లక్ష్మికి పదేళ్లు. ఐదో తరగతి చదువుతున్నది.
ఆమెకు మొక్కలు, పక్షులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి తోటలో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి.
ఇంటి చుట్టూ ఉన్న మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోస్తుంది. పక్షులకు గింజలు వేస్తుంది. చిన్న చిన్న మట్టి మూకుళ్ళు తెచ్చి వాటిలో నీళ్లు పోస్తుంది. ఆమె వేసిన గింజలు తిని నీళ్ళు తాగే పక్షులను చూసి సంతోషపడుతుంది.
తమ ఇంటి బయట చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుతుంది. తమ ఇంటి తోటలో రాలిన ఆకులను ఆదివారం ఆదివారం అన్నతో కలిసి మొక్కల మొదళ్ళ చుట్టూ పరుస్తుంది.
అది నవంబర్ నెల. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయంలో వ్యాసరచన, ఉపన్యాసం పోటీలు పెట్టారు. లక్ష్మిని, ఆమె అన్నను ఆ పోటీలో పాల్గొనమని అమ్మ, నాన్న ఉత్సహించారు.
అమ్మో .. అందరి ముందు నేను మాట్లాడలేను. వ్యాసరచన పోటీలో పాల్గొంటానని చెప్పాడు అన్న అభినవ్.
అమ్మా.. నాకు అందరిలో మాట్లాడటానికి ఎటువంటి భయం లేదు నేను మాట్లాడతా అని చెప్పింది లక్ష్మి.
అది పై తరగతుల పిల్లలకేనని అన్న చెప్పడంతో మొదట నిరుత్సాహ పడింది. ఏం బాధపడకు, వచ్చే ఏడు నువ్వు హై స్కూల్ కి వెళ్తావ్ కదా… అప్పుడు పాల్గొనవచ్చు అని బుజ్జగించింది అమ్మ.
లక్ష్మికి ఈ ఏడాదే ఆ పోటీలో పాల్గొనాలని ఉంది. వీలున్నప్పుడల్లా అమ్మ, నాన్నల దగ్గర పర్యావరణం గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అలాగే బడిలో టీచర్ ని కూడా అడిగి తెలుసుకుంది. గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివింది.
పోటీల రోజు తానొక్కటే గ్రంథాలయానికి వెళ్ళింది. తన పేరు ఉపన్యాస పోటీకి ఇచ్చింది. అది హైస్కూల్ వాళ్లకు మాత్రమే అని చెప్పారు నిర్వాహకులు.
అయినా వినలేదు. చిన్న క్లాసు పెద్ద క్లాసు అని తేడా ఎందుకు? చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు భేదం ఎందుకు? ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళకేగా మీరు బహుమతి ఇచ్చేది అంటూ తన అని వాదించింది. లక్ష్మి ఉత్సాహం చూసి నిర్వాహకులు సరే అన్నారు. పెద్ద పిల్లలందరూ మాట్లాడిన తర్వాత చివరగా లక్ష్మికి అవకాశం ఇచ్చారు.
ధైర్యంగా వేదిక ఎక్కింది. అందరి వైపు కలియ చూస్తూ తన ఉపన్యాసం మొదలు పెట్టింది.
”నా ప్రియమైన ఉపాధ్యాయులకి, స్నేహితులకి నమస్కారం.
పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం. చెట్లు, నదులు, జంతువులు, పక్షులు, రకరకాల జీవులు, ప్రకతి అన్నీ కలిస్తేనే పర్యావరణం. పర్యావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కానీ, మనుషుల వల్ల పర్యావరణం కలుషితం అవుతున్నది. పాడైపోతున్నది. మనం మన అవసరాల కోసం, స్వార్థం కోసం చెట్లు నరికేస్తున్నాం. నీళ్లు ఇష్టం వచ్చినట్లు వాడి వధా చేస్తున్నాం. మన అవసరాల కోసం ప్లాస్టిక్ వాడతాం. అవసరం తీరిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. అలా చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతున్నది.
మన ముందు వాళ్ళు అంటే మన తాత ముత్తాతలు, ముత్తమ్మమ్మలూ ఇంకా వాళ్ళ కంటే ముందు వాళ్ళు మనం చేసినట్లు చేస్తే.. మనకి నీళ్లు దొరికేవి కాదేమో! ఈ గాలి ఉండేది కాదేమో! మాస్క్ పెట్టుకు తిరిగేవాళ్ళమేమో! మన ముందు వాళ్ళు మనకి ఇచ్చినట్లే మనం మన తర్వాతి వాళ్ళకి మంచి పర్యావరణాన్ని ఇవ్వాలా వద్దా.. ఏమంటారు?!
అసలు ఈ భూమి, నీరు, గాలి, ఆకాశం, ఈ వాతావరణం మనిషి ఒక్కరివేనా? మనతో పాటు జీవించే అనేక ప్రాణులవి కూడా కదా.. అంటే, ఈ ప్రకతిలో ప్రతి ఒక్కరివీ. మరి అటువంటప్పుడు మనం స్వార్ధంతో వాడటం ఎంత అన్యాయం?
ఇకనైనా మనం మనని కాపాడుకోవాలి. మన తోటి జీవులకు ఇబ్బంది కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే ఏం మనం చేయాలి? చెట్లు నాటాలి, నీటిని పొదుపు చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఏదీ వధా చేయకూడదు. అవునా..
మరి మనందరం కలిసి మన పర్యావరణాన్ని కాపాడుకుందామా.. నేనైతే ప్రకతి ప్రేమికురాలినే కాదు, ప్రకతి సైనికురాలినవుతా.. మరి మీరు?” అని లక్ష్మి తన ఉపన్యాసం ముగించింది.
లక్ష్మి ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. పిట్ట కొంచెం కూత ఘనం పొగిడారు.
పోటీలో లక్ష్మికి మొదటి బహుమతి వచ్చింది. లక్ష్మి చాలా సంతోషించింది. పర్యావరణం పట్ల అవగాహన ఇంకా పెంచుకోవాలని అనుకుంది. దోస్తులందరికీ అవగాహన పెరగడానికి ఏం చేయాలా అని ఆలోచించడం మొదలు పెట్టింది.
– వి. శాంతి ప్రబోధ