– యూనిట్లు అమ్మకం, కొనుగోలు చెల్లుబాటు కాదు : దళితబంధు లబ్దిదారులకు చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-చింతకాని
దళిత బంధు లబ్దిదారుల నిధులు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ దశలవారీగా పొందాల్సిన నిధులను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు లబ్దిదారులకు రెండో విడత 214 మంది లబ్దిదారులకు రూ.4,63,15,725 నిధులకు సంబంధించిన చెక్కులను భట్టి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. దళిత బంధు లబ్దిదారులందరికీ నిధుల పంపిణీ కొనసాగుతుందని, ఎన్నికల తర్వాత తాను ప్రకటించినట్టుగా చెక్కుల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు.
చింతకాని మండలంలో మొత్తం 3465 మంది లబ్దిదారులు ఉండగా ఇందులోని 1,387 యూనిట్లను విక్రయించడం, దారి మళ్లించడం చేశారని, దళిత బంధు యూనిట్లు ఇతరులు కొనుగోలు చేయడం, లబ్దిదారులు వాటిని అమ్మడం చట్టరీత్యా చెల్లుబాటు కాదని తెలిపారు. దళిత బంధు యూనిట్లన్నింటినీ జిల్లా అధికారులు విచారిస్తున్నారన్నారు. ప్రస్తుతం 214 మంది లబ్దిదారుల విచారణ పూర్తి చేసి రెండో విడత నిధులు పొందేందుకు అర్హులని గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం చెక్కులు పొందిన లబ్దిదారులు వృత్తి వ్యాపారాలు చక్కగా నిర్వహించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. దారి తప్పిన యూనిట్ల వివరాలు ఇస్తే అధికారులు వాటిని విచారించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఈడీ నవీన్ కుమార్, తహసీల్దార్ టి.కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో చుంచు రామయ్య, తెలంగాణ రాష్ట్ర హస్తకళల చైర్మెన్ నాయుడు సత్యం, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మడుపల్లి భాస్కర్ గౌడ్, కొప్పుల గోవిందరావు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు షేక్ పాషా, తోటకూరి ప్రగతి, ఓర్సు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఖాతాలో దళిత బంధు లబ్దిదారుల నిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES