Sunday, July 20, 2025
E-PAPER
Homeసోపతిమీ విలువ మీకు తెలుసా..?

మీ విలువ మీకు తెలుసా..?

- Advertisement -

మామూలు మొక్క జొన్నపొత్తు (కంకి) కన్నా కాల్చిన దానికే ‘విలువ’ ఎక్కువ. కారణం మనకు తెలిసినదే. కాలినప్పుడు వున్న రుచి మామూలు సమయాలలో ఉండదు. అంటే కాల్చిన తర్వాతనే దాని రుచి మారిందన్నది యదార్ధం. అంటే ఇక్కడ అదే మొక్కజొన్న పొత్తును పిల్లలు తినే తినుబండారం గాను వాడుతుంటాం. అది ఎవరి నోట్లోకి వెళ్ళినా సందర్భాలను బట్టి రుచి మారినా, దాన్ని తిని మనం ఆనందిస్తాం. అంతెందుకు పాదరసాన్ని చూడిండి…
మీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా దాని స్వభావాన్ని మార్చుకుంటుంది. మన స్వభావం కూడా అలాగే వుండాలంటాను నేను. శవయాత్రలో మనం బిగ్గరగా నవ్వితే పిచ్చివాడంటారు. నవ్వుకునే సందర్భంలో బిగ్గరగా ఏడ్చినా కూడా అదే గాటన కడ్తారు. కాబట్టి మన భావోద్వేగాలు పరిస్థితులు, పరిసరాలను బట్టి మార్చుకోవాల్సి వుంటుంది. అలా మార్చుకోలేకపోతే మీలో ఏదో లోపం ఉన్నట్లుగా భావించాలి.
సష్టిలో జన్మించిన ప్రతీప్రాణికి దాని ఉద్దేశ్యం/ కర్తవ్యం పుట్టుకతో నిర్ణయింపబడుతుంది. కోకిలవలే మధుర గానం కాకి చేయలేదు. సీతాకోక చిలుక అందాన్ని గొంగళి పురుగు పొందలేదు. అది దాని తర్వాతి రూపం. దేనితో సంతప్తి పడాలనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి వుంటుంది. దేని రంగు దానిదే, దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అలాగే మనం కూడా మన సహజ సామర్ధ్యాలను మన ప్రతిభను పక్కన పెట్టి ఎదుటివారి పట్ల, పొరుగు వారి పట్ల అసూయను ప్రదర్శిస్తూ వుంటాం. అది ఎంత మాత్రం సమంజసం కాదు. మీరు ప్రయత్నం చేయకుండా మీ చెంతకు ఏమీ రాదు. ఎంత సేపటికి వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే విలువైన సమయం వధా అయిపోతుంది. చివరికి ఏమీ మిగులదు.

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చిన్న కథను ప్రస్తావించుకుందాం… ఓ అడవిలో ఒక కాకి వుండేది. ఆ అడవికి ఓ రోజు తపస్సు చేసుకోవడానికి ఓ ముని వస్తాడు. చెట్టు కింద కూర్చున్న ముని తలపై కాకి కన్నీరు పడుతుంది. అప్పుడు ఆ ముని కాకిని ఎందుకు ఏడుస్తున్నావని అడగగా ఎప్పటి నుండో తన పుట్టుక, రంగు గురించి బాధపడుతున్న కాకి ఆ మునితో, ”ఏమిటి నాకు ఈ పాడు జన్మ. ఏ ఇంటి మీద వాలి కావ్‌ కావ్‌మని అరిచినా వెళ్ళగొడతారు. నల్లగా వున్నానని వెక్కిరిస్తారు. ఎంగిలి మెతుకులు తినే దానినని హేళన చేస్తారు. ఎందుకీ పాడు బతుకు” అని విలపిస్తుంది. ఇదంతా విన్న ముని ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. నాకు హంసలాగా తెల్లగా, హాయిగా నీళ్ళలో ఈదే వరం ఇమ్మని అడుగుతుంది. సరేనని కాకిని హంసలా మార్చేస్తాడు. కాకి హంసలా మారి, దాని దినచర్య, అలవాట్లు అన్నీ మారిపోయాయి.

ఇలా కొద్దిరోజుల తర్వాత ఆ కొలను దగ్గరికి రామచిలక ఒకటి వచ్చి దాహం తీర్చుకుంటుండగా హంస దష్టి చిలుక మీద పడింది. వెంటనే హంస చిలుకను చూసి అబ్బా ఎన్ని రంగులు, ఎంతందంగా వుంది అని హంస చిలుకతో ”నువ్వు ఎంత అందంగా వుంటావు, నేనూ నీలా వుంటే ఎంత బాగుంటుందో” అంది. అప్పుడు చిలక హంసతో ”నా రంగు ఆకులతో కలిసిపోతుంది. నన్ను పంజరంలో బంధించి నా స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తారు. ఇదీ ఒక బ్రతుకేనా?” అని నిట్టూర్చి ”నెమలి రాజసం చూడు దాని అందం ఐశ్వర్యం, ఎంత బాగున్నాయో. దానిని జాతీయ పక్షిగా కూడా గౌరవిస్తారు” అంది. అప్పుడు హంస రూపంలో వున్న కాకి నెమలి దగ్గరికి వెళ్లి, నెమలితో నీ రాజవైభోగం ఎంత బాగుందో అంది. అప్పుడు నెమలి హంసతో ”నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని మీరనుకుంటారు. వేటగాళ్ళు నన్ను వేటాడటానికి ఉబలాట పడతారు. నా రెక్కల నుండి ఈకలు పీకి పిల్లలు పుస్తకాలలో దాచుకుంటారు, కొద్దిమంది నా ఈకలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. ఏం బతుకు నాది” అని వాపోతుంది. విషయం అర్ధమైపోయిన కాకి నెమలితో ”అయితే నువ్వు కూడా సంతోషంగా లేవన్న మాట. మరి ఎవరు అదష్టవంతులు?” అంది నెమలితో.

”ఇంకెవరు నువ్వే. అందరికన్నా అదష్టవంతురాలివి. నిన్ను ఎవరూ చంపరు. మాకు వేటగాళ్ళతో ప్రమాదం పొంచివుంది. నీకు లేదు కదా” అంది. ఆ మాటలు విన్న కాకికి జ్ఞానోదయం అవుతుంది. ఈ కథ ద్వారా తెల్సుకునే నీతి ఏమిటంటే మనం వున్న స్థానాన్ని ఇష్టపడాలి లేనివాటి కోసం ఎదుటివారి పట్ల అసూయ, ఈర్ష్య పెంచుకోవడం, అతిగా ఆశ పడటం మంచిది కాదు. సమస్యలు లేని ఏ ప్రాణీ వుండదు. అలాగే మనుగడ కొనసాగించదు.
మన ఆలోచనలు ఎప్పుడు సానుకూలంగా వుండాలి. ఎదుటి వారు విజయం సాధించారని, మీకు ఏమి రావట్లేదని కూర్చుంటే ఏదీ నీ దరిచేరదు. ఎదుటి వారి గురించి ఆలోచించే తీరిక మీకున్నప్పుడు, మీ గురించి మీరు ఎందుకు ఆలోచించటం లేదో మీ మనస్సును ప్రశ్నిచుకోండి? ఏ వక్షమైనా నీటితోనే ఎదుగుతుంది. దాని మీద మీకు ప్రేమ ఎక్కువై రోజూ పాలు పోసి పెంచుతానంటే అది పెరగదు కదా! త్వరలోనే చనిపోతుంది. అంటే మీ మెదడుకి ఏది అవసరమో అదే ఇవ్వండి. మొక్కకు కావలసినదే మీరు ఇచ్చినప్పుడు మరి మీ మనసుకు కావలసినదేమిటో ఆలోచించుకోలేరా? దానికి కావాల్సింది ఇవ్వలేరా? ధాన్యంలో వున్న రాళ్ళను వేరు చేయవచ్చు. కానీ ధాన్యమే రాళ్ళలో పడిపోతే దాన్ని వెతకటం కష్టం. మీ ఆలోచనలు అడ్డదిడ్డంగా మారిపోతే ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందనే వాస్తవం మరువకూడదు. ‘కుంభ వర్షం కురిసినా బోర్లించిన కుండలో నీరు నిలువనట్లే ఆత్మ విశ్వాసం లేనివాడు విశ్వమంతా తిరిగినా వీసమెత్తు సాధించలేడు’ అన్నట్లు మీ ఆలోచనలు అడుగులు ఎప్పుడూ సానుకూలంగానే వుండాలి. అలా వుంటే ఏ సమస్యా మీ దరిచేరదు. ఒకవేళ వచ్చినా ఆత్మవిశ్వసంతో అధిగమించగలరు. వంద రూపాయల కాగితాన్ని ఎన్ని రకాలుగా మడతపెట్టినా దాని మీద ఎన్ని గీతలు పడినా దాని విలువను కోల్పోదు. మీరు కూడా ఎలాంటి పరిస్థితులలో వున్నా, పడినా లేచినా మీ విలువను కోల్పోవద్దు.
– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -