Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌...ట్రబుల్‌

ట్రంప్‌…ట్రబుల్‌

- Advertisement -

ఆయన విధానాలపై అమెరికా అంతటా నిరసనలు
నినాదాలతో మార్మోగిన నగరాలు
వాషింగ్టన్‌ :
అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద విధానాలను నిరసిస్తూ అమెరికన్లు రోడ్డెక్కారు. ” గుడ్‌ ట్రబుల్‌ లివ్స్‌ ఆన్‌ ” పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. పౌర హక్కుల నాయకుడు జాన్‌ లూయిస్‌ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఈ ప్రదర్శనలు జరిగాయి. ప్రదాన నగరాలతో సహా 1600 ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో పాల్గొన్న ప్రజలు సామాజిక రక్షణ కోసం, వలసదారులు, అట్టడుగు వర్గాల హక్కులకై నినదించినట్లు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. అట్లాంటాలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్మారక కట్టడం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యూయార్క్‌లోని ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం చుట్టు కవాతు నిర్వహించారు. లాస్‌ ఏంజెల్స్‌లో పోలీసుల చేతిలో మృతి చెందిన వారి ఫొటోలు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారి ఫొటోలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుతానంటూ రెండోవసారి అథికారంలోకి వచ్చిన ట్రంప్‌ ప్రతీకార సుంకాల పేరుతో మిత్ర దేశాలతో సైతం వైరం పెంచుకున్నారు. అక్రమ వలసదారుల నెపంతో సామూహిక అరెస్టులు, నిర్బంధాలు పెరిగాయి. ఇటీవలే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ( ఎస్‌బీఎస్‌ ) ప్రకటించింది. ఉద్యోగాల కల్పన కూడా ఆశించినంతగా లేదని నిరసనకారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసం గత నెలలో లక్షలాది మంది నిర్యహించిన ” నో కింగ్స్‌ ” ఉద్యమాన్ని అసాధారణంగా నేషనల్‌ గార్డులను ఉపయోగించి అణిచివేసిన సంగతి తెలిసిందే. పౌరహక్కుల నాయకుడు జాన్‌ లూయిస్‌ స్ఫూర్తితో ప్రజాస్వామ్య హక్కుల కోసం, స్వేచ్చ కోసం పోరాడతామని ఆందోళనకారులు ప్రతిన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -