Sunday, July 20, 2025
E-PAPER
Homeసమీక్షఅది ధిక్కార నాగస్వరం

అది ధిక్కార నాగస్వరం

- Advertisement -

ఈ పుస్తకాన్ని కవి తన తల్లి కోయి సుబ్బమ్మకు, తనను తీర్చిదిద్దిన గురువులకు అంకితం చేశారు. యాభై కవితలున్న ఈ పుస్తకం ఇరవై ఏళ్ల కిందటే రావాల్సివుంది. ప్రొ||శిఖామణి, కలేకూరి ప్రసాద్‌, డా||చెన్నయ్య (కెనడా) ఎంతో విలువైన ముందు మాటలురాశారు. అట్టవెనుక ప్రముఖ కవి, విమర్శకులు జి. లక్ష్మీనరసయ్య బ్లర్ట్‌ రాశారు.
కోయి కోటేశ్వరరావు ప్రకాశం జిల్లాలో ఎనికపాడులో పేద వ్యవసాయ కార్మికుల ఇంట పుట్టి, ఎన్నో ఆకలి బాధలు – అవమానాలు; కన్నీళ్లు – కష్టాలు, పేదరికం ఎదుర్కొంటూ పి.జి. చేసి డాక్టరేట్‌ పొంది, ఒక కళాశాలలో హెడ్‌ ఆఫ్‌ తెలుగు డిపార్ట్‌మెంట్‌ స్థాయికి ఎదిగిన కవిగా, విమర్శకునిగా, సామాజిక ఉద్యమకారునిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందారు. నాటి కారంచేడు, చుండూరు, పదిరకుప్పం, వాకపల్లి… ఇలా దళితులపై సాగించిన మారణకాండను చూసి వాటినెదిరిస్తూ ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమాన్ని ‘కావడి కుండల్లో’ మోశారు. పల్లె అందాన్ని చిద్రం చేస్తున్న ప్రపంచీకరణపై అక్షర ధిక్కార స్వరం వినిపించారు. అందుకే సాహిత్య లోకం కోయి కోటేశ్వరరావు గార్ని గౌరవిస్తుంది. నిశాని, గుండెడప్పు, క్రమంలో నాగస్వరం… ధిక్కార నాదస్వరమైంది. దళిత బహుజనులు అనేక పేర్లతో పిలిచినా చారిత్రకంగా వారంతా నాగజాతికి చెందినవారే అంటారు అంబేద్కర్‌. బుద్దుని కాలం నుండి నాగుల ప్రస్తావన వుంది. ఈ నాగజాతిని అణిచి వేయడంతో ఆర్యులు పన్నిన కుట్రలను చరిత్రకారులు పేర్కొన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని కాల్చి వేశారు వీధుల్లో అంబేద్కర్‌ ఆనాడు.
ఒక చిన్న పల్లెటూరు నుండి ప్రారంభమైన కవితలు… అగ్రరాజ్యం చేస్తున్న విధ్వంసాల దాకా పాఠకుల్ని చదివించి, ఆలోచింపజేస్తాయి. అన్యభాషల్లోకి అనువదించాల్సిన కవితలెన్నో ఈ సంపుటిలో వున్నాయి. కష్టాలతో కాపురం చేస్తున్న ‘అమ్మ’ను ‘పత్తిపూవు’ కవితలో కవి (పేజి.34) ఇలా రాశారు.
”కాళ్లకింద ముల్లు కడుపులో కత్తి/ కూడా బలుక్కొని ఒకేసారి దిగబడినా/ నా పిచ్చితల్లి పెదాల మీద మాత్రం/ పత్తిపువ్వులే పరిమళిస్తారు..” అలాగే తండ్రిపై ప్రాణవాయువు కవితలో (పేజి 35) ఉత్పత్తి కులాల కష్టజీవుల శ్రమను తండ్రి కర్తవ్యంలో చెప్పారు.
”అయ్య చెమట చుక్కలు పరిచిన రహదారిపైనే కదా/ నేనంటూ ఇక్కడదాక నడిచివచ్చాను./ నాకే కాదు మా ఊరి అన్నదాతకు కూడా/ వెన్నెముక మా అయ్యే…/ ఆరుగాలం మా అయ్య రెక్కల్ని కరిగించుకుంటే/ ఆసామి కల్లంలో పసిడి రాశులు విరిశాయిగానీ/ అయ్యకడుపులో ఆకలిమంటలు చల్లారనేలేదు” అంటారు. ఇక్కడ శ్రమదోపిడి అద్దంలా కనిపిస్తుంది. గీతోపదేశం కంటే శ్రమోపదేశమే ఈ విశ్వానికి శిరోధార్యం అంటారు కవి. మూఢనమ్మకాలపై ‘కాలసర్పం’ అనే కవితలో ఒక చోట ఇలా అంటారు (పేజీ 47).
”వైజ్ఞానిక సైనికులకు సమాధికట్టి/ దొంగబాబాల పాదాలను నాకుతుంది/ భలేమంచి చౌక బేరమంటూ – జాతి సౌభాగ్యాన్ని ధారపోసి/ కార్పొరేట్‌ బేహారితో రమిస్తుందీ కాలసర్పం”.
పాలకులు ఎవరైనా… ఏ పార్టీవారైనా.. వీళ్లంతా కార్పొరేట్‌ శక్తుల సేవలో తరించేవారే! ఖరీదైన న్యాయం సామాన్యులకు చేరడంలేదు ఈనాడు. అంటరానితనం, ఆకలి, అసమానం, అత్యాచారం, కాషాయనీతులు నేడు నిత్యకృత్యమై పోతున్నాయి. ఈ విధానాలపై ‘ఐ అబ్జెక్ట్‌ యువరానర్‌’ (పేజి 49) కవితలో బలమైన అభివ్యక్తితో కవి ఇలా అంటారు ఒక చోట.
”అంటరానివాడ అవమానాలను/ ఎఫ్‌ఐఆర్‌ మింగేసిన అక్రమాలను చార్జ్‌షీట్‌తో సమాధి చేయబడిన అత్యాచారాలను/ లెక్కగట్టలేని సర్వోన్నత అంధత్వం కాషాయ నీతులను వర్ణిస్తుంది/ జనహిత ప్రయోక్త కావాల్సిన/ ఈ ధర్మాసనాన్ని మనువాదం పీడిస్తుంది/ ఐ అబ్జెక్ట్‌ యువరానర్‌!!” తీర్పు ఇచ్చిన పెద్దలు ఆనక గవర్నర్లు, ఎం.పి. లౌతారు. ఎండ్లూరి సుధాకర్‌పై స్మృతి కవితలో కవి ఒక చోట ‘అగ్నిరాగం’తో ఇలా అంటారు (పేజి.72).
తనువంతా గాయాలైనా/ అణువంత చెక్కుచెదరకుండా/ అగ్నిరాగాలను ఆలపించిన/ అంటరాని పిల్లనగ్రోవి/ హఠాత్తుగా మూగబోయింది. కొత్త గబ్బిలానికి హక్కుల పోరు పాఠాలను/ బోధించిన కవి శ్వాస ఆగిపోయింది. అలాగే భీమరాజ్యం కవితలో బలమైన విశ్వాస ప్రకటనగా ముగింపు ఇస్తారు (పేజి.83).
”పరమ నిశ్శబ్దంగా రాజ్యం/ అగ్నిగుండంలో ఆజ్యం పోస్తూ ఫైరింజన్‌లా ఫోజులిస్తుంది/ దినదినగండాలను రగిలిస్తూ దీర్ఘాయుషుతో విషం కక్కే ఈ హోమగుండంపైకి/ చైతన్య సముద్రాలుగా ప్రవహిద్దాం ధర్మపథంలో భీమరాజ్యాన్ని లిఖిద్దాం” లేని రామరాజ్యం భజన పరులకు ‘భీమరాజ్యం’ బోధపడేదెన్నడో?
మిత్రుడు కామేశ్వరరావు కవితలో రాసినట్టుగా ‘కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి. అవి విసర్జించమంటే దేశానికి, దేహానికి అరిష్టం అంటారు. అలాగే ‘నిమజ్జనం’ (పేజి.89)లో కోటేశ్వరరావు చివర్లో ఇలా అన్నారు.
”మన సాంకేతిక పరిజ్ఞానం/ చంద్రుడిమీద రహస్యాలను శోధిస్తుంటే/ మన సంస్కారం మాత్రం – ఇంకా కులం మలాన్ని వాసన చూస్తుంది” – చక్కటి ప్రతీక. అమెరికాను ‘ఆధునిక వామనుడు’గా చెపుతూ… ఒక చోట కవి ఇలా రాశారు. ”తడిగుడ్డతో గొంతు కోస్తాడు/ వాడంతే.. పరమ యుద్ధోన్మాది/ ఒక్క చమురు బొట్టుకోసం/ లెక్కలేనన్ని రక్త సముద్రాల్ని పొంగిస్తాడు/ కుడిచేతితో శాంతి పావురాన్ని ఎగురవేసి ఎడమ చేతితో దాన్ని కాల్చి చంపే/ వృత్తి వేటగాడి హింసాప్రవృత్తిని/ చెట్టుకీ పుట్టకీ … కథలుగా చెప్పాలి/ వంద రూపాయలు అప్పిచ్చి/ కోటి షరతులు విధించే/ వాడి ఆర్థిక తీవ్రవాదాన్ని అమెజాన్‌ నదిలో ముంచాలి (పేజి.100). క్యూబా, చిలీ, వియత్నాం, ఆఫ్ఘన్‌, ఇరాన్‌, నేటి ఇజ్రాయిల్‌, గప్ట్‌ల్లో ఒక బస్సు దహనంలో విజయ వర్థనం, చలపతి లకు 1997 ఉరిశిక్ష వేసిన ఈ వ్యవస్థ 600 పైగా బస్సుల్ని (ఒక్క ఎం.ఎల్‌.ఎ. మృతి సందర్భంలో) ఏ ఒక్కర్ని ఉరితీయలేదే? కులాన్ని ఉరితీయాలంటాడు కవి (పేజి.115). ”దొడ్డిదారిలో నా దేశంలోకి చొరబడ్డ ఆర్య ఖడ్గాలు నా గొంతు కోయాలని ఘోషించాయి. ఉన్మాదంపై/ దాడి నిత్య దండయాత్ర/ నేనే నిజమైన దేశభక్తుడిని” అంటారు నాగస్వరంలో కవి. వ్యధల వృత్తాంతాలను శక్తివంతమైన కవితలుగా అక్షరీకరించే కోటేశ్వరరావు గారు మరిన్ని అక్షర క్షిపణులు కవితావరణంతో మోహరించాలి. శుభాకాంక్షలతో.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -