Wednesday, July 23, 2025
E-PAPER
Homeజాతీయంధన్కర్‌ రాజీనామా వెనుక..!

ధన్కర్‌ రాజీనామా వెనుక..!

- Advertisement -

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ ఆకస్మిక రాజీనామా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అనారోగ్య కారణాలతో వైద్యుల సలహా మేరకు పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్కర్‌ చెప్పినప్పటికీ దాని వెనుక వేరే కథ నడిచిందన్న వార్తలు వినవస్తున్నాయి. రాజీనామా చేసిన సోమవారం నాడు ధన్కర్‌ రాజ్యసభలో అనేక కీలక అంశాలను లేవనెత్తారు. హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మపై సభ్యులు ఇచ్చిన అభిశంసన తీర్మానం కూడా వీటిలో ఒకటి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా సాయంత్రం నాలుగు గంటల వరకూ ధన్కర్‌ సభా కార్యకలాపాలను యధావిధిగానే నిర్వహించారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే తన రాజీనామాను హఠాత్తుగా ప్రకటించారు.

జస్టిస్‌ వర్మ అభిశంసన తీర్మానంపై…
పదవీకాలం ముగియడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉండగానే ధన్కర్‌ రాజీనామా చేశారు. ఈ అనూహ్య చర్య రాజకీయ నేతలలో పలు ఊహాగానాలకు కారణమవుతోంది. జస్టిస్‌ వర్మపై సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ధన్కర్‌ వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ఆయన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి తొలగింపు విషయంలో ఉభయ సభలు సమాంతరంగా చర్యలు చేపడుతున్న తరుణంలో ఎగువ సభ చైర్మెన్‌ ఓ అడుగు ముందుకు వేసి విచారణ కమిటీని ఏర్పాటు చేయడం ఎవరూ ఊహించని పరిణామమే. జస్టిస్‌ వర్మపై లోక్‌సభే తొలుత చర్య ప్రారంభిస్తుందని ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తెలిపింది. కానీ సోమవారం ధన్కర్‌ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్‌ వర్మ అభిశంసనను కోరుతూ యాభై మందికి పైగా సభ్యులు సంతకాలు చేసిన లేఖ తనకు చేరిందని ఆయన ప్రకటించారు. లేఖపై ప్రతిపక్ష సభ్యులు సంతకాలు చేసి, దానిని చైర్మెన్‌కు ఇచ్చిన విషయం అప్పటి వరకూ కేంద్రానికి తెలియదు. అభిశంసన నోటీసుపై తదుపరి చర్యలు చేపట్టాలని రాజ్యసభ సెక్రెటరీ-జనరల్‌ను ధన్కర్‌ ఆదేశించారు కూడా.

ప్రతిపక్ష నేతలతో సన్నిహితత్వం
ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి భద్రతా వైఫల్యాలే కారణమన్న ఆరోపణపై సభలో మాట్లాడేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ధన్కర్‌ అనుమతించడం, ఆయన సుదీర్ఘంగా ప్రసంగించడం కూడా కేంద్రానికి ఆశ్చర్యం కలిగించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ను చర్చలకు తానే ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను కూడా ఖర్గే ప్రస్తావించారు.

రాజ్యసభలో చర్చ జరిగినప్పుడే ఈ అంశాలపై మాట్లాడేందుకు ఖర్గేను ధన్కర్‌ అనుమతించి ఉండాల్సిందని అధికార పక్షానికి చెందిన సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ధన్కర్‌ పలువురు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులతో సన్నిహితంగా ఉండడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ధన్కర్‌ గత వారం వీపీ ఎన్‌క్లేవ్‌లో ఖర్గేతో భేటీ అయ్యారు. ఆప్‌ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆదివారం సమావేశమయ్యారు. రాజీనామాకు కొద్ది గంటల ముందు కూడా ఆయన ప్రతిపక్ష నేతలతోనే ఎక్కువ సేపు గడిపారు. కాగా న్యాయ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు ఎన్‌జేఏసీ వంటి సంస్థను తిరిగి ఏర్పాటు చేయాలని ధన్కర్‌ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కూడా ప్రభుత్వానికి రుచించలేదు.

పాలక పక్షం నుంచి కానరాని స్పందన
అనారోగ్య సమస్యల కారణంగా పదవి నుండి వైదొలుగుతున్నానని ధన్కర్‌ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మినహా కేంద్రంలో కీలక పదవులు నిర్వహిస్తున్న నేతలెవ్వరూ స్పందిచకపోవడం గమనార్హం. ధన్కర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు మోడీ అర్థరాత్రి 12.13 గంటలకు ట్వీట్‌ చేశారు. అంతకుముందే ఆయన మహారాష్ట్ర నేతలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా ధన్కర్‌ 2022 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ గతంలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అయితే ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. తదనంతర కాలంలో ప్రతిపక్షాలు మరో ప్రయత్నం చేసినప్పటికీ నోటీసు ఇవ్వలేదు. ధన్కర్‌ ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

రాజ్యాంగం ఏం చెబుతోంది?
దేశంలో రెండవ అతి పెద్ద రాజ్యాంగ పదవికి ధన్కర్‌ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి, రాజ్యసభ చైర్మెన్‌ పదవి ఖాళీ అయ్యాయి. పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసిన ఉప రాష్ట్రపతులలో ధన్కర్‌ మూడో వ్యక్తి. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగా వీవీ గిరి, ఆర్‌.వెంకట్రామన్‌ గతంలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలో తాత్కాలిక ఉప రాష్ట్రపతి పదవి అంటూ ఏదీ లేదు. అయితే ఉప రాష్ట్రపతే రాజ్యసభ ఎక్స్‌ అఫీషియో చైర్మెన్‌ అయినందున ఆయన లేనప్పుడు డిప్యూటీ చైర్మెన్‌ సభను నిర్వహిస్తారు. ఉప రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఆ పదవిని ఎంత కాలంలో భర్తీ చేయాలన్న విషయంపై కూడా రాజ్యాంగం ఎలాంటి నిర్దేశమూ చేయలేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ అని మాత్రమే చెప్పింది. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు మాత్రం ఆరు నెలల లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎన్నికైన వారు ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. అంతేకానీ ధన్కర్‌ పదవీకాలంలో మిగిలిన సమయం కాదు. ‘కోటా’ ఓట్లు పొందిన భ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. చెల్లుబాటైన మొత్తం ఓట్లను రెండుతో భాగించి, వచ్చిన సంఖ్యకు ఒకటి కలుపుతారు. అవే కోటా ఓట్లు.

జగదీప్‌ ధన్కర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రభవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్‌ ఉప రాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హౌంశాఖకు పంపింది. అనంతరం దీనిని హౌం శాఖ నోటిఫై చేసి ఈ నిర్ణయం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తుందని రాజ్యసభకు తెలిపింది. 12గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే సభను నిర్వహిస్తున్న ఘనశ్యామ్‌ తివారీ నోటిఫికేషన్‌పై సభ్యలకు వివరించారు. కాగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ సోమవారం రాత్రి రాజీనామా చేసిన విషయం విదితమే.

నడ్డా.. కిరణ్‌ రిజిజు ఒత్తిడి తెచ్చారా..?
2027 వరకు ఉపరాష్ట్రపతిగానే ఉంటానన్న జగదీప్‌ ధన్కర్‌.. పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయటం చర్చనీయాం శంగా మారింది. మరోవైపు కేంద్రా నికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నారంటూ ధన్కర్‌పై కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు ఒత్తిడి తేవటంవల్లే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.మరోవైపు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను ఎన్నికలకు ముందే తొలగించి.. ఉపరాష్ట్రపతి కుర్చీపై కూర్చోపెట్టడానికి మోడీ బృందం ఆడిన పాలిట్రిక్స్‌ అని మీడియా కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -