Tuesday, July 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగడ్డి బతికింది.. పంట సచ్చింది..

గడ్డి బతికింది.. పంట సచ్చింది..

- Advertisement -

– నకిలీ మందులతో.. పూర్తిగా ఎండిపోయిన పంట
– కలుపు మందుతో నష్టం, ఆందోళనలో రైతులు
– నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండలం వట్టెంలో పరిస్థితి
– పొలాలు పరిశీలిస్తామంటున్న అధికారులు
నవతెలంగాణ మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనట్టుగా అయ్యింది రైతుల పరిస్థితి. మొక్కజొన్న చేలో కలుపు నివారణ కోసం మందు పిచికారి చేస్తే గడ్డి బతికింది.. పంట చచ్చిపోయింది. పెట్టుబడి అధికమవడం, కూలీల కొరతతో రైతులు కలుపు నివారణ కోసం దుకాణదారుడిని నమ్మి పిచికారీ చేసిన గడ్డి మందు పంటను తినేసింది. దుకాణ దారునికి ఫర్టిలైజర్స్‌ మీద కనీస అవగాహన లేకపోవడం, వ్యవసాయాధికారులు సూచనలలేమితో ఇటువంటి సమస్య ఏర్పడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇదేంటని మందుల కంపెనీ యాజమాన్యాన్ని నిలదీ స్తే మా మందు వల్ల కాదంటూ బుకాయిస్తున్నారు.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన మామిళ్ళ శ్రీనివాసులు.. తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. దుక్కి దున్నడం మొదలుకొని విత్తనాలు, ఎరువులు, కూలీ అని ఇప్పటిదాకా ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చయింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట మధ్యలో కలుపు పెరిగింది. కలుపు తీయడానికి కూలీల కొరత, అధికవ్యయం కారణంగా నివారణా మందును ఫర్టిలైజర్‌ షాపులో కొనుగోలు చేసి పిచికారి చేశారు. నాలుగు రోజుల తర్వాత పొలానికి వెళ్లి చూస్తే పంట మొత్తం ఎండిపోయింది. ఇదే గ్రామంలో మరో రైతు.. చాకలి భీమయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో మక్క పంట సాగు చేశారు. ఇతనూ అదే మందును పిచికారి చేశారు. ఇప్పుడు పంట పొలంలో చూస్తే ఒక్క మొక్కజొన్న మొక్క కూడా కనబడటం లేదు. నోవా అగ్రి సైన్సెస్‌ వారి అస్టిస్టిక్స్‌ మందుతో పాటు నోవా ట్రీబో వారి ఎత్రినో హెర్బిసైడ్‌ మందును దుకాణదారుల సూచనల మేరకు పిచికారి చేసిన పంట చేలు ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితి ఈ ఇద్దరి రైతులదే కాదు, వట్టెం గ్రామంలోని జయశ్రీ ఫర్టిలైజర్‌ దుకాణంలో కలుపు నివారణా మందును కొనుగోలు చేసి పిచికారీ చేసిన ప్రతి ఒక్కరిదీ.

డబ్బు, పంట రెండూ పాయే..
కలుపు నివారణకు ఎకరాకు నాలుగు ప్యాకెట్ల చొప్పున నోవా అగ్రి సైన్సెస్‌ అస్టిస్టిక్స్‌ మందు లో హర్బిసైడ్స్‌ వారి నోవా ట్రీ బో మందును కలిపి మొక్కజొన్న పంటలో రైతులు పిచికారి చేశారు. పిచికారి చేసిన నాలుగు రోజుల తర్వాత పొలంలో గడ్డి తప్ప పంట మిగల్లేదు. ఒక ప్యాకెట్‌ మందు ధర రూ 2100 కాగా, ఎకరాకు నాలుగు ప్యాకెట్ల చొప్పున మొత్తం సుమారు రూ.8400 ఖర్చు చేసినట్టు రైతులు తెలిపారు. ఇంత ఖర్చు చేసి పిచికారి చేస్తే గడ్డి ఏపుగా పెరిగింది. మక్క మాత్రం ఎండిపోయింది. గతేడాదిలాగే ఈ ఏడాది పంట వేశామనీ కానీ, ఎప్పుడు ఇలా జరగలేదని రైతులు వాపోతున్నారు. కండ్ల ముందే పంట మొత్తం ఎండిపోవడం, కుళ్లిపోవడంతో అప్పు చేసి మరీ ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిందని వాపోతున్నారు. ఇది ఒక ఎత్తయితే.. మళ్లీ పంట వేయాలంటే చేను చదును చేయడం నుంచి మళ్లీ మొదలు పెట్టాలని అందుకు డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమ వుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమా న్యాలు, అధికారులు స్పందించి తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నారు.

కంపెనీ యాజమాన్యం వితండవాదం
మక్క పంట ఎండిన విషయాన్ని రైతులు మందుల కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారొచ్చి పంటను పరిశీలించారు. తామిచ్చిన మందులు ఎక్కడా ఇటువంటి నష్టాన్ని కలిగించలేదని, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందో చూస్తామని చెప్పారు. మూడెకరాలు నష్టపోతే రైతుకు రూ. 40వేలు ఇస్తామంటున్నారు. పంట చేతికొస్తే ఎకరాకు సుమారు రూ.80వేలు దిగుబడి వస్తుందని, నాలుగు ఎకరాల్లో పంట ఎండిపోతే రూ.50 వేలిస్తే ఏ మూలకు సరిపోతాయని రైతులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు.

కలుపు మందులతో ప్రమాదం
పెరుగుతున్న పెట్టుబడుల వల్ల రైతులు తక్కువ ఖర్చుతో సాగయ్యే వనరులపై దృష్టి సారిస్తున్నారు. రైతుల బలహీనతలను దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రమాదకరమైన రసాయనిక మందులని షాపు యజమానులు సూచిస్తున్నారు. మొక్కజొన్నలో కలుపు నివారణ కోసం చేపడుతున్న చర్యలు సైతం ప్రమాదకరంగానే మారుతున్నాయి. సాధ్యమైనంతవరకు ఇలాంటి మందులు వాడకుండా సాగు చేయడానికి రైతులు ప్రయత్నించాలని రైతు సంఘాల నాయకులు, శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

మూడో స్థానంలో మొక్కజొన్న సాగు
ఉమ్మడి జిల్లాలో పతి,్త వరి తర్వాత మూడో స్థానంలో మొక్కజొన్న పంట సాగవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు ఐదు లక్షల ఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేసి రెండో పంటగా రబీలో వేరుశెనగ వేయాలన్న ఆలోచనతో రైతులు తక్కువ సమయంలో దిగుబడి వచ్చే మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇంత పెద్ద స్థాయిలో సాగు చేస్తున్నా పంట సాగు సమయంలో తీసుకోవాల్సిన మెళకువల గురించి అధికారులు రైతులకు ఏమాత్రం అవగాహన కల్పించడం లేదు.

అనుమతులు ఒకరికి.. నడిపేది ఇంకొకరు..
ఫర్టిలైజర్‌ దుకాణం నడపాలంటే పంటలను, కాలాలను, సమస్యలను బట్టి, ఆ ప్రాంత నేలను బట్టి ఎరువులు, మందుల వాడకం ఉంటుంది. ఒకరి పేరు మీద అనుమతులు పొంది మరొకరు దుకాణాలు నడుపుతున్నారు. ఇలాంటి వారికి ఏ తెగులుకు ఏ మందు వాడాలో అవగాహన ఉండటం లేదు. ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు, పిచికారి మందులపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా పంటను బట్టి, చీడ స్థాయిని బట్టి, ఏయే మందులు ఎంత మోతాదులో వాడాలో తెలియజేయడం లేదు. ఫలితంగా ఫర్టిలైజర్స్‌ దుకాణదారులు చెప్పిన మందులు కొని, వారు చెప్పిన ప్రకారమే వాడటం వల్ల పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం
వట్టెం గ్రామంలో పంట నష్టం గురించి విచారణ చేస్తాం. ఏ కంపెనీ మందు వాడారు? ఏ మోతాదులో వాడారు? నష్టం ఎలా జరిగిందో సమాచారం తీసుకుంటాం. రైతులకు ఎటువంటి నష్టం రాకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రైతులు గడ్డి నివారణా చర్యలు తీసుకునే సమయంలో ఏ కంపెనీ మందు వాడుతున్నారో వ్యవసాయ అధికారులతో సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– డీఏవో నాగర్‌ కర్నూల్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -