నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటకలో ఓ ప్రయివేట్ బస్సు కాలువలో పడిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఐ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో NH-63పై అగసూరు వద్ద ఒక ప్రయివేట్ స్లీపర్ బస్సుబ్రిడ్జి మీది నుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. ఈ బస్సు గోవా నుండి హైదరాబాద్‌కు 29 మంది ప్రయాణికులతో వస్తుంది. చీకటిలో రహదారిపై ఉన్న వంపును డ్రైవర్ సరిగా అంచనా వేయకపోవడం వల్ల బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని కుమతా, కార్వార్ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. బస్సును క్రేన్ సహాయంతో కాలువ నుండి బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.