‘తేదీలు, దస్తావేదులు.. ఇవి కాదోరు చరిత్ర సారం’ అన్నాడు శ్రీశ్రీ. అది నిజం.. అయితే ప్రతి విప్లవం, జాతీయ పోరాటంలో కొన్ని తేదీలు చరిత్రను మలుపు తిప్పాయి. క్యూబా చరిత్రలో 1953 జూలై 26 అలాంటిదే. డెబ్బై రెండవ వార్షికోత్సవం జరగనుంది. చరిత్రలో కోటలు, ప్రాంతాల ముట్టడి గురించి చదువుకున్నాం. వర్తమానంలోనే కాదు దిగ్బంధనాల చరిత్రలో ఇంతవరకు సోషలిస్టు క్యూబా వంటి ఏ దేశం కూడా ఆరున్నర దశాబ్దాల పాటు అమెరికా ముట్టడిలో జనాన్ని కాపాడుకుంటున్న ఉదంతం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు క్యూబన్లు ఎలా ఉన్నారు? అన్నదాన్ని పక్కన పెడితే, ఇంతకాలం కమ్యూనిస్టుల నాయకత్వం ప్రపంచ ఏకైక అగ్రరాజ్య కుట్రలను ఎలా ఎదుర్కొన్నదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం ఇది. మనం దేశంలో ‘నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా’గా ఏర్పడి క్యూబాకు మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ దేశ చరిత్ర గురించి ఈ వారం కవర్‌స్టోరీ…
తాజాగా అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ (ఒఎఫ్‌ఏసి) కార్యాలయం, కీ లాజిస్టిక్స్ అనే కంపెనీకి 6,08,825 డాలర్ల జరిమానా విధించింది. ఎందుకటా.. 2022, 2023లో 36 సార్లు నౌకలలో మూడు కోట్ల డాలర్ల విలువగల ఆహారం, చమురు బావుల యంత్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలను ఆ కంపెనీ క్యూబాకు రవాణా చేసిన ‘నేరానికి’. అంటే అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు అని అర్ధమయ్యే ఉంటుంది. ఇవే కాదు ప్రాణాధార ఔషధాలు, ఇతర వస్తువులను కూడా నిత్యం ప్రపంచానికి మానవత్వం గురించి సుభాషితాలు చెప్పే అమెరికా అనుమతించటం లేదు. ఒక్క అమెరికా నుంచే కాదు ప్రపంచంలో ఏ దేశం నుంచి ఎవరూ క్యూబాకు సరఫరా చేయటానికి వీల్లేదట. కోటి మంది జనాభా పట్ల దశాబ్దాలుగా సాగిస్తున్న అమెరికా దుర్మార్గం ఇది!
గత అధ్యక్షుడు జో బైడెన్ తొలగించిన కొన్ని ఆంక్షలను పునరుద్దరిస్తూ డోనాల్డ్ ట్రంప్ జూన్ 30న ఉత్తరువులు జారీ చేశాడు. ‘కమ్యూనిస్టు పాలనలో దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న క్యూబన్ల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణకు అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నట్లు’ దానిలో పేర్కొన్నాడు. ట్రంప్ తాజా చర్యలను అనేక మంది నేరపూరితమైనవిగా వర్ణించారు. క్యూబాను ఆక్రమించటం, అదుపులోకి తెచ్చుకోవటం అసలైన లక్ష్యమని బొలివేరియన్ అలయన్స్‌లో ఉన్న దేశాలు ఓ ప్రకటన చేశాయి. ఐరాస సాధారణ అసెంబ్లీ ఎన్నిసార్లో తీర్మానాలు చేసి ఖండించాయి. చైనాతో పాటు కొన్ని దేశాలు సాయం చేస్తున్నప్పటికీ జనమంతా ఇబ్బందులు లేకుండా ఉన్నారని కాదు. విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. టూరిజం ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ అమెరికా దాన్ని కూడా అడ్డుకుంటున్నది. ఇతర దేశాల నుంచి సాయం అందకుండా ఆంక్షలు పెడుతున్నది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర సహాయక సిబ్బందిని తయారు చేసి పలు లాటిన్ అమెరికా దేశాలకు పంపి ఉపాధితో పాటు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నది. ఎంత చేసినప్పటికీ అమెరికా ఆర్థిక దిగ్బంధనం క్యూబన్ల నవనాడులను కుంగదీస్తున్నాయి. అందుకే పలుదేశాలు క్యూబాకు సంఘీభావ నిధిని వసూలు చేసి నైతిక మద్దతును అందచేస్తున్నాయి. మనదేశంలో కూడా సిపిఎం అలాంటి పిలుపే ఇచ్చింది. గతంలో కూడా బియ్యం, పుస్తకాలు, పెన్సిళ్లు, ఔషధాల వంటి వాటిని పంపింది.
గ్రాన్మా చరిత్ర ఏమిటి?
క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక పేరు గ్రాన్మా. దానికి ఒక చరిత్ర ఉంది. అమెరికా కంపెనీ సాయుధ శిక్షణ కోసం 1943లో నిర్మించిన 18మీటర్ల పొడవుగల డీజిల్ నౌక అది. దాని యజమాని తన నాన్నమ్మ లేదా అమ్మమ్మ జ్ఞాపకార్ధం గ్రాండ్‌మా అని పేరు పెట్టాడు.(వాడుకలో అది గ్రాన్మా అయింది) 1953 జూలై 26న ఫిడెల్ కాస్ట్రో నాయకత్వాన 160 మంది గెరిల్లాలు రెండు మిలిటరీ కేంద్రాలపై విఫలదాడి చేశారు. ఆరుగురు గెరిల్లాలు ఆ దాడిలో మరణించారని, 55 మందిని బందీలుగా చేసి తర్వాత ఉరితీశారని కాస్ట్రో తన ఆత్మకథలో రాశాడు. తర్వాత కాస్ట్రో, సోదరుడు రావుల్ తదితరులను కూడా పట్టుకొని 15ఏండ్ల జైలు శిక్షవేశారు. అయితే వివిధ తరగతులు, రాజకీయ నేతలు, జనం నుంచి వచ్చిన ఒత్తిడితో నియంత బాటిస్టా 1955లో విడుదల చేశాడు. కాస్ట్రో వెంటనే మెక్సికో ప్రవాసం వెళ్లాడు. అక్కడే కాస్ట్రో బృందానికి డాక్టర్‌గా పని చేస్తున్న చేగువేరా, తదితరులు పరిచయమయ్యారు. మరోసారి తిరుగుబాటు దాడి చేసేందుకు ఆలోచనలు చేశారు. ఆయుధాలకు అవసరమైన నిధుల కోసం అమెరికాలో ఉన్న క్యూబన్ ప్రవాసులను కలిసేందుకు కాస్ట్రో న్యూజెర్సీ, మియామీ వెళ్లాడు. అనేక ఇబ్బందులు పడి క్యూబా మాజీ అధ్యక్షుడు కార్లోస్ వంటి వారిని కలసి సేకరించిన సొమ్ములో నాలుగువేల డాలర్లతో మారు పేర్లతో పౌర అవసరాలకు అనుగుణంగా మార్చిన గ్రాన్మా నౌకను కొనుగోలు చేశారు. మెక్సికో గల్ఫ్‌దాటి క్యూబా చేరుకొనే విధంగా పథకం రూపొందించారు.
1956 నవంబరు 25న మెక్సికో రేవు టక్స్‌పాన్ నుంచి 82 మంది ‘జూలై 26 ఉద్యమకారులతో’ బయలుదేరిన గ్రాన్మా 30వ తేదీన నిర్ణీత ప్రాంతానికి చేరుకోవాలి. కానీ మధ్యలో వచ్చిన అవాంతరాలతో రెండు రోజులు ఆలస్యంగా వేరే తీరం చేరింది. అప్పటికే సరైన తిండిలేక విప్లవకారులు ఆలసిపోయారు. మధ్యలో నావికుడు నీళ్లలో పడిపోవటం అతగాడిని రక్షించటం, వాతావరణం సరిగా లేక అనేక యాతనలు పడ్డారు. స్పెయిన్ వలస నుంచి విముక్తి కోసం పోరాడిన జోస్ మార్టి దిగిన చోటే కాలుమోపాలని చూశారు. అక్కడ వారికి స్వాగతం పలికేందుకు, దాడి చేయాల్సిన ప్రాంతానికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే నౌక అక్కడికి రాకపోవటంతో రెండు రోజులు చూసి వారంతా వెళ్లిపోయారు. ఈ లోగా నియంత బాటిస్టా మిలిటరీకి ఈ విషయం తెలిసి వారిని పట్టుకొనేందుకు సిద్దమయ్యారు. దాంతో నౌకలోని ఆహారం, ఆయుధాలను వదలి గెరిల్లాలందరూ బృందాలుగా చీలి తలా ఒక దిక్కుకు వెళ్లారు. డిసెంబరు ఐదవ తేదీన దాడి చేయబోయే ముందు ఒక చెరకుతోటలో మకాం వేశారు. అయితే వారికి దారి చూపాల్సిన వ్యక్తి ద్రోహానికి పాల్పడి మిలిటరీకి గెరిల్లాలు ఉన్న ప్రాంతం గురించి వెల్లడించాడు. అనూహ్యంగా మిలిటరీ చుట్టుముట్టటంతో వారంతా చెల్లాచెదురయ్యారు. ఎనభై రెండు మందిలో కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మరణించినవారి పేర్లను గుర్తించలేని అధికార యంత్రాంగం ఇచ్చిన సమాచారం మేరకు ఫిడెల్ కాస్ట్రో కూడా మరణించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే కాస్ట్రో సోదరులు, చేగువేరా తదితరులు సురక్షితంగా ఉన్నారు. 1959 జనవరి 1న విప్లవం జయప్రదమైన తర్వాత గ్రాన్మా నౌకను హవానా తీరానికి తరలించారు. 1976 నుంచి హవానాలోని విప్లవ మ్యూజియంలో దాన్ని శాశ్వతంగా భద్రపరిచారు. నౌక దిగిన చోటుకు గ్రాన్మా అని పేరు పెట్టారు. ఒక జాతీయ పార్కును కూడా ఏర్పాటు చేశారు. తీరంలో దిగిన డిసెంబరు 2ను క్యూబా సాయుధ దళాల దినంగా పాటిస్తున్నారు. క్యూబా కమ్యూనిజానికి ప్రతీకగా మారిన గ్రాన్మా పేరును పార్టీ పత్రికకు పెట్టారు. కాస్ట్రో తదితరులు విప్లవానికి ముందు జాతీయ, అభ్యుదయవాదులు, బాటిస్టా వ్యతిరేకులు, అధికారానికి వచ్చిన తర్వాతే కమ్యూనిస్టులుగా మారారు.
దిగ్బంధనాన్ని తట్టుకొని..?
బలమైన అమెరికాను తట్టుకొని సహజవనరులు అంతగా లేని క్యూబా ఎలా నిలిచిందన్నది ఆసక్తి కలిగించే అంశం. వలస దేశాలన్నీ వెనుకబడి ఉండటం ఓ సాధారణ లక్షణం. స్పెయిన్ వలసగా క్యూబా అందుకు మినహాయింపు కాదు. మిగతా వాటికి లేని ప్రత్యేకత ఏమంటే ఆరున్నర దశాబ్దాలుగా అమెరికా దాడులకు తట్టుకొని అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని నిలవటం. క్యూబా అంటే ప్రపంచానికి ఒక రహస్యం లేదా అర్ధంగాని విషయం. నిజమే దాని గురించి చదివేకొద్దీ ఆసక్తి కలిగించే, ఉత్తేజమిచ్చే అంశాలు అనేకం. డైనోసార్ వంటి అమెరికా ముందు పిట్టవంటి క్యూబా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ధైర్యంగా ఉందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేయాలన్నది అమెరికా లక్ష్యం. దాని సమీప క్యూబా సరిహద్దు దూరం కేవలం 145 కిలోమీటర్లు. సుదూరంగా ఉన్న అనేక దేశాల కమ్యూనిస్టు నేతలను హతమార్చి, పార్టీలను దెబ్బతీసినప్పటికీ కూతవేటు దూరంలో ఉన్న క్యూబాలో ఆపని చేయలేకపోవటంతో అమెరికా అహం దెబ్బతిన్నది. కూబన్ విప్లవ సారధి, ప్రియతమనేత ఫిడెల్ కాస్ట్రోను హతమార్చాలని ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. ఆకలి, అనారోగ్యాలతో ఇబ్బంది పెడితే సోషలిజం, కమ్యూనిస్టు భావజాలాన్ని జనం వదులుకుంటారని, నేతల మీద తిరుగుబాటు చేస్తారనే ఆశతో ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ క్యూబాలో ‘చావనైనా చస్తాం గానీ ఎత్తిన జెండా దించం, అమెరికాకు లొంగం అరుణపతాకకు జై’ అంటూ ప్రతితరం పునరంకితం అవుతున్నది.
క్యూబా ఎలా తట్టుకుంటున్నది?
పూర్వపు సోవియట్ యూనియన్ ఉన్నపుడు క్యూబాను కంటికి రెప్పలా కాపాడుకున్నమాట నిజం. అన్ని రకాలుగా సాయం చేసింది. అయితే దాన్ని కూల్చివేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే క్యూబన్లు తెల్లజెండా ఎత్తివేస్తారని ఆశించిన అమెరికా సామ్రాజ్యవాదులకు నిరాశే మిగిలింది. తూర్పు ఐరోపాలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఫిడెల్ కాస్ట్రో రాగల పరిణామాలను ముందుగానే ఊహించాడు. ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు గానీ ఆయన చేసిన ప్రకటనలో అలాంటి సూచన కనిపించింది. 1989 జూలై 26న అంటే సోవియట్ విచ్చిన్నానికి పద్దెనిమిది నెలలు, బెర్లిన్ గోడ కూలటానికి నాలుగు నెలల ముందు క్యూబా విప్లవం కొనసాగుతుందని బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. సోవియట్ సహకారం 31 ఏండ్లు కొనసాగితే, లేకుండా ఇప్పటికి 34 ఏండ్లు గడిచింది. సోవియట్ సాయం వాస్తవం, అయితే కేవలం దాని ఆధారంగానే క్యూబా నడవలేదని తర్వాత అనుభవం చెప్పింది. విప్లవానికి నాయకత్వం వహించిన వారిలో ఫిడెల్ కాస్ట్రో, సోదరుడు రావుల్ కాస్ట్రో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. క్యూబా విప్లవం జయప్రదమైన తర్వాత పుట్టిన మిగుయెల్ డియాజ్ కానెల్ ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఉన్నాడు. సోవియట్ పతనం కాగానే క్యూబా కనుమరుగు అన్నారు, అవే నోళ్లతో 2008లో ఫిడెల్ కాస్ట్రో మరణంతో ఇంకెక్కడ క్యూబా అన్నారు. వాటికి హద్దెక్కడుంది. కాస్ట్రో సోదరులే మొత్తం క్యూబాను, అక్కడి సోషలిస్టు వ్యవస్థను కాపాడారని చెబితే వాస్తవ విరుద్దం. సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించారన్నది వాస్తవం. అనేక మంది దేశభక్తులు, కమ్యూనిస్టులు సామాజిక వ్యవస్థను అమెరికా కుట్రల నుంచి క్యూబాను కంటికి రెప్పలాకాపాడుతున్నారు.
క్యూబా విశిష్టత ఎలా వెల్లడైంది?
ఏ సమాజమైనా సంక్షోభానికి లోనైనపుడు నాయకత్వం జనాన్ని ఎలా నడిపించిందన్నదే ముఖ్యం. 1991కి ముందు క్యూబాకు సోవియట్ అనేక విధాలుగా సాయం చేసింది. అది విచ్చిన్నం కావటంతో జిడిపి 35శాతం పతనమైంది. ఎగుమతులు 80శాతం పడిపోయాయి. ఇంథనం లేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆహార కొరత. వ్యవసాయానికి ట్రాక్టర్లకు బదులు తిరిగి గుర్రాలను రంగంలోకి తెచ్చారు, రవాణాకూ సైకిళ్లు, గుర్రపు బగ్గీలే. కరెంటు కోత, ఆహార ధాన్యాల్లో ఐదోవంతు కోత పడటంతో సగటు జీవి తొమ్మిది కిలోల బరువు తగ్గుదల. ప్రతిమనిషికి కనీసం రోజుకు 1,800కాలరీల శక్తి కావాలి. ఆహార కొరత కారణంగా లభ్యత 2720 నుంచి 2440కి పడిపోయింది. ఇటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో భాగంగా 1994లో వేలాది మంది పౌరులు స్వేచ్ఛ కావాలంటూ రాజధానిలో ప్రదర్శనలకు దిగారు. అప్పటికే నూతన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టారు. రైతులు పండించిన పంటలో ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పోను మార్కెట్లో అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వటం వాటిలో ఒకటి. అది ప్రోత్సాహం తప్ప ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామంటే వీల్లేకుండా కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. జనంతో పాటు నేతలూ, కమ్యూనిస్టు కార్యకర్తలూ ఇబ్బందులను అనుభవించారు తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని భోగాలు అనుభవించలేదు. దీన్ని జనం అనుభవ పూర్వకంగా చూశారు. కనుకనే పార్టీ నాయకత్వంలో అమెరికా కుట్రలను ఎదుర్కొన్నారు, ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నారు. మానవతాపూర్వక సాయాన్ని కొంత కాలం అనుమతించిన అమెరికా తర్వాత ఆంక్షలను పునరుద్దరించింది.
క్లుప్తంగా క్యూబా పరిణామాలు
ఆసియా లేదా కొంత మంది చెబుతున్నట్లు నాడు సంపదలతో ఉన్న భారత ఉపఖండానికి ఆఫ్రికా గుడ్‌హౌప్ ఆగ్రం చుట్టూ తిరిగి వెళ్లటం కంటే దగ్గర దారి ఏముందా అని యూరోపియన్లు ఆలోచించారు. ఆ క్రమంలో సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు బయలు దేరిన స్పెయిన్‌కు చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ దక్షిణ అమెరికాలో నేడు బహమాగా పిలుస్తున్న దీవులలోని గువాన్‌హనీలో 1492 అక్టోబరు 12న అడుగు పెట్టాడు. అదే నెల 27న క్యూబా వెళ్లాడు. మరుసటి రోజే ఆ ప్రాంతాన్ని స్పెయిన్ సామ్రాజ్యంలో భాగమని ప్రకటించాడు. అప్పటి నుంచి 1898 వరకు స్పెయిన్ వలస ప్రాంతంగా క్యూబా ఉంది. తొలి స్వాతంత్య్ర ఉద్యమ తిరుగుబాటు 1868 అక్టోబరు 11న ప్రారంభమైంది. పదేండ్ల పాటు సాగింది. 1878లో స్పెయిన్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పంద ఉల్లంఘన జరగటంతో మరుసరి ఏడాది మరో విఫల తిరుగుబాటు జరిగింది. తర్వాత కాలంలో క్యూబా జాతిపితగా ప్రసిద్ది పొందిన జోస్ మార్టి స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్నవారందరినీ ఐక్యపరచి క్యూబా విప్లవ పార్టీని ఏర్పాటు చేశాడు. 1895లో ఫిబ్రవరి 24న మూడో తిరుగుబాటు ప్రారంభమైంది. మే 19న మార్టి మరణించాడు. తర్వాత జరిగిన పరిణామాలలో స్పెయిన్ మీద యుద్ధం ప్రారంభించిన అమెరికా 1898లో క్యూబాను స్వాధీనం చేసుకుంది. 1902 మార్చి 20న తమది స్వతంత్రదేశమని క్యూబా సమరయోధులు ప్రకటించారు. అమెరికా రక్షిత ప్రాంతంగా కొనసాగింది. అనేక చిన్నా పెద్దా తిరుగుబాట్లను అమెరికా మిలిటరీ అణిచివేసింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది.1925లో రాజ్యాంగ బద్దంగా తొలి ఎన్నికలు జరిగాయి. అమెరికా మద్దతు ఉన్న మిలిటరీ అధికారి మచాడో తొలి అధ్యక్షుడయ్యాడు. తర్వాత అమెరికా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటయింది. 1933 ఆగస్టు 12న కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మచాడో ప్రభుత్వాన్ని తొలగించారు. అమెరికా తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించింది. అదే ఏడాది సెప్టెంబరు నాలుగున మిలిటరీ అధికారి ఫ్లుగెన్సియో బాటిస్టా విప్లవకారుల ముసుగులో తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పేరుకు రామన్ సాన్ మార్టిన్ను అధ్యక్షుడిగా ప్రకటించాడు. మరుసటి ఏడాది జనవరిలో బాటిస్టా పూర్తిగా అధికారాన్ని స్వీకరించాడు. 1935లో కమ్యూనిస్టు పార్టీ తిరుగుబాటును మిలిటరీ అణచివేసింది. పార్టీ మీద నిషేధం ప్రకటించారు, 1942లో తొలగించారు. అదే ఏడాది కొత్త రాజ్యాంగం వచ్చింది, 1945లో క్యూబా ఐరాస సభ్యత్వం పొందింది.
1947లో ఏర్పడిన అర్థొడాక్స్ పార్టీలో లా విద్యార్థిగా ఉన్న ఫిడెల్ కాస్ట్రో చేరాడు. 1952 ఎన్నికలకు ముందు జనరల్ బాటిస్టా కుట్రచేసి ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారానికి వచ్చాడు. 1953 జూలై 26 కాస్ట్రో నాయకత్వంలో 150 మంది గెరిల్లాలు మంకాడో బారక్స్ మీద దాడి చేశారు. దాన్నే ‘జూలై 26 ఉద్యమం’గా పిలిచారు. కాస్ట్రోతో సహా అనేక మందిని అరెస్టు చేశారు. అక్టోబరు 16న కోర్టులో చేసిన చారిత్రాత్మక ఉపన్యాసంలో చరిత్ర తనను నిర్దోషిగా పరిగణిస్తుందని కాస్ట్రో చెప్పాడు.1954 సెప్టెంబరులో చేగువేరా మెక్సికో సిటీకి వచ్చాడు. అదే ఏడాది నవంబరులో పార్లమెంటును రద్దు చేసి బాటిస్టా తనను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. వివిధ పార్టీలు, పౌరుల నుంచి వచ్చిన వత్తిడితో 1955 మే నెలలో కాస్ట్రో తదితరులను జైలు నుంచి విడుదల చేశారు. కాస్ట్రో సోదరులు మరుసటి నెలలోనే మెక్సికో సిటీలో చేగువేరాను కలిశారు. 1956 నవంబరు 25న కాస్ట్రో బృందం 82 మంది గ్రాన్మా నౌకలో బయలుదేరి డిసెంబరు రెండున ఓరియెంటా ప్రాంతానికి చేరుకుంది. ఆ తిరుగుబాటు విఫలమైంది. 1957 జనవరి 16న మిలిటరీ పోస్టుపై దాడి చేసిన కాస్ట్రో బృందం తొలి విజయం సాధించింది. 1958 మార్చినెల 13 బాటిస్టా మిలిటరీకి అమెరికా ఆయుధ సరఫరా నిలిపివేసింది. 17వ తేదీన సాధారణ తిరుగుబాటుకు ఫిడెల్ కాస్ట్రో పిలుపునిచ్చాడు. ఏప్రిల్ 9న సాధారణ సమ్మె జరిగింది. మే నెలలో తిరుగుబాటను అణచివేసేందుకు సియెరా మాస్ట్రో ప్రాంతానికి బాటిస్టా పదివేల మంది మిలిటరీని పంపాడు. ఆగస్టు నాటికి మిలిటరీని నిలువరించి గెరిల్లాలు భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 28 చేగువేరా శాంతాక్లారాపై దాడికి నాయకత్వం వహించి స్వాధీనం చేసుకున్నాడు. 31న గెరిల్లాలు తిరుగులేని శక్తిగా తేలారు. 1959 జనవరి ఒకటిన సాధారణ సమ్మెకు పిలుపునిచ్చారు. నియంత బాటిస్టా అదే రోజు రాజీనామా చేశాడు. జనవరి 2న చేగువేరా, 9న ఫిడెల్ కాస్ట్రో హవానా చేరుకున్నారు. మిలిటరీ అధిపతి, ప్రధానిగా ఫిడెల్ బాధ్యతలు చేపట్టాడు. అధ్యక్షుడిగా 1965 అక్టోబరు 3న బాధ్యతలు స్వీరించి 2011 ఏప్రిల్ 19 వరకు కొనసాగాడు.
కాస్ట్రో సోదరులు కమ్యూనిస్టులుగా ఎప్పుడు మారారు
కాస్ట్రో సోదరులు విప్లవకారులుగా, పురోగామి శక్తులుగా ఉన్నారు తప్ప విప్లవం జయప్రదమయ్యే వరకు మార్క్సిజం, లెనినిజాలకు బద్దులుగా ప్రకటించుకోలేదు. 1961 జూలైలో చారిత్రాత్మక జూలై 26 ఉద్యమం, నిర్బంధకాలంలో పనిచేసిన పాపులర్ సోషలిస్టు పార్టీ (కమ్యూనిస్టు పార్టీ పేరు) ఇతర పురోగామి శక్తులు విలీనమై క్యూబా కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది.
– ఎం కోటేశ్వరరావు
8331013288