Monday, July 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమధ్యతరగతిని థియేటర్లకి రప్పిస్తేనే మనుగడ

మధ్యతరగతిని థియేటర్లకి రప్పిస్తేనే మనుగడ

- Advertisement -

అనేక దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిశ్రమకు మధ్య తరగతి ప్రేక్షకులు వెన్నుదన్నుగా నిలిచారు. చిన్న పట్టణాల్లోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల నుండి,
పెద్ద నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల వరకూ థియేటర్లను నింపింది వీళ్ళే. వినోదానికి చప్పట్లు కొడుతూ, భావోద్వేగ దశ్యాలకు కన్నీటిపర్యంతమైంది వీళ్ళే. అంతేకాదు అనేక సాధారణ సినిమాలు వీరి ఆదరణ వల్లే అనూహ్య విజయాల్ని సాధించాయి. బాక్సాఫీస్‌ల వసూళ్ళలో కూడా వీళ్ళదే అగ్ర భాగం.
ప్రేక్షకుల్లో అత్యధికులైన మధ్య తరగతిని ఇప్పుడు థియేటర్లకు రప్పించడం దేశీయంగా అన్ని చిత్ర పరిశ్రమలకు పెద్ద సవాల్‌గా మారింది.

నగర ఆధారిత కథలపై ఎక్కువగా దష్టి పెట్టి, వాటిల్లో ధనిక జీవనశైలి, విలాస వంతమైన ప్రదేశాలు, గ్రాఫిక్స్‌తో భారీ హంగులు, కొద్ది మందికే సంబంధించిన సమస్యలతో ఉన్న సినిమాలు తీసి బాలీవుడ్‌ మధ్య తరగతి ప్రేక్షకులను దూరం చేసుకుని ఇప్పటికే పెద్ద తప్పు చేసింది.
ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో సామాన్యుల జీవితం, పోరాటాలు, భావో ద్వేగాలు నిష్పక్షపాతంగా ప్రతిబింబించేవి. ఇప్పుడు అవన్ని మాయమై పోయాయి. దీంతో ఇప్పుడొస్తున్న సినిమాలు మనకు సంబంధించినవి కావులే అనే భావన ఈ వర్గం ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ విజయాలకు వెన్నెముకగా నిలిచిన మధ్య తరగతి ప్రేక్షకులు ఇప్పుడు బాలీవుడ్‌ పూర్తిగా వదిలిపెట్టిన వర్గంగా మారారు. మల్టీప్లెక్స్‌లకు అనువుగా ఉన్న, పట్టణ జీవనకథలపైన దష్టి పెట్టడం వల్లే బాలీవుడ్‌ తన అతి పెద్ద మధ్యతరగతి ప్రేక్షకుల బేస్‌ను కోల్పోయింది.

దీనిపై తరణ్‌ ఆదర్శ్‌ మరింతగా విశ్లేషిస్తూ, ‘మన మట్టిలో పుట్టిన కథలే, మన కథలే తెరపై ఆవిష్కరింపబడాలి. సహజమైన, సూటిగా చెప్పే సినిమాలు తీయడం ఎంతో అవసరం. సినిమా చూసే జనాల్లో మధ్య తరగతి ప్రేక్షకులే పెద్ద భాగం. దురదష్టవశాత్తూ మనం వారిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలమవుతున్నాయి. మనం ఆశించినంత వసూలు చేయట్లేదు. ఈ వర్గం ప్రేక్షకులు కేవలం పెద్ద హీరోలు, గ్లామర్‌ మాత్రమే కోరుకోవడం లేదు. తమకు వ్యక్తిగతంగా అనిపించే, తమ జీవితంతో అనుసంధానం కలిగిన కథల్ని కోరుతున్నారు. బలమైన పాత్రలు, అర్థవంతమైన భావోద్వేగాలు ఉండాలనుకుంటున్నారు. మధ్య తరగతి కోసం సినిమా తీయడం అనేది కేవలం బాక్సాఫీస్‌ విజయానికే కాక, భారతదేశం నలుమూలల నుంచి సాధారణ ప్రజల కథల్ని చెప్పడం కూడా’ అని తెలిపారు. ఇప్పుడీ సమస్య కేవలం బాలీవుడ్‌ది మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఏ భాషలోనైనా సినిమా బాగుంది అనే టాక్‌ వస్తే తప్ప ఏ వర్గం ప్రేక్షకులైనా సరే థియేటర్ల వైపు అడుగు వేయటం లేదు.

ఇదొక ప్రధాన కారణమైతే, టికెట్‌ రేట్ల పెంపుదల అనేది కూడా ప్రేక్షకుల్ని ముఖ్యంగా మధ్య తరగతిని థియేటర్లకు రప్పించడంతో ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే థియేటర్లలో అధిక ధరలతో ఉండే తిను బండారాలు కూడా వీరి రాకను నిలవరిస్తున్నాయి.
అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, సోనీ లీవ్‌ వంటి వాటితోపాటు ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాలను ఇంట్లోనే ఎప్పుడైనా, ఎలాగైనా చూసేలా సులభతరం చేశాయి. ఒక క్లిక్‌తో ఎన్నో సినిమాల ఎంపికలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు మేకర్స్‌కి మంచి సినిమా తీయడమే కాదు, ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూసేలా చేయటం కూడా సవాల్‌గా మారింది.

ఓటీటీల వేదికల నుంచి కాకుండా.. థియేటర్‌ నుంచే డబ్బు రాబట్టుకోవాలనే ఆలోచనతో నిర్మాతలు సినిమాలు తీసినప్పుడే పరిశ్రమ, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌ వ్యవస్థలు బాగుంటాయి. ఈ మధ్య థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయేసరికి భయపడిపోయి.. వస్తున్న ఆ కొద్దిమందిపై మరింత భారం మోపేలా టికెట్‌ ధరల్ని పెంచుతున్నారు. దాంతో చాలా మంది ఓటీటీల వేదికలపైపు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుడు థియేటర్‌లో సినిమాని ఆస్వాదించే సంస్కృతిని పునరుద్దరించే ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి అని చెప్పిన ఆ యువ నిర్మాత మాటలు ప్రస్తుతం ఉన్న టాలీవుడ్‌ పరిస్థితికి అద్దం పట్టింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులను ఉద్దేశించి నిర్మాత బన్నీవాస్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
అగ్ర హీరోలు రెండు, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరమై పోతారు. ఈ సమయంలో చాలా మంది యజమానులు తమ థియేటర్లను నడపలేక మూసేస్తారు. సింగిల్‌ స్క్రీన్స్‌ మూత పడితే.. కేవలం మల్టీప్లెక్స్‌ల వల్ల మీ సినిమాలకు థియేటర్స్‌ నుంచి వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. దీని వల్ల నిర్మాతలకూ భారీ నష్టం వస్తుంది. ఈ విషయాన్ని అగ్ర హీరోలూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని బన్నీవాస్‌ సూచించారు.

ఇక దీనికి తోడు పైరసీ అనుక్షణం వెంటాడుతూనే ఉంది. గత రెండు సంవత్సరాలుగా పైరసీ మళ్ళీ విజృంభిస్తోంది. దీన్ని ఆరికట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది అని దిల్‌రాజు అన్నారు.
కథలపరంగా, ఓటీటీల పరంగా, టికెట్‌ ధరల పెంపు పరంగా, పైరసీ పరంగా.. ఇలా పలు కారణాలతో ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని స్పష్టమైంది.
మధ్య తరగతి ప్రేక్షకులను మళ్లీ తిరిగి థియేటర్‌లకు ఆకర్షించాలంటే ఆ కథల్లో తాము అనుభవించే జీవితంతో అనుసంధానమై ఉండాలి. భావోద్వే గాలతో, విలువలతో కూడినవి కావాలి. ఈ తరహా సినిమాలు చూసినప్పుడు నా సమయం, డబ్బు వథా కాలేదనీ అనిపించాలి.
మంచి సినిమా అయితే చాలదు. సోషల్‌ మీడియా, ఓటీటీ వేదికలను విస్తృతంగా వినియోగించే మధ్యతరగతి దష్టిని ఆకర్షించాలంటే ఆ సినిమా గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే. సినిమా బాగుందనే మౌత్‌టాక్‌ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రధాన అస్త్రం.
వస్తువుల ధరల విషయంలో డిస్కౌంట్స్‌ లభించినట్లే, టికెట్ల ధరల్లోనూ డిస్కౌంట్స్‌ ఇవ్వాలి. అలా కాకుండా భారీగా పెంచటంతో సినిమాని ఖరీదైన ఖర్చుగా భావిస్తున్నారు. అనుకూలమైన టికెట్‌ ధరే ఫ్యామిలీతో సహా అందర్నీ థియేటర్లకి రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రిలీజైన ప్రతి సినిమా 2 నెలల తరువాతే ఓటీటీలో ప్రదర్శితమయ్యేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల తీరుబడిగా ఓటీటీలో చూద్దాంలే అనే ధోరణి నుంచి థియేటర్లకు వెళ్ళి చూద్దాం అనే తీరుకు నెమ్మదిగా ప్రేక్షకులు మారే అవకాశం ఉంటుంది. అలాగే పైరసీపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరమూ ఎంతో ఉంది.

– రెడ్డి హనుమంతరావు

‘ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చి సినిమాని చూసే సంస్కృతిని చంపేస్తున్నాం. ఈ వాస్తవాన్ని నిర్మాతలు ఎంత త్వరగా గ్రహిస్తే పరిశ్రమకి అంత మేలు’ అని టాలీవుడ్‌కి చెందిన యువ నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మనమిప్పుడు మధ్య తరగతి ప్రేక్షకులను పూర్తిగా పక్కకు నెట్టేశామని పిస్తుంది. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్‌లకు అనువైన, పట్టణ కేంద్రిత చిత్రాలు మాత్రమే బాలీవుడ్‌ మేకర్స్‌ తీస్తున్నారు. వీటి లక్ష్య ప్రేక్షకులు చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. అందుకే పెద్ద సంఖ్యలో మధ్య తరగతి ప్రేక్షకులు లేదా పై తరగతికి చెందని వారు, తమకు సినిమాల్లో చోటు లేదన్న భావనకు లోనవుతున్నారు. ఒకప్పుడు అన్ని వర్గాలకూ నప్పే సంపూర్ణ వినోదాత్మక చిత్రాలు చేసేవాళ్ళు. ఎక్కడో ఒక దశలో అలాంటి సినిమాల్ని తీయటం బాలీవుడ్‌ మరిచిపోయింది’ అని ప్రముఖ బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అన్నారు.

‘కోవిడ్‌ టైమ్‌లో దొరికిన గ్యాప్‌లో అందరూ కొత్త కథలు రాసుకున్నారు. అప్పుడు ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లు, ఒరిజినల్‌ మూవీస్‌ తీద్దాం అనే కొత్త ఆలోచనలు వచ్చాయి. అయితే ఓటీటీల కారణంగా మొత్తం మార్కెట్‌ మారిపోయింది. దాని ఎఫెక్ట్‌ వల్ల ఇప్పుడు థియేటర్లకు ఆదరణ తగ్గింది. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో థియేటర్స్‌ నుంచి రావాల్సిన రెవిన్యూ కొలాప్స్‌ అయిపోయింది. థియేటర్లలో సినిమాలు ఆడకపోతే భవిష్యత్‌లో నిర్మాతలు ఓటీటీలకు బ్రోకర్లుగా మారిపోతారు’ అని టీఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓటీటీల వల్ల థియేటర్లకు జరుగుతున్న నష్టాన్ని గురించి తెలిపారు.

‘ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గ్రహించాల్సింది, కరెక్ట్‌ చేసుకోవాల్సింది పర్సంటేజీ విధానం కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అన్న విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్‌ కొనసాగితే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో 90% సింగిల్‌ స్క్రీన్స్‌ మూతపడే ప్రమాదం ఉంది’ అని నిర్మాత బన్నీవాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -