– దోషులంతా నిర్దోషులే
– బాంబే హైకోర్ట్ చారిత్రక తీర్పు
– ఐదుగురి మరణశిక్ష ధృవీకరణకు ‘నో’
– ఏడుగురి జీవిత ఖైదు శిక్షలు రద్దు
– ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయిన ప్రాసిక్యూషన్
– 19 ఏండ్లుగా జైలులో మగ్గుతున్న నిందితులు
ముంబయి : 2006 జులైౖ 11న ముంబయి లోకల్ రైళ్లలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో దోషులుగా జైలు జీవితం గడుపుతున్న మొత్తం 12 మందినీ బాంబే హైకోర్ట్ సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. వారిలో ఐదుగురికి మోకా ట్రయల్ కోర్టు 2015 సెప్టెంబర్ 30న విధించిన మరణశిక్షను ధృవీకరించేందుకు నిరాకరించింది. మిగిలిన ఏడుగురు నిందితులకు విధించిన జీవిత ఖైదు శిక్షను కూడా రద్దు చేసింది. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ఘటనలో ఎలాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించారో ప్రాసిక్యూషన్ చెప్పలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఘటన జరిగిన 19 సంవత్సరాల నుంచి నిందితులు జైలులో మగ్గుతూనే ఉన్నారు.
చిత్రహింసలు.. నేరాన్ని అంగీకరించాలంటూ బలవంతం
ట్రయల్ కోర్టు గతంలో వాహిద్ షేక్ అనే నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. కానీ అప్పటికే ఆయన తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తమను క్రూరంగా హింసించారని, నేరాన్ని అంగీకరించాల్సిందిగా బలవంతం చేశారని నిందితుల పక్షాల డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనను అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌తో కూడిన హైకోర్ట్ బెంచ్ అంగీకరించింది. ‘ఈ కేసులో నన్నే కాదు. మొత్తం 12 మందినీ ఇరికించారని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఈ రోజు మా నిర్దోషిత్వం నిరూపణ అయింది’ అని వాహిద్ ‘ది వైర్’ పోర్టల్‌కు భావోద్వేగంతో తెలిపారు. వివిధ కారణాల దృష్ట్యా నేరాంగీకార పత్రాలలో పూర్తి వాస్తవం కన్పించడం లేదని, వాటిలో కొన్ని భాగాలు సారూప్యంగా, కాపీ చేయబడ్దాయని న్యాయమూర్తులు తమ 667 పేజీల తీర్పులో వ్యాఖ్యానించారు.
విచారణ తీరుపై అనుమానాలు
నేరాన్ని అంగీకరించేలా తమను చిత్రహింసలకు గురిచేశారని నిరూపించడంలో నిందితులు సఫలీకృతులయ్యారని న్యాయమూర్తులు తెలిపారు. నిందితులను శారీరకంగా, మానసికంగా హింసించారన్న డిఫెన్స్ వాదనతో వారు ఏకీభవించారు. కాగా ప్రభుత్వం, దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ముంబయి హైకోర్ట్ గత ఆరు నెలలుగా విచారిస్తోంది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును గమనిస్తే కేసు విచారణలో రాష్ట్ర దర్యాప్తు సంస్థ, ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిర్వహించిన పాత్రపై అనేక తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముస్లింలే లక్ష్యంగా…
ముంబయి పేలుళ్ల కేసులో పోలీసులు, అధికారులు ముస్లింలనే లక్ష్యంగా ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత కేసులో కమల్ అన్సారీ, మహమ్మద్ ఫైజల్ అతౌర్ రెహ్మాన్ షేక్, ఎహ్తేషామ్ కుతుబుద్దీన్ సిద్ధిఖీ, నవీద్ హుస్సేన్ ఖాన్, అసిఫ్ ఖాన్‌లకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. బాంబులను అమర్చారని, ఉగ్రవాద కార్యకలాపాల కోసం శిక్షణ పొందారని, కుట్రకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు మోపారు. ఇక తన్వీర్ అహ్మద్ మహమ్మద్ ఇబ్రహీం అన్సారీ, మహమ్మద్ మజీద్ మహమ్మద్ షఫీ, షేక్ మహమ్మద్ అలీ ఆలం షేక్, మహమ్మద్ షాజిద్ మార్గబ్ అన్సారీ, ముజామిల్ రెహమాన్ షేక్, సుహైల్ మెహమూద్ షేక్, జమీర్ అహ్మద్ లతియుర్ రెహమాన్ షేక్‌లకు జీవిత ఖైదు శిక్ష పడింది. విచారణ సమయంలో వీరిలో ఏ ఒక్కరికీ బెయిల్ లభించలేదు. కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయినా బెయిల్ నిరాకరించారు. ఇప్పుడు హైకోర్ట్ వారందరినీ సాధారణ ‘వ్యక్తిగత గుర్తింపు (పీఆర్)’ బాండ్‌పై విడుదల చేసింది.
నిందితులకు మోకా కోర్టు శిక్ష విధించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు వేధింపులు తప్పలేదు. నిందితులు నిషిద్ధ లష్కరే తోయిబా సంస్థకు చెందినవారని, పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందని ఏటీఎస్ ఆరోపించింది. ఈ కేసులో క్రూరమైన మోకా చట్టాన్ని వర్తింపజేయడాన్ని డిఫెన్స్ న్యాయవాదులు ప్రశ్నించారు.
ఏం జరిగింది?
2006 జూలై 11న ముంబయిలో వివిధ లోకల్ రైళ్లలో ఏడు బాంబు పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 189 మంది మరణించగా 820 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు ప్రెషర్ కుక్కర్లలో బాంబులు అమర్చి రద్దీగా ఉండే సాయంకాలం వేళ రైళ్లలో పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం కేసును ఏటీఎస్‌కు అప్పగించింది. కాంగ్రెస్ పాలనలో ఏటీఎస్ దర్యాప్తు జరిపిన అనేక కేసులలో 2006 మాలేగావ్ పేలుడు కేసు కూడా ఒకటి. పోలీసు దళాలు మతపరమైన పక్షపాతంతో వ్యవహరించాయని, ఉగ్రవాద కేసులలో ముస్లిం యువతను అక్రమంగా ఇరికించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.