నవతెలంగాణ-హైదరాబాద్: గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో పులస సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది గోదావరికి వరద నీటి తాకిడి పెరగడంతో పులస చేపల సీజన్ మొదలైంది. నదికి ఎర్ర నీరు ఉదృతంగా రావడంతో పులసలు ఎదురీదుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే యానాంలో మత్స్యకారుల పంట పండుతోంది. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం పులస ప్రత్యేకత. అంతేకాదు.. ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే పులస కోసం వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి ఉన్న విషయం తెలిసిందే.
గోదావరి నదికి వరదలు వస్తుండడంతో యానాంలో పులసల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం వేలంలో పులస చేపలు భారీ ధర పలుకుతున్నాయి. ఈరోజు కిలో పులస చేప వేలంలో 22 వేల భారీ ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఈ చేపను ఓ మత్స్యకార మహిళ కొనుగోలు చేశారు. ఆ పులసను ఆమె మరింత లాభంకు అమ్ముకొననున్నారు. ఈ సీజన్‌లో పులస చేపల కోసం చాలా మంది ఆసక్తి కనబర్చడం కారణంగానే భారీ ధర పలుకుతున్నాయట.
ఈ సీజన్‌లో తొలి పులస చేప యానాం ఫిష్ మార్కెట్‌లో రూ.4000 ధర పలికింది. పులస ప్రియలు వేలంలో పోటీ పడడంతో మరో చేప రూ.15000 పలికింది. గత వారంలో దొరికిన రెండు పులస చేపలు రూ.13 వేలు, రూ.18 వేలుగా అమ్ముడయ్యాయి. తాజాగా ఏకంగా రూ.22 వేల ధర పలికింది. యానాంలో పులసల సందడి మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రికార్డు ధర పలుకుతుందేమో చూడాలి.