నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిష్టుల శాంతి ప్రతిపాదనలపై బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో తుపాకుల మోతతో హల్ చల్ చేస్తుంది. తాజాగా జార్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. శనివారం ఉదయం గుల్మా జిల్లాలోని ఘాగ్రా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్‌య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వారిని సీపీఐ (మావోయిస్టు)కు చీలిక వర్గం జేజేఎంపీకి చెందిన వారిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని ఐజీ మిచెల్ ఎస్ రాజు వెల్లడించారు.
ఈ నెల 16న కూడా జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. బొకారో జిల్లాలోని గోనియా ప్రాంతంలో ఉన్న బిర్హోర్డెరా అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులతోపాటు ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ చనిపోయారు.