Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంకమ్యూనిస్ట్‌ ఉద్యమానికి తీరని లోటు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి తీరని లోటు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ప్రముఖ నేత, అనుభవజ్ఞుడు వి.ఎస్‌.అచ్యుతానందన్‌ (102) మృతికి పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీతో ఎనిమిదన్నర దశాబ్దాల అనుబంధం కలిగిన వి.ఎస్‌.అచ్యుతానందన్‌.. కేరళలో కమ్యూనిస్ట్‌ ఉద్యమ స్థిరత్వానికి ఎంతగానో కృషి చేశారు. ప్రజావక్తగా ప్రజలతో నేరుగా సంభాషించే కళలో ప్రావిణ్యం సంపాదించారు. కఠినమైన జీవనశైలి, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత కలగిన వ్యక్తిగా గుర్తింపుపొందిన విఎస్‌… కేరళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మృతి పార్టీకి, కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి తీరని లోటని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆయనకు నివాళిగా ఎర్రజెండాను అవనతం చేసింది. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు సానుభూతి ప్రకటించింది.

వి.ఎస్‌ అని ముద్దుగా పిలుచుకునే అచ్యుతానందన్‌ కేరళలో వివిధ పోరాటాలకు నేతృత్వం వహించడమే కాకుండా సమర్థవంతంగా నడిపించారు. కార్మికుడిగా ఆస్పిన్వాల్‌ కంపెనీలో పనిచేసిన సమయంలో కొబ్బరిపీచు కార్మికులను సంఘటిత పరిచారు. ఆ సమయంలోనే మొదటిసారి ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 17 ఏళ్ల వయస్సులో విఎస్‌ 1940లో కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. కృష్ణ పిళ్లై ఆయనను కుట్టనాడ్‌లో భూస్వాములతో భయంకరమైన దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికుల మధ్య పని అప్పగించారు. ట్రావెన్‌ కోర్‌ దివాన్‌కు వ్యతిరేకగా జరిగిన వున్నప్ర వాయిలార్‌ తిరుగుబాటు సమయంలో వి.ఎస్‌. అజ్ఞాతంలోకి వెళ్లారు. అరెస్టు తర్వాత పోలీసులు ఆయనను తీవ్రమైన హింసకు గురిచేశారు.

1956లో ఉమ్మ‌డి కమ్యూనిస్ట్‌ పార్టీ రాష్ట్ర కమిటీకి, 1958లో జాతీయ మండలికి ఎన్నికయ్యారు. భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)ను స్థాపించిన జాతీయమండలిలో మిగిలి ఉన్న 32 మంది సభ్యుల్లో ఆయన చివరి వ్యక్తి. ఆయన 1980-1991 వరకు సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1964లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1985లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. వయస్సు రీత్యా 2022లో ఆయనను కేంద్ర కమిటీ నుండి రిలీవ్‌ చేయగా, ఆ తర్వాత ప్రత్యేక ఆహ్వానితునిగా వున్నారు. కేరళ అసెంబ్లీకి ఏడు పర్యాయాలు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2006 -2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -