల్లు నమూనాల్లో ఆల్ఫ్రాజోలం కలిపినట్టు తేలింది. కల్తీ కల్లు దందాపై చర్యలు తీసుకోకపోవడంతో బాలానగర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ సీఐ డి.వేణుకుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్‌లు మాధవయ్య, జీవన్‌కిరణ్, ఈఎస్ ఫయాజ్ తదితరులపై విచారణకు ఆదేశించారు.
గాంధీ, నిమ్స్‌లో చికిత్స
గాంధీ ఆస్పత్రిలో 16 మంది కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతుండగా.. సోమవారం నలుగురు డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 36 మంది చేరగా.. 23 మందికి చికిత్స కొనసాగుతోంది. 13 మంది మూడు రోజుల కిందట డిశ్చార్జి అయ్యారు. మరో ఏడుగురిని ఇండ్లకు పంపించనున్నారు. బాధితుల పరిస్థితిని మల్టీ స్పెషాల్టీ టీం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టు నిమ్స్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు.