– సాంకేతిక సమస్యలతో లబ్దిదారులు సతమతం
– పేర్లు, అకౌంట్ నంబర్లు తప్పుగా నమోదు
– అర్థాంతరంగా ఆగుతున్న నిర్మాణాలు
– మంత్రుల పబ్లిసిటీ ఫొటోల ఇండ్లదీ ఇదే పరిస్థితి
– వందల సంఖ్యలో బాధితులు
‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అంటే ఇదే. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందనే సంతోషం కంటే, నిర్మాణం మొదలెట్టాక, బిల్లులు ఎప్పుడు వస్తాయో అర్థం కాక, ఇంటిని పూర్తిచేసుకోలేక లబ్దిదారులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీటికి రకరకాల సాంకేతిక సమస్యలు కారణమ వుతున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన వేలాది దరఖాస్తులను ప్రయివేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఆన్‌లైన్ చేయించే క్రమంలో దొర్లిన తప్పులు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థలలేమి కారణంగా పాత ఇంటిని కూలగొట్టి ఆ ప్లేస్‌లో నిర్మాణం మొదలుపెట్టారు. నెలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ చెల్లిస్తూ కిరాయి ఇండ్లలో ఉంటూ ఇంటి నిర్మాణం చేపట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఇల్లు మంజూరైందని, బయట అప్పుతెచ్చి నిర్మాణాలు చేపట్టినవారూ ఉన్నారు. నానా కష్టాలు పడి బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా ఒక్కో నియోజకవర్గంలో సాంకేతిక సమస్యలతో వందలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు.
మొదటి విడతలో…
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుతూ లబ్దిదారులు కాంగ్రెస్ నేతల చుట్టూ తిరిగారు. కొన్నిచోట్ల ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను మేనేజ్ చేసేందుకు రూ.5వేలు అడ్వాన్స్‌గా చెల్లించడంతో పాటు మొదటి బిల్లులో రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందాలూ చేసుకున్నారు. చివరకు ఇల్లు మంజూరవటంతో నిబంధనల మేరకు ముగ్గులు పోసి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. పునాది (బేస్‌మెంట్) నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయలు లబ్దిదారుని ఖాతాలో జమ చేస్తారు. గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.1.25 లక్షలు ఖాతాలో వేస్తారు. స్లాబ్ నిర్మాణ సమయంలో రూ.1.75 లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష ఖాతాలో జమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో బేస్‌మెంట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ దశలో మొదటి విడత బిల్లులు మంజూరు చేయాలి.
మంత్రుల పబ్లిసిటీ ఫోటోల ఇండ్లదీ ఇదే పరిస్థితి
ఇల్లెందు నియోజకవర్గానికి బేస్‌మెంట్ లెవల్ లబ్దిదారుల కోసం రూ.240 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ఇందిరా మహిళా శక్తి సభ సందర్భంగా చెప్పారు. లబ్దిదారులు రూ.లక్ష విడుదల అవుతాయని ఆతృతగా చూశారు. తీరా యాప్‌లో అప్‌లోడ్ చేస్తే కొందరివి సక్సెస్‌ఫుల్ కావటం లేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించగా తొలివిడత నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల్లో 681 మందికి, మున్సిపాలిటీలో 400 మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే శంకుస్థాపన, పూజా కార్యక్రమాల అనంతరం వార్డు ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు ముగ్గులు పోసిన ఇండ్ల నిర్మాణ స్థలాలను ఫొటోలు తీశారు. వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఆ ఇండ్లన్నీ బేస్‌మెంట్ లెవల్ పూర్తి చేసుకొని మొదటి విడత బిల్లు దశకు చేరాయి. వీటిలో కొన్ని నిర్మాణాల ఫొటోలు అప్‌లోడ్ కావట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నియోజకవర్గంలో పంచాయతీకి ఏడేనిమిది మందివి, మున్సిపాల్టీలో వార్డుకు ఐదారుగురి ఫొటోలు అప్‌లోడ్ కావట్లేదు. అప్‌లోడ్ అయితేనే 15 రోజుల తర్వాత తొలి విడత బిల్లు రూ.లక్ష వస్తుంది. అప్‌లోడ్ కాకపోతే పరిస్థితి ఏంటో తెలియని అయోమయ స్థితిలో లబ్దిదారులు వాపోతున్నారు. ఇల్లెందు మున్సిపాల్టీలోని 17వ వార్డుకు చెందిన సంగెం వేణుగోపాల్ ఇంటిపేరు ఇంగ్లీష్‌లో సంగెం బదులు సంఘం అని పడింది. ఎంత ప్రయత్నించినా ఫొటో అప్‌లోడ్ కావట్లేదని లబ్దిదారుడు ఆవేదన చెందుతున్నాడు. ఇదే వార్డుకు చెందిన ఫరీదాబేగం అకౌంట్ నంబర్ తప్పుగా నమోదైంది. ఆమెదీ ఇదే పరిస్థితి. ఈ వార్డులో ఇంకా ఐదారుగురి పరిస్థితి ఇలానే ఉంది. తమతో పాటు మొదలు పెట్టి, చేతిలో అంతోఇంతో డబ్బున్న వారు సన్‌సైడ్ లెవల్ వరకు గోడల నిర్మాణం పూర్తి చేస్తే తమదీ బేస్‌మెంట్‌తోనే నిలిచిపోయిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
తప్పులు దొర్లిన వారి వివరాలు పంపాం : శ్రీకాంత్, కమిషనర్, ఇల్లెందు మున్సిపాలిటీ
మా లాగిన్ ద్వారా తప్పులు దొర్లిన వారి వివరాలు పంపించాం. కలెక్టర్ దగ్గర నుంచి అవి హౌసింగ్ ఎండీ కార్యాలయానికి చేరతాయి. ఎన్నిరోజుల్లో వీటిని సరిచేస్తారో మాకు తెలియదు
ఆదిలోనే అవస్థలు..
మొదటి విడత బిల్లు మంజూరు కోసం ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ‘బెనిఫిషరీ నేమ్ డజ్ నాట్ మ్యాచ్ విత్ ఆధార్. ప్లీజ్ అప్‌లోడ్ ద నేమ్ ఇన్ ద ఎంపీడీవో లాగిన్’ అని వస్తోంది. కొందరి అకౌంట్ నంబర్లు, మరికొందరి ఇంటి పేర్లు, లబ్దిదారుని పేర్లు, ఆధార్‌నంబర్లు, రేషన్‌కార్డు నంబర్లు తప్పుగా నమోదు చేయటంతో ఈ సమస్యలు వస్తున్నాయి. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను దీనిపై బాధితులు ప్రశ్నిస్తే తమ లాగిన్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఎప్పటికప్పుడూ తమ దగ్గరి నుంచి కలెక్టర్ ఆఫీస్‌కు.. అక్కడి నుంచి హౌసింగ్ ఎండీ కార్యాలయానికి చేరతాయి. తిరిగి అక్కడి నుంచి రావడానికి ఎంతకాలం పడుతుందనే విషయం తమకు తెలియదంటున్నారు. వార్డుకు ఐదారు ఇలా తప్పుగా నమోదయ్యాయి. పంచాయతీకి ఏడెనిమిది దాకా ఇలాంటి సమస్యలు ఉన్నట్టు అధికారులు చెబుతుండటం గమనార్హం.