Sunday, July 20, 2025
E-PAPER
Homeకథఅమ్మ గది

అమ్మ గది

- Advertisement -

ఇంత రాత్రి అవుతున్నా ఒంటింట్లో ఇంకా ఏం చేస్తున్నావు? ఈ రోజసలు పడుకునేది వుందా లేదా?
రంగారావుకు సమాధానంగా గొంతు పెంచి ఇదిగోండి! వచ్చేస్తున్నా అంటూ వంటగది లోంచి బయటకు వచ్చింది కరుణ.
వచ్చేటప్పడు ఒక వాటర్‌ బాటిల్‌ తీసుకురా! నేను తెచ్చుకోవడం మర్చిపోయా.
హాల్లో వున్న ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్ళి బాటిల్‌ తీసుకుని కరుణ బెడ్‌ రూంలోకి వెళ్లింది.
ఇప్పుడేం కొంపలు అంటుకు పోయాయని? ఎల్లుండి మధ్యాహ్నం ఎప్పుడో వచ్చే పిల్లల కోసం ఇంత కష్టపడడం అవసరమా? ఒళ్ళు విరుచుకుని అన్ని పనులు నువ్వే చేయమాకు. నీకు ఏమైనా అయితే, మనకు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు అది గుర్తుంచుకో!.
భలేవారే! వాళ్ళు మన పిల్లలు. వాళ్లెవరో పరాయి వాళ్లన్నట్లుగా మాట్లాడతారేంటి? నా పిల్లలకు నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు? వాళ్లేమైనా నెలలు నెలలు వుండడానికి ఇక్కడి వస్తున్నారా? వారం, పది రోజుల కోసమేకదా! ఇప్పుడు అంటే అన్నారు. రేపు వాళ్ళ ముందు అనకండి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ ఇంటికి రావడానికి ఇష్టపడరు.
దేశం కాని, దేశం పోయి మనం వాళ్ళతో వుండేది లేదు. వాళ్ళకు మన బాధలు, సమస్యలు చెప్పి విసిగించకండి. భర్తను హెచ్చరిస్తూ అతని పక్కన వత్తిగిలింది.
ఎంతసేపటికీ, ఇద్దరికి నిద్ర పట్టకపోవడంతో, రంగారావు కూర్చొని, ఆర్ద్రంగా భార్య వైపు చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
ఏంటీ అన్నట్లుగా కరుణ సిగ్గుపడుతూ భర్త వైపు చూసింది.
రేపటి నుంచి మనం మన ఇంటికి, మన గదికి అథిదులం. ఊళ్ళో పొలం ఈసారైనా అమ్మేసి పెద్ద ఇల్లు కట్టుకుందాం. నామాట విను. పిల్లలు వచ్చినప్పుడు మన గదిని మనమే పెట్టుకోవచ్చు. వాళ్ళున్న పదిరోజులూ బొత్తిగా నువ్వు నాకు అందవు. ఆమె చేతులను నిమురుతూ ప్రేమగా చూశాడు.
అర్ధరాత్రి వేళ ఏంటా మాటలు? ఇప్పుడు బాగానే వున్నాం కదా! పొలం అమ్మి పెద్ద ఇల్లు కట్టకపోతే ఏమౌతుంది? వాళ్ళున్నన్ని రోజులే కదా! మనం హాల్లో పడుకునేది. వాళ్లు వెళ్లిపోయాక మన ఇంటికి వచ్చేవారెవరు చెప్పండి?
ఎందుకైనా మంచిది కరుణా… నేను వున్నప్పుడే నీపేరు మీద ఇల్లు కడతాను. అన్ని వసతులతో నీకు మంచి గదిని అందంగా డిజైన్‌ చేస్తాను. నేనున్నా, లేకున్నానీ గదిని నువ్వు ఎవ్వరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం వుండదు.
మీకసలు బుద్ది వుందా? ఆ మాటలేంటి? మీరు లేకపోవడం లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరేం మాట్లాడుతున్నారో అర్డమౌతుందా? మనకున్న ఆస్తిని పిల్లలకు వారసత్వంగా మిగుల్చకుండా దాన్ని నాకోసం అమ్మడం ఏంటి? చాల్లే! మాట్లాడింది. ఇక పడుకోండి. నాకు నిద్దర ముంచుకు వస్తోంది. పొద్దున్నేలేచి పిల్లల కోసం పిండి వంటలు చెయ్యాలి. భర్తను సుకుమారంగా విసుక్కుంది కరుణ.
రంగారావు ఏం మాట్లాడకుండా రెండు రోజుల్లో ఇంట్లో జరగబోయే కిష్కింద యుద్ధాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

అమ్మా! ఈసారి నీకోసం ఇవే తెచ్చాను. టైం అసలు దొరకలేదమ్మా ఏమీ అనుకోకూ అంటూ ఐరన్‌, మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వున్న రెండు డబ్బాలను తల్లి చేతుల్లో పెట్టాడు అనురాగ్‌.
కరుణ మౌనంగా కొడుకు ఇచ్చిన డబ్బాలను అందుకుంది. నాలుగు సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన కొడుకుకు కన్నతల్లి కోసం షాపింగ్‌ చేయలేనంత తీరికలో వున్నాడన్న మాట. ప్రేమ, గౌరవం ఒకరు అడిగితే వచ్చేదా? బాధ్యతలకు అర్ధం తెలియని జీవితాన్ని గడుపుతున్న కొడుకుపై ఆమెకు జాలేసింది.
తల్లి మెడ చుట్టూ చేతులు వేసి, అన్నయ్యా! అమ్మకు మనం ఇండియా రావడమే పెద్ద గిఫ్ట్‌ రా! నేను మాత్రం ఇదిగో! ఈ రెండు ‘ఐ పాడ్స్‌’ అమ్మా, నాన్నల కోసం ఈసారికి తెచ్చాను అంది కౌసల్య కాస్త డాబుగా.
వాట్‌ మమ్మీ! నేను, తమ్ముడు లాస్ట్‌ ఇయర్‌ వాడి పడేసిన ‘ట్యాబ్స్‌’ అమ్ముమ్మకు ఇస్తూ కొత్తవి అంటున్నావెందుకు? చికాగ్గా ముఖం పెట్టి అంది చిన్ను.
అమ్మమ్మ, తాతయ్యలకు కొత్త ట్యాబ్స్‌ కన్నా పాతవే బాగుంటాయి. వాళ్ళకు నెక్స్ట్‌ ఇయర్‌ కొత్తవి కొనిద్దాం. అప్పటివరకూ ఇవి ప్రాక్టీస్‌ అవుతాయిలే తనను తాను సమర్ధించుకుంది కౌసల్య.
ఇవి మాత్రం మాకెందుకే! వాటిని వాడతామా! పెడతామా? ఇంతకు ముందు అన్నయ్య తెచ్చిన ‘ఐ’ ఫోనే మీ నాన్నగారు వాడడం లేదు. కూతురు మనసు గ్రహించినట్లుగా బాధగా అంది కరుణ.
తండ్రి భోజనానికి రావడంతో కౌసల్య మాట్లాడకుండా, డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. కరుణ అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ భోజనాలు పెడుతోంది. తల్లి వడ్డించిన వంటకాలున్నీ బాగున్నాయి. గ్రానీ సూపర్‌ టేస్ట్‌! అంటూ పిల్లలు ప్రేమగా తింటున్నారు. అన్నా, వదినలు తల్లితో కలిసిపోయి ప్రేమతో ముచ్చట్లు చెబుతుంటే, అనవసరంగా పిల్లల ముందు ట్యాబ్స్‌ చూపించి పరువు తీసుకున్నాను. మనసులోనే తనను తాను తిట్టుకుంది కౌసల్య.
కౌసల్య మనసును గ్రహించినట్లుగా, ”అయిందేదో అయిపోయింది. ఇంకా ఎక్కువ మాట్లాడి అపహాస్యం కాకు” భార్యకు మాత్రమే వినబడేటట్లుగా అన్నాడు జతిన్‌.

ఇల్లంతా హడావిడిగా, కలివిడిగా వుంది. ఎంతైనా పిల్లలున్న ఇల్లు దేవుడున్న లోగిలి అనుకున్నారు దంపతులిద్దరూ. అప్పుడే పిల్లలు వచ్చి వారం రోజులు గడిచాయి. కొడుకు, కూతురు ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుని ఎవరి అత్తగారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
”ఏంటి? వాళ్లెవ్వరూ లేరుకదా! ఈరోజుకు వంటలో ఏమన్నా సాయం చేయనా” అడిగాడు రంగారావు.
”అబ్బో! అదొక్కటే తక్కువైంది. పిల్లలున్నప్పుడు పలుకరించ తీరదు గానీ, సాయం చేస్తారట.. సాయం” నవ్వింది భర్తవైపు చూస్తూ కరుణ.
రంగారావు చాలా సంవత్సరాల తర్వాత భార్య మాటలకు సిగ్గుపడ్డాడు. ”మరేం చేయమంటావు? పిల్లల ముందు ఒంటింట్లోకి వస్తే చులకనైపోనా?”
”ఏం? మీ కొడుకు అమెరికాలో పెండ్లానికి ఏ హెల్ప్‌ చేయకుండానే వుంటున్నాడంటారా?” నవ్వింది కరుణ.

అత్తగారి ఇళ్ళల్లో పది రోజులు వుండి పిల్లలతో రెండు జంటలు తిరిగి వచ్చారు. ఆరోజు బాగా అలసటగా వున్న కరుణ బయట వరండాలో వున్న సోఫాలో పడుకోలేక, తమ బెడ్‌ రూంలోకి వెళ్ళి మంచం మీద చిల్లర, వందరగా పడివున్న కోడలు బట్టలను పక్కకు జరిపి, నడుం వాల్చింది.
పిల్లలు నలుగురు తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ హాల్లో టీవీ చూస్తున్నారు. కూతురు అల్లుడు, కొడకు కోడలు షాపింగ్‌కని వెళ్ళిన వాళ్లు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పిల్లలకు ఇష్టమైన వంటలు చేసి అన్నీ టబుల్‌ మీద రడీగా పెట్టింది. వాళ్ళు వచ్చేలోపు కాస్త నడుం వాల్చుదామని వచ్చి, ఒళ్ళు అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకుంది కరుణ,
ఎప్పుడు వచ్చారో! కూతురు, కోడలు గది బయట వాదించుకుంటున్నారు. మీ అమ్మను బయటకు రమ్మను కౌసల్యా! నేను షాపింగ్‌కు వచ్చేటప్పుడు గదిలో ఎక్కడివి అక్కడ పడేసి వచ్చాను. మంచం మీద నా జ్వెలరీ కూడా పెట్టాను. అవి మిస్‌ అయితే, నేనిప్పుడు ఎవరి ఏం అనగలను? మీ అమ్మగారికి ఆమాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?
అది అమ్మ, నాన్నల బెడ్‌ రూం వదిన. అలసిపోయి పడుకుందేమో? నేను లేపుతానులే! నువ్వు ఏమీ అనుకోకు.. కూతురు మాటలు లీలగా వినబడుతున్నాయి.
అదికాదు కౌసల్యా! ఇంకా నాలుగైదు రోజుల్లో అందరం వెళ్లిపోతాం కదా! అప్పటి వరకు ఆవిడ ఆ గదిలోకి పోకుండా ఆగితే ఏమౌతుంది? ఇప్పుడు ఏవైనా కనబడకుండా పోతే ఆమెను అంటే వూరుకుంటారా? పోయినసారి వచ్చినప్పుడు, నేనేదో? అన్నానని మీ నాన్నగారు ఎన్నేసి మాటలు అన్నాడో! నీకు గుర్తులేదా? మనం ఇండియా నుండి రిటర్న్‌ అయ్యే ముందు ఏదో ఒక ‘గిల్లికజ్జాలు’ పెట్టుకోవడం మీ అమ్మకు బాగా అలవాటై పోయింది. ప్లీజ్‌! ఆవిడను బయటకు రమ్మని చెప్పు. నేను వెళ్ళి అన్నీ సర్దుకుంటాను అని అంటోంది..
విని, వినబడనట్లుగా వినబడుతున్న కోడలు, కూతురు సంభాషణలకు మెలకువ వచ్చిన కరుణ ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. నిద్ర మబ్బు ఒక్కసారిగా ఎగిరిపోయింది. భర్త ఎక్కడ వాళ్ళ మాటలు విన్నాడో? అని భయపడుతూ గది బయటకు వచ్చింది కరుణ. రంగారావు హాల్లో పిల్లలతో ఇంకా చెస్‌ ఆడుతూనే వున్నాడు.. హమ్మయ్యా! ఊపిరి పీల్చుకుని తప్పు చేసిన దానిలా కూతురు, కోడలు ముందు తల వంచుకుని సిగ్గుతో వంటింట్లోకి నడిచింది కరుణ.

రంగారావు నిట్టూర్చుతూ ఇంట్లోకి వచ్చాడు. ”కరుణా ఎక్కడున్నావు? ఇల్లు చూడు ఎంత అసహ్యంగా వుందో? సర్కస్‌ గ్రౌండులా ఇల్లంతా చెత్త నిండుకుని వుంది. రేపు ఎవరినైనా పిలిపించి ఇల్లంతా శుభ్రం చేయిస్తాను. నువ్వు మాత్రం ఆ పనులు చెయ్యమాకు..” అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
ఎంతసేపటికి భార్య మాట గాని, అలికిడి గాని వినబడక పోవడంతో లేచి ఒంటింట్లోకి వెళ్ళి చూశాడు. కరుణ కనబడలేదు.
”కరుణా ఎక్కడా?” అంటూ లోపలికి వెళ్ళి బెడ్‌రూమ్స్‌ వెతికి వచ్చాడు. అక్కడా ఆమె కనబడలేదు. అతనిలో ఒకవైపు కంగారు మరోవైపు భయం మొదలైంది. హడావిడిగా అటూఇటూ తిరుగుతూ.. ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మళ్ళీ బెడ్‌ రూముల్లో వున్న వాష్‌రూంలను వెతికి వచ్చాడు. భార్య కనబడక పోవడంతో, అతని శరీరం సన్నగా వణకడం ప్రారంభించింది. ఎందుకైనా మంచిదని పెరట్లోకి వెళ్ళి చూశాడు.
బావి దగ్గర కూర్చొని అంట్లు తోముతున్న భార్యను చూసి అతనికి ఆగిపోతోందనుకున్న ఊపిరి ఒక్కసారిగా వచ్చినట్లైంది. ఏమీ మాట్లాడకుండా భార్య పక్కన స్టూలు వేసుకుని కూర్చున్నాడు,
”కరుణా! నువ్వు కనబడక పోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా?” అన్నాడు.
భర్త వైపు ప్రేమగా చూస్తూ ”నేను ఎక్కడికి పోతానండి మిమ్మల్ని వదిలి?” అంది.
భార్య తోమి, కడిగిన గిన్నెలను అక్కడున్న గిన్నెల స్టాండులో వెయ్యడం మొదలు పెట్టాడు రంగారావు.
”ఏంటి సంగతులు? మీ కొడుకు, కూతురు ఏదో మంతనాలు జరిపినట్లున్నారు మీతో? ”
”ఆ.. ఏముంటుంది? ఏం లేదులే…!”
”పిల్లలేదో అన్నారు.. నాతో.. చెప్పండి వాళ్లెమన్నారో?”
రంగారావుకు ఇక చెప్పక తప్పలేదు. ”అదే ఇల్లు, పొలాలు అమ్మి వాళ్ళ దగ్గరకు వచ్చి వుండమంటున్నారు.”
”మీరేం అన్నారు?”
”అది కుదరదు. అయినా అమ్మను అడిగి చెబుతాను అన్నాను”.
”అదేంటి? నన్ను అడిగి చెప్పడం ఏంటి? మీ నిర్ణయం ఏదో చెప్పలేకపోయారా? వాళ్ళు నన్ను తప్పుగా అర్ధం చేసుకోరా మీరలా అంటే?”
”చివరికి చెప్పాను” అన్నాడు నసుగుతున్నట్లుగా..
”ఏమని చెప్పారేంటి?”
”మేం రావడం కుదరదు. మాకు ఈ ఊళ్ళో వున్న వసతులు, ఆనందం మాకక్కడ వుండదు. కాలక్షేపం కూడా కాదు. మీరుండే ఆ ఇరుకిరికు గదుల్లో మాకు ఊపిరి ఆడదు. ఇక్కడ వున్న స్వచ్చమైన గాలి, నీరు, వెలుతురులు మాకు అక్కడ దొరకవు. మీరెలాగూ రెండేళ్లకు ఒకసారి వస్తున్నారు కదా! మీకు మాకు ఊపిరి ఆడని పరిస్థితి ఎందుకు లేరా? మేం ఇక్కడే ప్రశాంతంగా వుంటాం. ఇక్కడ ఎవరిని పిలిచినా పలుకుతారు. మాకు రావాలని అనిపించినప్పుడు మేమూ వస్తాం. మీకు తీరినప్పుడు మీరూ వచ్చి పోతుండండి అని చెప్పాను.
”పిల్లాడు ఏమన్నాడు? ఒప్పుకున్నాడా?”
”అమ్మకు ఎలా ఇష్టం వుంటే అలా చేయండి నాన్న.. ఈ ఇల్లు చాలా పాతదై పోయింది. పడగొట్టి మంచిగా కట్టించండి. మేం ఎప్పుడైనా వచ్చి వున్నా, మీకు అమ్మకు ఇబ్బంది వుండకూడదు. మీ బెడ్‌ రూం మీకు ప్రత్యేకంగా వుండేలా ప్లాన్‌ వేయించాను. మా ఫ్రెండ్‌ దగ్గర వుండి కట్టిస్తాడు. డబ్బులు, లావాదేవీలు అన్నీ వాడే చూసుకుంటాడు. మీరు పొలం చూసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇల్లును చూడండి చాలు. ఇల్లు కంప్లీట్‌ అయ్యాక మేం మళ్ళీ వస్తాం . నేను వాడితో టచ్‌లో వుంటాను. మీరు ఇల్లు అయ్యేదాక ఎక్కడ వుంటారో? అది మాత్రం మీరు ఆలోచించండి చాలు అన్నాడు. ఇదిగో పిల్లాడు ఇచ్చిన పేపర్లు అంటూ.. కొడుకు ఇచ్చిన ప్లాన్‌ పేపర్లను భార్యకు చూపించాడు.
కరుణ ఆశ్చర్యపోతూ.. ”నిజమా? వాడు అలా అన్నాడా? ఎంతైనా వాడు మన కొడుకండి.. మన బాధను అర్ధం చేసుకున్నాడు” ఆనందంగా అంది కరుణ..
నాలుగు రోజుల క్రితం కొడుకును పొలానికి తీసుకునిపోయి, ఇల్లు పెద్దగా కట్టించి, మీ అమ్మకు ఒక ప్రైవసీ గదిని ఇవ్వాలకుంటున్న. నువ్వు డబ్బులు పెట్టి సాయం చేస్తే సరి. లేదంటే, పొలం అమ్మి నేనే కట్టించుకుంటా అన్నాడు. కొడుకు పొలానికి, డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మధ్య వున్న లాభనష్టాలు బేరీజు వేసుకుని, బాగా ఆలోచించి, తన ముందే అతని మిత్రుడితో మాట్లాడిన విషయం, ఇంటిని కొడుకు మిత్రుడు దగ్గర వుండి కట్టించడానికి ఒప్పుకున్న విషయం, అందుకు కొడుకు పూర్తి పెట్టుబడి పెట్టే లావాదేవీల గురించి చెప్పిన విషయం నిర్మొహమాటంగా తన నిర్ణయాన్ని కొడుక్కు ఖచ్చితంగా చెప్పిన విషయం గుచించి భార్యకు చెప్పి నొప్పించడం ఇష్టంలేక, మనసులోనే నవ్వుకుని తప్తిగా ఫీల్‌ అయ్యాడు రంగారావు.
– బండారు విజయ, 8801910908

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -