రాజకీయ నాయకుల భాష బాధాకరం :
శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
రాజకీయ పార్టీలు ఉచితాలను కట్టడి చేసి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉచితాలు ఇవ్వడం వల్ల రాష్ట్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఉపాధి అవకాశాలు పెంచితే ప్రజల జీవనం మెరుగవుతుందని, ఆర్థిక పురోగతి ఉంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఉచిత పథకాల వాగ్దానాలు ఇవ్వకుండా కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉంటోందని, ప్రతిపక్షం, అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈ సడింపునకు గురికావొద్దని హితువు పలికారు. రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజకీయ పార్టీల వైఖరితోనే అధికారుల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, రాజశేఖరరెడ్డి లాంటి వాళ్లు వెంట ఏమీ తీసుకుపోలేదని చెప్పారు. అవినీతిపై ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు దృష్టి సారించాలన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసే విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశౄరు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్రాస్‌కు నీళ్లు తీసుకు పోవడానికి ప్రాజెక్ట్‌ల అనుసంధానం జరిగిందన్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందుకే తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత ఫిర్యాదులు అందాయని, అయితే ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం తనకు బాధను కలిగించిందని అన్నారు. చట్టపరంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
ఉచితాలు తగ్గించి.. ఉపాధి కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES