వాళ్ళకు కత్తులు కుత్తుకలు రెండు ఒకటే
చూసినంత కాలం చూపించే జాలం
అది వెబ్ సిరీస్ మాయా తంత్రం
అది సినీ జగతుల కుయుక్తుల మంత్రం
పెద్దగా పెరిగిపోయే నగరాలు
చిన్నబోయి చూస్తున్న పల్లెటూర్లు
రహదారిపై వచ్చి పోయే వాహనాల గోల
ఎట్టకేలకు చీకటి పక్షులు రివ్వున ఎగిరిపోతుంటే
చిట్టచివరి బస్సును పట్టుకునే సామాన్యుడి పరుగులా
ఈ బుల్లితెర తనవైపే మమతలను కట్టిపడేస్తుంది
కళ్ళు రక్త ధారలు కురిపిస్తుంటాయి
ఇక కాలమంతా చూపుల కాపురానికే సరిపోతే
మనసులు వెలుగని మార్మిక మాటలు
ఇప్పుడిదంతా కవిత్వ విషయమైపోతున్నది
పరాయీకరణంలో వికార పార్శ్వాలన్నీ
సోఫాలకతుక్కుపోతుంటాయి
చేతుల్లో గ్లాసులూ రిమోటూ ఆటలాడుతుంటాయి
ఆడ పాత్రలు విలాసవస్తువైపోతూ
మగపాత్రలు వినిమయాల గాలాలైపోతూ
నిశీధి నిరీక్షణలూ, తమస్సు తిమిరాలూ
రాత్రి కోణపు తంత్రులు మీటే
గాయాలు చేస్తున్నా గుండేలేని మనుషులు
వేటికీ వెరవని కోటి దోపిళ్ళూ
కంటిపొరలకు కుంటి సాకుల చెప్తున్నాయి
పొరపాటున పిల్లలు నీళ్ళ కోసం నిద్రలేచారో
అశ్లీలత అంతా ఇంత చింత లేకుండా చూస్తుంటే
నయనతెరలెలా ఊరుకుంటాయి?
‘పెద్దలకు మాత్రమే’ సీరియళ్ళ సెన్సార్
‘ఎ’ సర్టిఫికెట్ రాబోయే చదువుల సర్టిఫికెట్లను
సమూలంగా ఎగరేసుకు పోతుందని
సెల్లుకూ తెలుసూ బళ్ళల్లో వీళ్ళ స్నేహితులకూ తెలుసు
తెలియనిది తల్లిదండ్రులకే
మహామహోపాయాల మార్కెట్‌కు కావలసిందిదేకదా!
– డా|| కొండపల్లి నీహారిణి
మహామహోపాయాలు
- Advertisement -
- Advertisement -