Sunday, July 20, 2025
E-PAPER
HomeNewsఈసీ చర్యలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 8న నిరసనలు

ఈసీ చర్యలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 8న నిరసనలు

- Advertisement -

బెంగాలీ మాట్లాడేవారిపై వేధింపులు ఆపాలి
దేశ, ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే వాణిజ్య ఒప్పందాలు వద్దు : సీపీఐ(ఎం) పిలుపు
న్యూఢిల్లీ :
బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిరసిస్తూ ఆగస్టు 8న నిరసనలు చేపట్టాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ ప్రక్రియను వ్యతిరేకించాలని తెలిపింది. బెంగాలీ మాట్లాడేవారిపై జరుగుతున్న వేధింపులు, హింసను తక్షణమే ఆపాలని కోరింది. అలాగే కీలకమైన అణు శక్తి రంగంలో విదేశీ సంస్థల ప్రవేశానికి వెసులుబాటు కల్పించేలా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు వ్యతిరేకంగా పార్టీలను సమీకరించేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) పొలిట్‌బ్యూరో ఈ నెల 18న న్యూఢిల్లీలో సమావేశమై ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పలు కీలక పరిణామాలపై కూలంకషంగా చర్చించింది. అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
బీహార్‌లో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా సమగ్రంగా సవరించాలని (ఎస్‌ఐఆర్‌) ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఈసీ భావిస్తోంది. ఓటర్ల జాబితాలను సవరించే పేరుతో ఈసీ, ఓటర్ల పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారాన్ని స్వాధీనం చేసుకుంటోంది. ఇది, దాని రాజ్యాంగ పరిధికి వెలుపల వున్న అంశం. ఓటర్ల జాబితా నుంచి విదేశీయులను తొలగించాలనే నిరాధారమైన సాకుతో వారు, మైనారిటీలు, ఇతర ఎంపిక చేసిన గ్రూపులకు చెందిన వారికి ఓటు హక్కు లేకుండా చేయడానికి చూస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో వివిధ రకాలైన ఉల్లంఘనలు వున్నాయి. రాజ్యాంగం అందరికీ హామీ కల్పించిన ఓటు వేసే హక్కు చాలామందికి నిరాకరించబడవచ్చు. కోవిడ్‌ మహమ్మారికి ముందు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్‌ఆర్‌సీ ప్రక్రియనే దొడ్డిదారిన రహస్యంగా అమలు చేయతల పెట్టారు. ఇప్పటివరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఎన్నికల కమిషన్‌, ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌/సంఘ పరివార్‌ ఎజెండాను అమలు పరచడంలో భాగస్వామిగా మారింది.

దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న ఈ దాడిని ఎంతమాత్రమూ అను మతించరాదు. బీజేపీ కూటమి భాగస్వాముల్లో తెలుగుదేశం పార్టీ వంటి కొన్ని పార్టీలు ఎస్‌ఐఆర్‌ గురించి తమ ఆందోళనలను ఇప్పటికే వెలిబుచ్చాయి. ఎన్నికల కమిషన్‌ చేపడుతున్న ఈ ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రక్రియకు వ్యతిరేకంగా ఆగస్టు 8న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా సీపీఐ(ఎం) పిలుపిచ్చింది.

ప్రజా భద్రతపై మహరాష్ట్ర బిల్లును రద్దు చేయాలి
బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన మహారాష్ట్ర ప్రజా భద్రతా బిల్లు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై ప్రధానంగా దాడి చేస్తోంది. అతివాద వామపక్ష శక్తులతో పోరాటం పేరుతో అసమ్మతి వ్యక్తం చేసే వారందరినీ ప్రజా భద్రతకు, జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించాలని బిల్లు కోరుతోంది. ఈ బిల్లు ఉద్దేశ్యపూర్వకంగానే అతివాద వామపక్ష శక్తులు, అలాగే అటువంటి సంస్థల నిర్వచనాన్ని అస్పష్టంగా వదిలివేసింది. తద్వారా ఏ ప్రతిపక్షాన్నైనా లక్ష్యం చేసుకోవడానికి తగిన అవకాశాలు, పరిధిని సృష్టించుకుంది. అసమ్మతిని అణచివేయడానికి, రాజకీయ వ్యతిరేకత నోరు నొక్కడానికి గానూ ఈ బిల్లులోని కఠినమైన నిబంధనలను ఉపయోగించు కునేందుకు అన్ని రకాలుగా ముప్పు పొంచి వుంది. ఈ నిరంకుశ బిల్లును నిరసిస్తూ, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేయాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య శక్తులకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భద్రతా వైఫల్యమేనని జమ్మూ కాశ్మీర్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్‌ను ప్రత్యక్షంగా కేంద్రం పాలిస్తోంది. భద్రత, శాంతి భద్రతలకు సంబంధించిన చర్చలు, నిర్ణయాల్లో కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని పాల్గొననివ్వకుండా నిషేధించారు. భద్రతా వైఫల్యం జరిగిందని అంగీకరించడమంటే భద్రతకు నేరుగా బాధ్యత వహించే కేంద్ర హోం మంత్రి వైఫల్యమేనని అంగీకరించడమే కాగలదు. అటువంటి తీవ్రమైన లోపానికి ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలి. సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలి.ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దెబ్బతీస్తున్నారు. ఫ్యూడల్‌ మహారాజాకి వ్యతిరేకంగా పోరాడి, ఆయన పాలన నుంచి జమ్మూ కాశ్మీర్‌ను విముక్తి కల్పించడానికి కృషిచేసి అమరులైన 22మంది వీరుల త్యాగఫలానికి గుర్తుగా జరుపుకుంటున్న అమరవీరుల దినోత్సం నాటి సెలవును కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్న గవర్నర్‌ రద్దు చేశారు. అందుకు బదులుగా, రైతులను హతమార్చిని, విముక్తి పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నించిన మహారాజా జయంతిని శలవు దినంగా ప్రకటించారు. ముఖ్యమంత్రితో సహా వివిధ రాజకీయ పార్టీల నేతలను అమరవీరులకు నివాళులు అర్పించడానికి అనుమతించలేదు. ప్రజాస్వామ్య హక్కులపై, ఫెడరల్‌ వ్యవస్థపై తీవ్రమైన దాడే ఇది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజా తీర్పును గౌరవించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది.

బెంగాలీల తరలింపును ఆపాలి
బెంగాలీ మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు పలు రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, ఒడిశా, ఆసోం, హర్యానా, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను గుర్తిస్తూ, వారిని బంగ్లాదేశీయులుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా ఎలాంటి సక్రమ ప్రక్రియను అనుసరించకుండానే, వారి పత్రాలను సక్రమంగా పరిశీలించకుండానే జరుగుతోంది. బెంగాలీ మాట్లాడే వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. కొంతమందినైతే (భారత పౌరులతో సహా) బలవంతంగా భూ, సముద్ర మార్గాల ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించేసిన సంఘటనలు కూడా వున్నాయి. బెంగాలీలపై దాడులను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే, భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రసాదించిన స్వేచ్ఛా కదలికల హక్కుకు వ్యతిరేకంగా ఈ దాడులు వున్నాయి. ప్రభుత్వం ఈ అక్రమ నిర్బంధాలను తక్షణమే విరమించి, ప్రజల హక్కులను పరిరక్షించాలని పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

కేరళ గవర్నర్‌ చర్యలు
ఆర్‌ఎస్‌ఎస్‌, దాని హిందూత్వ సిద్ధాంత భావజాలాన్ని పెంచి పోషించేందుకు కేరళ గవర్నర్‌ తన రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. రాజ్‌భవన్‌ నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఉద్దేశ్యపూర్వకంగా అఖండ భారత్‌ మ్యాప్‌ను, భరతమాత చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిహ్నాలను రాజ్యాంగం గుర్తించలేదు. ఎన్నికైన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ సలహాను ఆయన బహిరంగంగానే ధిక్కరిస్తు న్నారు. రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా అధికారిక కార్యక్రమాలను నిర్వహించడానికి తిరస్కరిస్తున్నారు. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పరిరక్షించే లౌకికవాద విలువలను దెబ్బతీసేందుకు తన చర్యల ద్వారా, ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని అనుబంధ సంఘాలను క్రియాశీలంగా ప్రోత్సహిస్తున్నారు. గవర్నర్‌ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేరళలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా విద్యార్ధులు వివిధ ప్రదర్శనలను, నిరసనలను చేపట్టడాన్ని సీపీఐ(ఎం) అభినందించింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తాము వేసిన పిటిషన్లను ఉపసంహరించు కోవడానికి కేరళ ప్రభుత్వాన్ని అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. సుప్రీం కోర్టు రూలింగ్‌ కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, అన్ని రాష్ట్రాలకూ వర్తించనున్నందున కేరళ వేసిన పిటిషన్లు ఇప్పుడు నిష్ఫలంగా మారాయి. ఈ వ్యాజ్యాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తూ, యూనివర్శిటీలకు రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్లు లేకుండా చేయాలన్నది గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యంగా వుంది. సక్రమ ప్రక్రియను చేపట్టడం ద్వారా వైస్‌ ఛాన్సలర్లను నియమించాల్సి వుంది. రెగ్యులర్‌ విసిలను నియమించడంలో విఫలమైనందుకు గవర్నర్‌ను కేరళ హైకోర్టు కూడా విమర్శించింది. కేరళ ఉన్నత విద్యా వ్యవస్థను అపఖ్యాతి పాల్జేసి, నాశనం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రయత్నం జరుగుతోంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం సజావుగా పనిచేయకుండా అడ్డుకునేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలను సహించేది లేదు. కేరళ ప్రజల ప్రయోజనాల కోసం సీపీఐ(ఎం), దాని మిత్రపక్షాలు నిరంతరాయంగా కృషి చేస్తాయి. బీజేపీ కుట్రలను బహిర్గతం చేస్తాయి.

సీసీ సమావేశం
కేంద్ర కమిటీ తదుపరి సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబరు 13-15 తేదీల్లో జరగనుంది. ఇతర ఎజెండాతో పాటూ బీహార్‌లో ఇతర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మికవర్గానికి అభినందనలు
పది కేంద్ర కార్మిక సంఘాలు, అఖిల భారత స్థాయిలో వివిధ సమాఖ్యలు పిలుపిచ్చిన సార్వత్రిక సమ్మె బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. రైతులు, వ్యవసాయ కార్మికులు వారి వారి సంఘాల నేతృత్వంలో ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మికులను, ఇతర శ్రామిక వర్గాలను సీపీఐ(ఎం) అభినందిస్తోంది. రాబోయే పోరాటా లన్నింటిలో వారికి సంఘీ భావంగా వుంటామని పునరుద్ఘాటించింది.

అసోంలో బహిష్కరణలు
అసోం ప్రభుత్వం పెద్దసంఖ్యలో ప్రజలను వారి హక్కుదారైన భూముల నుంచి బహిష్కరిస్తోంది. ముఖ్యమంత్రి ఈ బహిష్కణల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. పైగా సమాజంలో మతపరమైన చీలికలు తీసుకురావడానికి గానూ వీటిని ఉపయోగించు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ భూముల కింద అత్యంత ఖరీదైన ఖనిజ వనరులు వున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వనరులను దోచుకోవడానికి ప్రయివేటు కార్పొరేషన్లను అనుమతించేందుకు చాలా ఆతృతంగా వున్నారు. బలవంతంగా ప్రజలను తరలించడానికి ఇది మరొక కారణంగా వుంది. ఈశాన్య రాష్ట్రాల మధ్య గల జాతి పరమైన విభేదాలను పెచ్చరిల్లేలా చేసి, వారిలో అభిప్రాయ భేదాలు సృష్టించి, తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎత్తుగడలు, చర్యలు మన దేశ ఐక్యతకు, సమగ్రతకు హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సుదీర్ఘమైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతంలో ప్రమాదాన్ని తెస్తాయి.

వాణిజ్య ఒప్పందాలు
అమెరికా వంటి దేశాలతో, అలాగే యురోపియన్‌ యూనియన్‌తో ప్రభుత్వం వివిధ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయాలని భావిస్తున్నట్టు వార్తలు రావడంపై పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేయడానికి ముందుగా వివిధ పక్షాలను ప్రభుత్వం సంప్రదించాలి. ప్రభుత్వం ఇప్పటికే అమెరికా ఒత్తిడికి లొంగిపోయి మన ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలను యథేచ్ఛగా వారు దోపిడీ చేసుకునేందుకు వీలుగా తలుపులు బార్లా తెరుస్తోంది. వారితో వాణిజ్య ఒప్పందం కుదుర్చు కోవడానికి ప్రభుత్వ తొందరపాటు డెయిరీ, వ్యవసాయం, రక్షణ, ఫార్మాస్యూటికల్‌, ఫైనాన్స్‌ వంటి కీలకమైన రంగాల్లో మన దేశ ప్రయోజనాలను వదులుకునేందుకు దారి తీస్తోంది. మన సార్వభౌమాధికారంపై రాజీ పడుతున్న, మన దేశ ప్రయోజనాలను త్యాగం చేస్తున్న అన్ని వాణిజ్య ఒప్పందాలను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రానున్న కీలకమైన బిల్లులు
గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుతో పాటూ అణు ఇంధన చట్టాన్ని, అణు నష్టానికి పౌర బాధ్యత చట్టాన్ని సవరించే బిల్లులను పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. దేశంలోని కీలకమైన ఖనిజ వనరులును ప్రయివేటు, విదేశీ సంస్థలు దోపిడీ చేసేందుకు అనుమతించడానికి గనులు, ఖనిజాల చట్టం సవరణ ఉద్దేశించబడింది. అలాగే కీలకమైన అణు శక్తి రంగంలోకి అమెరికా, ఇతర విదేశీ కార్పొరేషన్లు ప్రవేశించడానికి గల అడ్డంకులు, అవరోధాలన్నింటినీ తొలగించేందుకు అణు ఇంధన చట్టం, అణు నష్టాలకు పౌర బాధ్యత చట్టాల సవరణలు నిర్దేశించబడ్డాయి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పార్లమెంట్‌లోని ఇతర ప్రతిపక్ష పార్టీలను సమీకరించడానికి సీపీఐ(ఎం) ప్రయత్నిస్తుంది. మనదేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన, ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పార్టీ ప్రజల్లో ప్రచారం చేస్తుంది, వారిని సమీకరిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -