రూ.24వేల కోట్లతో వంద జిల్లాల్లో అమలు
పునరుత్పాదక వనరుల్లో పెట్టుబడులకు
ఎన్టీపీసీకి అనుమతి కేంద్ర క్యాబినెట్
సమావేశంలో పలు నిర్ణయాలు
వ్యోమగామి శుక్లాను అభినందిస్తూ తీర్మానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారంనాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే యాక్సియం – 4 మిషన్ విజయం కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు సురక్షితంగా వెళ్లి వచ్చిన భారతీయ వ్యోమగామి శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. దేశంలో రైతుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రాధాన్యత ఇస్తునట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
11 విభాగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రయివేటు రంగంతో భాగస్వామ్యం ఉన్న పథకాలతో కలిపి ప్రస్తుతం అమల్లో ఉన్న 36 పథకాలను సమన్వయం చేస్తూ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. రూ.24 వేల కోట్లతో ఈ పథకం అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పంటకోత తర్వాత నిల్వను పెంచుతుందన్నారు. ఈ స్కీమ్ ఇప్పటికే ఉన్న 36 పథకాలను ఏకీకృతం చేస్తుందని తెలిపారు. పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందని వివరించారు. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందనీ, ఈ కార్యక్రమంతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది జరుగుతుందని వివరించారు. ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, జాయింట్ వెంచర్స్, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌టీపీసీ లిమిటెడ్‌కు కేటాయింపును పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అన్నారు.
ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కేటాయింపును మంజూరు చేసిందని తెలిపారు. ఎన్‌టీపీసీ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ రూపంలో ఎన్‌జీఈఎల్‌లో ఇప్పటి వరకు రూ. 7,500 పెట్టుబడి పెట్టినట్టు వివరించారు. ఇక ఎన్‌జీఈఎల్‌లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2032 నాటికి 60 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి తోడ్పడుతుందని అన్నారు.నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈలు)కు వర్తించే ప్రస్తుత పెట్టుబడి మార్గదర్శకాల నుంచి ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్)కు ప్రత్యేక మినహాయింపును సీసీఈఏ ఆమోదించిందని తెలిపారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎన్‌ఎల్‌సీఐఎల్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ (ఎన్‌ఐఆర్‌ఎల్)లో రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, ఎన్‌ఐఆర్‌ఎల్ వివిధ ప్రాజెక్టులలో నేరుగా, లేకపోతే జాయింట్ వెంచర్ల ఏర్పాటుతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు.
పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఓకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES