– ఢిల్లీకి చేరిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం
– కేంద్రం హోంశాఖకు ముసాయిదా ఆర్డినెన్స్‌ను పంపిన గవర్నర్
– మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ అధిష్టానం
– ఇప్పటికీ స్పష్టత ఇవ్వని రాజ్‌భవన్
– ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం
– సమీపిస్తున్న హైకోర్టు గడువు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశం కేంద్రంలోని మోడీసర్కార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. దీన్ని ఆమోదిస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ ఇదే ప్రధాన డిమాండ్‌గా మారే అవకాశం ఉంది. తిరస్కరిస్తే ఓబీసీ వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయక తప్పని పరిస్థితి మోడీ సర్కార్‌కు ఏర్పడింది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలోనూ తెలంగాణ ప్రతిపాదనల్ని స్వీకరిస్తే, రాజకీయంగా ఎదురయ్యే సమస్యలు, సవాళ్లపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. తమ సొంత ఎజెండా పక్కకు పోతున్నదనే వాదన కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. మొదటి నెలలో ‘స్థానిక’ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని సూచించింది. ఆ తర్వాత రెండు నెలల్లో ఎన్నికలు పూర్తిచేయాలని దిశానిర్దేశం చేసింది. ఆమేరకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. దానికోసం స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించరా దంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో చేసిన పంచాయితీరాజ్ చట్టం-2018ని సవరిస్తూ ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
కేంద్ర హోంశాఖకు…
దీనిపై ఈనెల 21 నాటికి గవర్నర్ ఆమోదం లభిస్తే, ఆ వెంటనే గెజిట్ ప్రచురించి, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ముసాయిదా ఆర్డినెన్స్‌ను న్యాయ సమీక్ష కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారని ప్రచారం జరుగుతోంది. దీన్ని పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ 30 నుంచి 32 అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి రాష్ట్రానికి పంపినట్టు సమాచారం. అయితే దీనిపై గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఆర్డినెన్స్‌ను ఆమోదించనూ లేదు.
కేంద్రమంత్రుల అర్థంలేని వ్యాఖ్యలు
42శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ సమాధానం చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలై న గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రల్లో అక్కడి ప్రభుత్వాలు ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను తొలగిస్తే, రాష్ట్రంలోనూ ఆలోచిస్తామని బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టారు. దీనితో బీజేపీ రాజకీయ సంకటంలో పడింది.
ఎవరి ప్రయోజనాలు వారివే…
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయా లేదా అనే సందేహం అన్ని రాజకీయపార్టీల్లోనూ ఉంది. నిర్ణీత గడువు లోపు ముసాయిదా ఆర్డినెన్స్‌కు గవర్నర్ నుంచి ఆమోదం లభిస్తే, ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ భావిస్తున్నది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ న్యాయసమీక్షలో అడ్డంకులు లేకుండా చూసి, బిల్లు ను ఆమోదింపచేశామని ప్రచారం చేసుకోవాలనే ఎత్తుగడలో బీజేపీ ఉంది. కాదంటే ముస్లింలను బూచిగా చూపి, విభజన రాజకీయాలకు ఆజ్యం పోయాలనే ఎత్తుగడలో ఉంది. ఈ ఆర్డినెన్స్‌పై ఏది జరిగినా సమానంగా స్వీకరించి, రాజకీయ సవాళ్లు విసిరేందుకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. ఆమోదం పొందితే మా పోరాటాల ఫలితమే అనీ లేకుంటే కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనే ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది.
ఢిల్లీలో సీఎం మకాం
నిర్ణీత గడువులోపు గవర్నర్ నుంచి ఆర్డినెన్స్‌కు ఆమోదం రాకుంటే స్థానిక ఎన్నికలు పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్డినెన్స్‌కు ఆమోదం పొందటం కోసం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజులు అక్కడే మకాం వేసి ప్రయత్నాలు చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ ఎజెండా గా మార్చేందుకు ప్రయత్నించారు. పార్లమెంటు సమావేశాలు జరుగు తున్న నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను ఇతర పార్టీల ప్రధాన ఎజెండాలోనూ చేర్చడంలో సీఎం సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు పనిచేస్తాయో వేచిచూడాలి. గురువారం రాత్రికి సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
జనంలోకి సీపీఐ(ఎం)
ఈ పార్టీలన్నీ కేవలం ఓట్లు, సీట్ల కోసం ఎత్తుగడలు వేస్తుంటే, సీపీఐ(ఎం) మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ, స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ క్షేత్రస్థాయిలో ప్రజలే కేంద్రంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక సమరంపై ఇప్పటికే తమ రాజకీయపంథాను ఆయన ప్రకటించారు.
గతంలో..
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్‌కు పంపి, దాన్ని అప్పటి
గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదించలేదంటూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇది తెలియగానే పాండిచ్చేరి నుంచి హుటాహుటిన రాజ్‌భవన్‌కు వచ్చిన గవర్నర్ తమిళసై ప్రభుత్వ అధికారులను పిలిచి, వివరణలు కోరి, ఆ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయకోణం ఉన్నా, ఎట్టకేలకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే తరహా రాజకీయాన్ని కోరుకుంటున్నట్టు కనిపిస్తున్నది.