నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశానికి జాతీయ భాష అవసరం లేదని, హిందీని తమపై రుద్దకూడదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన హిందీ భాషా అంశంపై ఆయన మాట్లాడారు. జైపూర్‌లో జరిగిన టాక్ జర్నలిజం 2025లో భాగంగా జరిగిన చర్చలో భాష విషయంలో గట్టి వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో కేటీఆర్, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి జాతీయ భాష గురించి అడగగా… హిందీ జాతీయ భాష కాదని, భారతదేశంలో అనేక అధికారిక భాషలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
“ఏ భాష అయినా భావవ్యక్తీకరణకు ఓ సాధనం మాత్రమే. అది ఒక సాంస్కృతిక చిహ్నం. భారత్ లో 20 అధికారిక భాషలు, 300 అనధికార భాషలు ఉన్నాయి. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదు. తెలుగు భాషను జాతీయ భాషగా చేయాలని ప్రతిపాదిస్తే మిగతా ప్రాంతాల వారు ఒప్పుకుంటారా? 70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు?” అని ప్రశ్నించారు.
హిందీ భాషకు బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించి, తెలుగు, బెంగాలీ భాషలకు ఎందుకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ప్రజలపై తెలుగును రుద్దనప్పుడు హిందీని తమపై ఎందుకు రుద్దుతున్నారని ఆయన నిలదీశారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకే వదిలేయాలని, దానిని వారిపై బలవంతంగా రుద్దకూడదని ఆయన అన్నారు.