నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో కన్నుమూసింది. బాలిక తొలుత తరగతి గదిలో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికను బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతోనే బాలిక మరణించినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అజ్మీర్ జిల్లాలోని బాదలియా గ్రామంలోని స్కూల్‌లో జరిగిందీ ఘటన. బాధిత బాలిక ఆరో తరగతి చదువుతోంది. పాఠాలు వింటూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలిక పల్స్ పడిపోవడం, రక్తపోటు తగ్గడంతో వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉందని, ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక గుండెపోటుతోనే మరణించినట్టు వైద్యులు అనుమానం వ్యక్తంచేశారు. కచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్కూల్ అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.