సినిమాల్లో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు జులై 13న తుది శ్వాస విడిచారు. 1978లో చిరంజీవి సినిమా ‘ప్రాణం ఖరీదు’తో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కోట కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 750కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వైవిధ్యభరితమైన పాత్రలను సునాయాసంగా పోషించిన కోట శ్రీనివాసరావుతో పోల్చదగ్గ నటుడు తెలుగు సినిమా రంగంలో వేరొకరు లేరు. కళామతల్లికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తొమ్మిది నంది అవార్డులు దక్కించుకున్న కోట కేవలం నటుడిగానే కాకుండా 1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ నటుడిగా స్థిర పడిపోయారు. సినిమా పరిశ్రమలో 1978 లో అడుగు పెట్టిన కోట శ్రీనివాసరావు తన 47 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం చిత్రాలలో స్టార్ హీరోలతో కలిసి అనేక సూపర్ హిట్స్ సినిమాల్లో నటించారు. సినిమాల్లో ఉన్నంత కాలం బిజీ ఆర్టిస్టుగా గడిపిన కోట అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించారు.
కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో 1942వ సంవత్సరం జులై 10న కోట శ్రీనివాసరావు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. బాల్యం నుండే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాలలో రాకముందు స్టేట్‌బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. అయితే 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట తనయుడు ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరూ కూతుళ్లకు పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నారు. కోట ప్రసాద్ జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ‘సిద్ధం’ చిత్రంలో నటించాడు. 2010లో ‘గాయం-2’ చిత్రంలో తన తండ్రితో పాటు నటించాడు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు.
నాటకాల నుండి సినీరంగ ప్రవేశం
చిన్ననాటి నుండి నాటకరంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై నటనలో 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ కూడా సినిమాలో తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడిగా ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘అహ నా పెళ్ళంట’లో కథానాయిక తండ్రిగా పిసినిగొట్టు పాత్ర ఆయనకు చాలా పేరు తెచ్చింది. వెంకటేష్ హీరోగా నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో వెంకటేష్ తండ్రిగా, జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖి, చిత్రాలలో తాతగా, ‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్‌కు తండ్రిగా నటించారు. కోట బాబుమోహన్‌తో చాలా సినిమాలలో నటించారు.
కోట పోషించిన గొప్ప పాత్రలు
750 కి పైగా సినిమాల్లో నటించిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు కెరీర్‌లో టాప్ 10 సినిమాలు అభిమానులు గర్వంగా చెప్పుకునే, ఎప్పటికీ నిలిచిపోయే ఆణిముత్యాల్లాంటి కొన్ని గొప్ప పాత్రల గురించి గుర్తు చేసుకుందాం
కామెడీలో కొత్త ఒరవడి సష్టించిన ‘అహ నా పెళ్ళంట’ పిసినారిగా కోట పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మానందంని వేధిస్తూ కోట పండించిన హాస్యం జనాన్ని ఊపేసింది.
‘గణేష్’ చిత్రంలో హెల్త్ మినిస్టర్‌గా కోట విలనిజం చూసి భయపడని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన చూపించిన నటన గురించి వర్ణించాలంటే మాటలు చాలవు.
‘ఆ నలుగురు’ రెండున్నర గంటల సినిమాలో క్లైమాక్స్ వరకు తిట్లు తిన్నా, చివర్లో కన్నీళ్లు పెట్టించడం ఆయనకే చేల్లింది.
”థాంక్స్.. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడ్రా బాబు…” అంటూ వెరైటీ మ్యానరిజంతో ‘శత్రువు’లో కోట చూపించిన విలనీ విమర్శకులను సైతం శబాష్ అనేలా చేసింది. కేకలు పెట్టకుండా నవ్వుతూనే మర్డర్లు చేయించే కోట బాడీ లాంగ్వేజ్ ఇప్పుడొచ్చే నటులకు రెఫెరెన్స్ లాంటిది.
‘గాయం’ హైదరాబాద్‌లో దందాలు చేసే గూండా కం పొలిటీషియన్‌గా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ కోటశ్రీనివాసరావు పండించిన విలనీ ఓ రేంజ్‌లో పేలింది. జగపతిబాబు క్యారెక్టర్‌కి ధీటుగా రామ్ గోపాల్ వర్మ డిజైన్ చేసిన పాత్రను కోట అంచనాలను మించి మెప్పించారు.
‘ఆమె’లో డబ్బు కోసం కక్కుర్తి పడి చివరికి డబ్బు కోసం కోడలి మీదే కన్నేసే కిరాతకమైన మామ పాత్రలో కోట వేరియేషన్స్ చెప్పాలంటే పేజీలు సరిపోవు. ఒకవైపు కామెడీ చేస్తూనే ఇంకోవైపు కూల్ విలనిజం పండించిన వైనం చూస్తే వా అనకుండా ఉండలేం.
కుటుంబ సభ్యులతో తిట్టుతింటూ బిచ్చగాడితో స్నేహం చేసే పాత్ర కోట వర్సటాలిటీలో మరో కోణం ‘మామగారు’. విలనిజం లేకపోయినా అందరితో తిట్లు తినే వెరైటీ క్యారెక్టరైజేషన్‌ని నిలబెట్టిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది.
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఉద్యోగం లేక బేవార్స్‌గా తిరిగే కొడుకుని పోషించే తండ్రిగా కోట చూపించిన నటనను ఇంకెవరైనా చేయగలరా? పాత్ర నిడివి తక్కువైనా దాని ప్రభావం ఎంత బలంగా ఉందంటే ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో ఆ వీడియోలు వాడుతున్న వైనం కనిపిస్తూనే ఉంటుంది.
‘హలో బ్రదర్’ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ తన సబార్డినేట్‌తో చీవాట్లు తినే ఎస్‌ఐ తాడి మట్టయ్యగా కోట చూపించిన వైవిధ్యం ఒకపక్క నవ్విస్తూనే ఇంకో పక్క భావోద్వేగాలను రగులుస్తుంది.
‘కన్యాదానం’ కొడుకు ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆమెను దగ్గర చేయాలని తాపత్రయపడే మధ్యతరగతి తండ్రిగా కోట చూపించే నటన జనాలకు బాగా దగ్గరయ్యింది. త్యాగం, స్వార్థం, మంచితనం ఇలా అన్ని షేడ్స్ కలగలసిన పాత్రను నిలబెట్టడం అంత సులభం కాదు. కానీ కోట దాన్ని అలవోకగా చేశారు.
తెలంగాణ యాసపై మక్కువ..
గతంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను చాలా అరుదుగా వినియోగించేవారు. అదీ విలన్, కమెడియన్ క్యారెక్టర్లకు మాత్రమే మన యాసను వాడేవారు. అయితే తెలంగాణ యాసపై ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు, ఆ పదాలను ఎలా పలకాలో నేర్చుకుని మరీ సినిమాల్లో డైలాగులు చెప్పారు. కష్ణా జిల్లాలో జన్మించిన ఆయన మొదట్లో ఆ ప్రాంత యాసలోనే సినిమాలు చేశారు. అయితే ఓసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు తెలంగాణ యాస ముఖ్యంగా హైదరాబాద్‌లో తెలుగు బాగా నచ్చింది. దీంతో తెలంగాణ యాసపై మక్కువ పెంచుకున్న ఆయన 1985లో ప్రతిఘటన సినిమాలో తొలిసారి మన యాసలో డైలాగులు చెప్పారు. అది అందరినీ ఆకట్టుకోవడంతో రాత్రికి రాత్రే ఆయనకు స్టార్‌డమ్ వచ్చింది. దీంతో తెలంగాణ ప్రజలకు కోట శ్రీనివాసరావు మరింత దగ్గరయ్యారు. ఆయన విలన్‌గా చేసిన చాలా పాత్రల్లో యాస.. తెలంగాణదే ఉంటుంది. అరే భరు.., ఏందిరా భరు.., మస్తు ఉంది.., పరేషన్ నై.. ఇలాంటి పదాలు బాగా ఆకట్టుకున్నాయి.
ఇది కదా నటన అంటే..
గవర్నమెంట్ హాస్పిటల్లో నేలమీద పడుకున్న పదిమంది పేషంట్స్‌లో ఒకడిగా పడుకోవాలి.. ఒకే నా అంటే… ఇదే సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా పాత్ర ఇచ్చారు అప్పుడు అడగలేదే ఇలా అని అడిగారుట కోట. ఇది నటనకి ఆయనిచ్చే గౌరవం. ఇది పాత్రకి ఆయనిచ్చే మర్యాద. ‘గణేష్’ సినిమాలో పవర్ఫుల్ పొలిటీషియన్ సాంబశివుడు గుర్తున్నాడా..
గుండుకి విగ్గు, భయంకరంగా ఉండే కన్నుతో తెలంగాణా యాసలో సినిమా మొత్తాన్నీ చితక్కొట్టి వదిలిపెడతాడు. సినిమా చూసే మనకి వీడు కనిపిస్తే చంపేయాలి అనేంత కసిని పెంచుతాడు. ఇదంతా నటన, సినిమా అని మర్చిపోయి ప్రేక్షకుడు ఆ కేరెక్టర్ బాగా కనెక్ట్ అయినప్పుడే కదా ఇది కదా నటన అంటే అనుకునేది. గణేష్ సినిమాలో హెల్త్ మినిష్టర్ సాంబశివుడుగా అదిరే డైలాగ్స్ తనవి.. ”నేను యాభైకోట్ల కుంభకోణం చేశినా.. కాదంటలే నాకైతే చార్మినార్కున్నంత హిస్టరున్నది మల్ల..” అంటాడు. నిజమే కోట హిస్టరీ మామూలుగా వుండదు. అసలు ”తమ్మీ…” అనేమాట ఎక్కడ విన్నా గుర్తుకి వచ్చేది కోట. గాయం సినిమాలో ‘ఖండిస్తున్న’ డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. కోటలో నటనని ఈవీవీ సత్యనారాయణ చూపించిన విధానం హైలెట్. విలనిజానికి పరాకాష్ట ‘ఆమె’ సినిమా. తన ప్రతిభకి వేలెత్తి విమర్శించే అవకాశం ఇవ్వని నటుడు కోట.
కోట, బ్రహ్మానందం, బాబు మోహన్‌ల కాంబో
విలన్‌గా నటించిన కోట శ్రీనివాసరావు కామెడీతోనూ మెప్పించాడు. బ్రహ్మానందం, బాబు మోహన్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబో కామెడీ సీన్స్ ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాల్లో ఉండేవి. వీరిద్దరి కాంబో కామెడీ ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా చూస్తూ నవ్వుకునే వారు ఎంతో మంది ఉంటారు. బాబు మోహన్ ”అన్నా అన్నా” అంటూ కోటా శ్రీనివాసరావుతో చేసిన సినిమాలు అల్టిమేట్ కామెడీని పండించాయి. బ్రహ్మానందంతో కలిసి కూడా కోటా శ్రీనివాసరావు కామెడీ సీన్స్ చేసి నవ్వించాడు. ‘అతడు’ సినిమాలో కోట శ్రీనివాసరావు విలన్‌గా కనిపిస్తూనే తన మార్క్ డైలాగ్ డెలివరీతో నవ్వు తెప్పించాడు. ఇంకా ఎన్నో సినిమాల్లోనూ సెంటిమెంట్‌తో మెప్పించాడు.
చిరుతో మొదలు… పవన్‌తో ముగింపు
కోట శ్రీనివాసరావు సినీ ప్రయాణంలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. కోట శ్రీనివాసరావు కెరీర్ సుదీర్ఘ కాలం సాఫీగా సాగిపోవడానికి టి. కృష్ణ దర్శకత్వం వహించిన ‘ప్రతిఘటన’ చిత్రం గట్టి పునాదిని వేసిన మాట వాస్తవం. అయితే ఆయన సినీ ప్రయాణం మొదలైంది మాత్రం చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో. రచయిత సి.ఎస్. రావు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకాన్ని రంగస్థలంపై ఆడిన కోట శ్రీనివాసరావుకు ఆ చిత్ర నిర్మాత క్రాంతి కుమార్ ఈ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. అలా 1978 లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించారు కోట. ఆయన చివరిగా నటించిన చిత్రం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’. అయితే… ఆయన అనారోగ్యం కారణంగా ఈ పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది.
తీరని ఓకే ఒక కోరిక!
40 ఏళ్ల సినిమా కెరీర్.. సుమారు 750కు పైగా సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించి, మెప్పించిన కోటకు తీరని కోరిక సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక్క సీన్ లో నైనా కలిసి నటించాలని. ఈ అవకాశం కోసం ఆయన 18 ఏళ్లు అంటే సీనియర్ ఎన్టీయార్ బతికి వున్నంత వరకు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. కోట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీయార్ చేసిన మూడు, నాలుగు సినిమాల్లోనూ కోటకు అవకాశం రాలేదు. చివరకు ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో ఒక పాత్ర కోసం పిలుపు వచ్చినా కోట బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఛాన్స్ కూడా పోయింది. దాంతో కోట కోరిక తీరలేదు.
అవార్డులు
భారత ప్రభుత్వం కోట శ్రీనివాసరావును 2015 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తొమ్మిది నంది అవార్డులు అందుకున్నాడు. 1986 లో ‘ప్రతిఘటన’కు తొలిసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, 1993లో ‘గాయం’, 1994లో ‘తీర్పు’కు ఉత్తమ విలన్‌గా, 1996లో ‘లిటిల్ సోల్జర్స్’కు, 1998లో ‘గణేష్’లో ఉత్తమ విలన్‌గా, 2002లో ‘పథ్వీ నారాయణ’, 2004లో ‘ఆ నలుగురు’, 2006 లో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రాలకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డులు, 2012లో ‘కష్ణం వందే జగద్గురుమ్’ చిత్రానికి గానూ సైమా (SIIMA) అవార్డును అందుకున్నారు
– డా. పొన్నం రవిచంద్ర,
9440077499
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు
- Advertisement -
- Advertisement -