Wednesday, July 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై యుద్ధం ఆపాల్సిందే

గాజాపై యుద్ధం ఆపాల్సిందే

- Advertisement -

ఇజ్రాయిల్‌ చర్యలు ఆమోదయోగ్యం కావు
28 దేశాల సంయుక్త ప్రకటన
గాజా :
గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాల్సిందేనని బ్రిటన్‌, జపాన్‌ సహా 28 దేశాలు సూచించాయి. ఈ మేరకు అవి సోమవారం ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలోని ప్రజలకు అత్య వసర మానవతావాద సాయాన్ని అందించేం దుకు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ నిరాకరించడం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశాయి. గాజాలో మారణహోమం సాగిస్తున్న ఇజ్రాయిల్‌ ఈ ప్రకటనతో దాదాపుగా ఒంటరి అయినట్లు కన్పిస్తోంది. సంయుక్త ప్రకటనపై
సంతకాలు చేసిన దేశాలలో ఆస్ట్రేలియా, కెనడా విదేశాంగ మంత్రులు కూడా ఉన్నారు. యుద్ధం కారణంగా గాజా ప్రజల కష్టాలు మరింత అధికమయ్యాయని వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, ఆహారం కోసం సహాయ కేంద్రాల వద్ద బారులు తీరిన చిన్నారులు సహా అమాయక ప్రజలను అమానుషంగా హతమార్చడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇటీవలి కాలంలో సాయం కోసం వేచి ఉన్న 800 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ దాడులలో ప్రాణాలు కోల్పోవడం భయానకంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘బాధితులకు సాయం అందించే పేరిట ఇజ్రాయిల్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా ప్రమాదకరమైనది. ఇది అస్థిరతను పెంచుతోంది. ప్రజల గౌరవాన్ని హరిస్తోంది. ప్రజలకు అత్యవసర మానవతావాద సాయం అందకుండా నిరోధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ మానవతావాద చట్టాలను గౌరవించి వాటికి అనుగుణంగా వ్యవహరించాలి’ అని ఆ ప్రకటన కోరింది.
ఈ ప్రకటనను ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఇది వాస్తవ దూరంగా ఉన్నదని, హమాస్‌కు తప్పుడు సందేశాన్ని పంపుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒరెన్‌ మార్మోర్‌స్టెయిన్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న మైక్‌ హకాబీ కూడా ఈ ప్రకటనను ఖండించారు. తమకు సుద్దులు చెప్పడం మాని హమాస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. కాగా సంయుక్త ప్రకటనపై జర్మనీ సంతకం చేయకపోవడం గమనార్హం. అయితే గాజాలో మానవతాసాయాన్ని అనుమతించాలని ఇజ్రాయిల్‌ను కోరినట్లు జర్మనీ విదేశాంగ మంత్రి జొహాన్‌ వాడేఫల్‌ చెప్పారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సంయుక్త ప్రకటన పిలుపునిస్తూ మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అనుసరించే రాజకీయ పరిష్కార మార్గానికి తాము మద్దతు ఇస్తామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -