నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, క్వెట్టాలోని బీఎల్ఏ ప్రత్యేక విభాగం ఫతా స్క్వాడ్ పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడి చేసిందని తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన నిఘా విభాగం ZIRAB నుంచి నిఘా సమాచారం అందుకున్న తర్వాత ఈ దాడి చేసింది.
పాకిస్తాన్ సైనికులతో వెళ్తున్న బస్సును జిరాబ్ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు పాకిస్తాన్ సైనికులతో వెళుతోంది. ఈ దాడిలో 27 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులో ఖవ్వాలి గాయకులు కూడా ఉన్నారు.