– రీ ఎనర్జబుల్ విద్యుత్‌తో తగ్గిన కాలుష్యం
– బీఆర్‌ఎస్ నేతలు భాష మార్చుకోవాలి :ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
నవతెలంగాణ-నాగార్జునసాగర్
రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2030 సంవత్సరం వరకు 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పవర్‌హౌస్‌లో ఉత్పత్తి వివరాలను తెలంగాణ సీఎండీ హరీష్ వివరించారు. తెలంగాణ జెన్కో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విజయ విహార్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చాలా సాంకేతికమైన పరిజ్ఞానంతో ఉన్నదన్నారు. ఆరు దశాబ్దాలకు ముందే ఇక్కడ రివర్స్ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిన గొప్పతనం కాంగ్రెస్‌దే అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్యంతోపాటు విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రీ ఎనర్జబుల్ విద్యుత్‌తో కాలుష్యాన్ని తగ్గించామన్నారు. మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోలార్ పవర్ కోసం కూడా అనువైన మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. ఆర్థిక సంపద సృష్టించడం కోసం విద్యుత్ ఉత్పత్తి పెంచే అన్ని రకాల చర్యలూ చేపడతామన్నారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఏవైనా కట్టారా అని ప్రశ్నించారు. గోదావరిలాంటి పెద్ద నదిపై కూడా ఎలాంటి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించి వేగవంతం చేశామన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల భాష సరైంది కాదని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సన్యాసి అని మాట్లాడటం వారి భాషా నైపుణ్యానికి తార్కాణమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుడు నిద్రపోయిందన్నారు. కృష్ణా జలాల విషయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి పెంపునకు చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES