Sunday, July 20, 2025
E-PAPER
Homeజోష్ట్రెండింగ్‌ రిలేషన్‌షిప్స్‌...

ట్రెండింగ్‌ రిలేషన్‌షిప్స్‌…

- Advertisement -

ప్రేమ.. పెళ్లి.. రిలేషన్‌షిప్‌.. డేటింగ్‌.. ఈ పదాల్ని పలవరించకుండా యువతకి రోజు గడవదు. ఈమధ్య కాలంలో కుర్రకారు నోళ్లలో బాగా నానుతున్న కొత్త డేటింగ్‌ ట్రెండ్‌లపై ఓ లుక్కేద్దాం.
ఓ అమ్మాయి.. ఇంకో అబ్బాయి.. నిత్యం అభిప్రాయాలు కలబోసుకుంటారు… వాళ్లు స్నేహితులేం కాదు. కుదిరితే పెళ్లాడాలనుకుంటారు.. కుదరకపోతే బ్రేకప్‌ చెప్పేసుకుంటారు… అయినా ప్రేమికులేం కాదు!

మరి వాళ్ల మధ్య ఉన్న బంధమేంటి? అంటే అది ‘సిచ్యుయేషన్‌షిప్‌’. యువత నోళ్లలో ఈ మధ్యకాలంలో బాగా నానుతున్న సరికొత్త రిలేషన్‌షిప్‌ ట్రెండ్‌.
అమర్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సహోద్యోగి వల్లిక అంటే ఇష్టం. ఆమెకూ అతడిపై అదే ఫీలింగ్‌. కలిసి పార్టీలకెళ్తారు. ప్రేమికుల్లాగే పార్కుల్లో తిరుగుతారు. అన్నీ సవ్యంగా జరిగితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలోనే అమర్‌కు విదేశాలలో మంచి ఉద్యోగం దొరికింది. అక్కడే స్థిరపడే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయితో అనుబంధానికి బ్రేకప్‌ అన్నాడు. తనూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పింది. ఇదే సిచ్యుయేషన్‌షిప్‌. ఇది ఒక్క అమర్‌ కథే కాదు. మిలీనియన్లు, జనరేషన్‌ జడ్‌లో చాలామంది ఇదే బాటలో ఉన్నారు.

ఈ ధోరణిలో అమ్మాయి, అబ్బాయి మధ్య మంచి అవగాహన ఉంటుంది. అభిప్రాయాల కలబోత ఉంటుంది. కానీ కమిట్మెంట్లూ కాకరకాయలేం ఉండవు. ఆ ఇద్దరూ చూడ్డానికి ప్రేమ పక్షుల్లాగే ఉంటారు. ఏ క్షణమైనా పెళ్లిపీటలెక్కుతారు అన్నట్టుగానే ఉంటారు. కానీ పెళ్లి బాసల ప్రస్తావన ఉండదు. కుదిరితే సరి. లేదంటే.. ఎవరి దారి వారిదే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బంధం ప్రేమకి తక్కువ.. స్నేహానికి ఎక్కువ. ‘మేం లవ్‌లో ఉన్నాం..’, ‘ఫలానా వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నా’ అని సిగ్గుల మొగ్గలవుతూ చెప్పే ప్రేమికుల్లాగే.. ‘మేం సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నాం’ అని చెప్పుకోవడం పట్టణాలు, నగరాల్లోని ఆధునిక యువతకి ఎక్కువవుతోంది.
ప్రేమ విఫలమైతే దేవదాసులయ్యేవాళ్లు.. ప్రేమ పేరుతో రక్తపాతాలు సష్టించే వాళ్లూ అక్కడక్కడా ఉండొచ్చుగాక.. ఈ కాలం యువత బంధాలు.. అనుబంధాలు.. కెరియర్‌ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉంది. ముఖ్యంగా జీవితాన్ని మలుపు తిప్పే ఈ వయసులో ఎలా నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో వాళ్లకి బాగా తెలుసు. ఈ వయసు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. యువతలో దండిగా ఉండే శక్తిని సానుకూలంగా వాడుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కానీ ప్రేమ, ఆకర్షణల మత్తులో అత్యధికులు మగ్గిపోతుంటారు. రిలేషన్‌షిప్‌ల మత్తులో మునిగిపోతుంటారు. సిచ్యుయేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు.. అలాంటి రకం కాదు. మనసుకి నచ్చినవాళ్లతో వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. పేరెంట్స్‌, కెరియర్‌, భవిష్యత్తు కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ‘నీకోసమే నా జీవితం..’, ‘నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా’, ‘నీకోసం ప్రాణాలైనా ఇస్తా’ లాంటి డైలాగులు వాళ్ల డిక్షనరీలోనే ఉండవు. ప్రేమ, అనుబంధం పేరుతో.. దేన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లది అవకాశవాదం, స్వార్థ బుద్ధి. అయితే అవతలి వాళ్లను మోసం చేసే ఉద్దేశం లేకపోవడం.. ప్రేమకన్నా జీవితమే ఎక్కువ అనే స్పష్టత ఉండటంతో ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లది టేకిటీజీ పాలసీ అంటుంటారు మానసిక నిపుణులు.

బ్రెడ్‌ క్రంబింగ్‌
ఎవరిపైనైనా శ్రద్ధ చూపించడం, కవ్వించే సందేశాలు పంపడం, ఇష్టం అన్నట్లు ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ బంధాలు మాటల వరకు మాత్రమే పరిమితం. సీరియస్‌ బంధంలోకి అడుగుపెట్టాలని అనుకోరు.
ఒంటరిగా ఉండేవాళ్లు లేదా ఎవరైనా తమ ఉనికిని గుర్తించాలి అనుకునేవాళ్లు ఇలాంటి సందేశాలు పంపుతూ ఉంటారు. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో ఇలాంటి సందర్భాలు ఎక్కువ. ఇలా మెసేజెస్‌ చూసి ప్రేమ అనుకుని మోసపోయిన ఉదాహరణలు కోకోల్లలు.
ఎక్కడో పరిచయమవుతారు, లేదా ఆన్‌లైన్‌లో కలుస్తారు. నీ గురించే ఆలోచిస్తున్నా అంటారు. కానీ, కలుద్దాం అంటే రారు. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ఆసక్తి ఉండదు. బ్రెడ్‌ క్రంబింగ్‌కి ఇది కూడా ఓ ఉదాహరణ.

బెంచింగ్‌
కొన్ని కంపెనీలు కొంత మంది ఉద్యోగులను బెంచ్‌పై ఉంచుతుంటుంది. అంటే వాళ్లను పనిలో తీసుకోవచ్చు లేదా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు. కచ్చితమైన పని ఉండదు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్‌ రావచ్చు అనే ఉద్దేశంతో రిక్రూట్‌మెంట్‌ సమయాన్ని తగ్గించుకునేందుకు చాలా కార్పొరేట్‌ సంస్థలు ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి.
ఇదే మాదిరిగా ప్రేమిస్తున్న వ్యక్తితో బంధంలో ఉన్నట్లు ప్రవర్తిస్తారు కానీ ఉండరు. దీనిని బెంచింగ్‌ అంటారు. మరోవైపు వేరే భాగస్వామి కోసం వెతుక్కుంటూ ఉంటారు. డేటింగ్‌ యాప్స్‌, టెక్నాలజీలు కూడా వీళ్లు కాకపొతే మరొకరు అనుకునేలా చేస్తున్నాయి.
బంధాల పట్ల జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా చాలా స్పష్టంగా ఉంటున్నారు. పెద్దవాళ్లు ఎవరిని చూపిస్తే వాళ్లకే అవును అనేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. తమ వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కఠినమైన బంధాల వలయంలో ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు.

ఆర్బిటింగ్‌
ఒక బంధం నుంచి విడిపోయిన తర్వాత కూడా అవతలి వ్యక్తి మీరు చేసే పనులపై దష్టి పెడతారు. ఇది ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తారు. మీ స్టోరీస్‌ చూస్తారు, సోషల్‌ మీడియాలో మీ పోస్టులను లైక్‌ చేస్తారు. కానీ మాట్లాడరు. నేను నీపై ఆసక్తి చూపిస్తున్నాను అనే సందేశాన్ని మాత్రమే ఇస్తారు. ఒక్కొక్కసారి ఇది అవతలి వ్యక్తిని చాలా అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది.

కుషనింగ్‌
ఒక వ్యక్తితో బంధంలో ఉంటారు. కానీ మరొకరితో వారిని ప్రేమిస్తున్నట్లు, ఇష్టం ఉన్నట్లు ఫ్లర్ట్‌ చేస్తూ ఉంటారు. మరొకరితో ప్రేమలో ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించరు.
ఇలా ఒక బంధంలో ఉంటూ మరొకరితో ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించడాన్ని కుషనింగ్‌ అంటారు. ప్రస్తుతం ఉన్న బంధం తెగిపోతే ఏమవుతుందో అనే భయంతో మరొకరితో కూడా ప్రేమగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.

లవ్‌ బాంబింగ్‌
ఇది అతి ప్రేమ అని చెప్పుకోవచ్చు. ప్రేమతోనో లేదా అటెన్షన్‌ కోసమో లేదా అదుపులో పెట్టుకోవడానికో లవ్‌ బాంబింగ్‌ చేసి, బోలెడన్ని గిఫ్టులు కొనడం, అనుక్షణం వెంటాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది మొదట్లో బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులకు టాక్సిక్‌గా మారిపోతుంది.

సిమ్మర్‌ డేటింగ్‌
కొన్ని నగరాల్లో చాలా మంది యువత సిమ్మర్‌ డేటింగ్‌ చేస్తున్నారు. అంటే బంధాల్లోకి అడుగుపెట్టడానికి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. కలిసి గడుపుతున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్యా మానసిక బంధం ఏర్పడిన తర్వాత తమ బంధాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు.

మున్డేన్‌ డేటింగ్‌
ఈ తరహా డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంటి పని, వంట పనులు చేసుకుంటారు. షాపింగ్‌కి వెళ్తారు. రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ మాత్రమే కాకుండా బాధ్యతలను, పనులను పంచుకుంటూ డేటింగ్‌లో ఉంటారు.

నానో షిప్స్‌
చాలా కొన్ని రోజులు మాత్రమే రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉన్నంత కాలం ఒకరి నుంచి ఒకరు ఒక విధమైన మానసిక స్థైర్యాన్ని పొందుతూ ఉంటారు. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం అనుకుంటారు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -