Sunday, July 20, 2025
E-PAPER
Homeకవితమాటల్లేని చోట

మాటల్లేని చోట

- Advertisement -

చూపులు
మాట్లాడుకోవటం నీకు తెలుసు
నిశ్శబ్ధం భయాన్ని నింపుకొని
ప్రయాణం చేస్తోంది చూడు
నాలికలు రెండూ
పిడస గట్టాయేమో
రెప్పలు కిటికీలు తెరిచి
రెక్కల్ని తడిలో అల్లార్చుకుంటున్నాయి
రెండు దీర్ఘ శ్వాసల నడుమ
ఊపిరి ఒక్కటై సాగుతోంది
సరాగాల తీగలపై
ఇటునుంచి అటుకు
కావ్యంగా కదిలిపోతున్నాయి
మౌనం కూడా
తియ్యగానే వుంటుంది
నాలుగు కళ్ళు కవించుకుంటున్నప్పుడు
మాటల మూటలు అక్కర్లేని
మరో ప్రపంచ భాషా సౌందర్యం అది
మౌనం మాటై
ప్రయాణం చేయాలంటే…
నువ్వు నిజంగానే
మనసున్న వాడివై వుండాలి
మనసిచ్చిన వాడివై వుండాలి
నిశ్శబ్ధం ఎప్పుడూ
నిశ్శబ్దంగానే వుండదు
కోటాను కోట్ల ఆర్ద్రతను
గుండెళ్ళో నింపుకుని
ఈ క్షణమైనా విస్ఫోటనం అయ్యేందుకు
నర్మగర్భంగా స్పందిస్తూనే వుంటుంది
మాటల్లేని చోట మౌనమే
మరో రూపాంతర పలుకై పల్లవిస్తోంది..!
– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -