ఓబీసీలు ఎక్కడీ
ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర వల్లే చరిత్రకు దూరం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : భారతదేశ ఉత్పాదకశక్తికి ప్రతీకలు ఓబీసీలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ఓబీసీల చరిత్ర ఎక్కడుందని, ఎవరు రాశారని ప్రశ్నించారు. ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓబీసీలు అన్నిరంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘భాగీదారీ న్యాయ సమ్మేళన్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు
ప్రధాని మోడీపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీని కొన్ని సార్లు కలిశానని, ఆయనలో అంతగా విషయం లేదని అంతా షోనేనని వ్యాఖ్యానించారు. ప్రధానిపై భారీగా హైప్ పెంచింది మీడియానేనని, ఆయనలో పెద్దగా విషయం లేదనే విషయం తనకు అప్పుడే అర్థమైందన్నారు. ”ఇంతకుముందు ఎప్పుడు నేను ఆయనను కలవలేదు, కానీ ఈ మధ్యలో ఆయనను 2-3 సార్లు కలిశాను. అప్పుడే నాకు అర్థమైంది. ఆయనలో విషయం లేదు. అంతా షో మాత్రమే. మోదీకి చాలా మంది ప్రాముఖ్యం ఇస్తారు. కానీ ఆయన పెద్ద సమస్యే కాదు. మీడియా ఆయనకు ఎక్కువ ప్రచారం ఇచ్చి హైప్ తెచ్చింది.” అని రాహుల్ అన్నారు.
తప్పుచేశా..
”నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను తప్పు చేశానని నాకు అర్థమవుతోంది. నేను ఓబీసీలను రక్షించాల్సిన విధంగా కాపాడలేదు. ఆ సమయంలో మీ సమస్యలను లోతుగా అర్థం చేసుకోలేకపోయాను. ఓబీసీ చరిత్ర గురించి, మీ సమస్యల గురించి, ఇంకా కొంచెం ఎక్కువగా నాకు తెలిసి ఉంటే, నేను ఆ సమయంలోనే కులగణన నిర్వహించి ఉండేవాడిని. దీనికి నేను విచారిస్తున్నాను. ఇది నేను చేసిన తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. నా తప్పు. నేను ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నాను” అని రాహుల్ గాందీ అన్నారు.ó
కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడ..?
కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని, అదానీ ఓబీసీనా అని కేంద్రాన్ని నిలదీశారు. మీడియారంగంలో ఓబీసీలకు స్థానం ఎక్కడుందని రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ కలలు సాకారం చేసుకొనే హక్కు ఉందని, రైతు కుమారుడు వ్యాపారవేత్త కావొచ్చని పేర్కొన్నారు. అవకాశాలు అందిపుచ్చుకొనే సామర్థ్యం అందరికీ రావాలన్నారు. తమ శక్తిని తెలుసుకోలేకపోవడమే కొందరి సమస్యగా చెప్పుకొచ్చారు.దేశంలో దళితుల చరిత్రను అంబేడ్కర్ మాత్రమే అర్థం చేసుకున్నారని రాహుల్ వివరించారు.
తెలంగాణలో పకడ్బందీగా కులగణన
సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పకడ్బందీగా కులగణన చేపట్టారని, అభివద్ధిలో విద్యదే కీలకపాత్ర అన్నారు. ఇంగ్లీషు నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ భాషలు ముఖ్యమే, అలాగే ఇంగ్లీషు కూడా కీలకమైన అని రాహుల్ అన్నారు. ప్రయివేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
కార్పొరేట్ ఇండియాలో
- Advertisement -
- Advertisement -