– బీఆర్‌ఎస్ 6.47 కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తారా?: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేషన్ కార్డుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మ్తంరి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని నిరూపిస్తే తాను చెంప దెబ్బలు తినేందుకు రెడీ అని సవాల్ విసిరారు. నాడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గతంలో ఎమ్మెల్యేగా తాను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో పంపిణీ చేశారనీ, బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీపై పత్రికల్లో ప్రకటనలిచ్చారని గుర్తుచేశారు. చౌటుప్పల్‌లో తాను పంపిణీ చేసినట్టు తెలిపారు.
కాంగ్రెస్, టీడీపీల వల్లే నల్లగొండలో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించిందని విమర్శించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల పండించే నల్లగొండ బీఆర్‌ఎస్ కాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందని తెలిపారు. జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లివ్వని రేవంత్ రెడ్డి సర్కార్ యాసంగి, వానాకాలం రైతుభరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. రైతాంగానికి రూ.27 వేల బాకీ ఉందని గుర్తుచేశారు. కాళేశ్వరంలో అన్ని బాగానే ఉన్నాయనీ, గోదావరిని కావాలనే ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. రైతు సమక్షంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్‌ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, ఎన్.భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, కె .ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీపై సీఎం అబద్ధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES