Sunday, July 27, 2025
E-PAPER
Homeసందర్భంఆమె ఓ 'స్వర శిఖరం'

ఆమె ఓ ‘స్వర శిఖరం’

- Advertisement -

‘పాడలేను పల్లవైనా భాషరాని దానను’ అని అంటూనే తన మాతభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలను ఆలపించారు. అంతే కాకుండా.. తమిళం, ఒరియా, హిందీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, తుళు భాషలలో వేలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ‘దక్షిణ భారత నైటింగేల్‌’ అని బిరుదునందుకున్న చిత్ర 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్‌ పురస్కారంతో పాటు, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న చిత్ర పుట్టిన రోజు (జులై 27) సందర్భంగా ”నవతెలంగాణ సోపతి” పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
సంగీత ప్రపంచంలో ఆమె ఓ స్వర శిఖరం. శ్రోతల హదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికిన.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమెకున్న వరం. తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది ప్రముఖ సింగర్స్‌తో గొంతు కలిపిన ఆమె.. అనేక భాషల్లో దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడారు. అలా సౌత్‌ ఇండియాలోనే కాకుండా నార్త్‌లోనూ తన పాటలతో ఎందరో సంగీత ప్రియుల ఆదరాభిమానాలను పొందిన.. ఆమె మరెవరో కాదు లివింగ్‌ లెజెండ్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ కె.ఎస్‌.చిత్ర. ఎక్కడో కేరళలో పుట్టిన చిత్ర.. యావత్‌ సినీ ప్రపంచాన్ని తన గాత్రంతో ఓలలాడించి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట ఓ అద్భుతం అనాల్సిందే. సంగీతానికి భాషతో సంబంధం లేదన్న విషయాన్ని నిరూపించిన ఆమె.. తన గాత్రంతో పాటలకు నవరసాలను పరిచయం చేశారు.

కె.ఎస్‌. చిత్ర 1963వ సంవత్సరం జులై 27న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. చిత్ర అసలు పేరు ”కష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర”. తండ్రి కష్ణన్‌ నాయర్‌, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు ఆమె పూర్తి పేరులో ఉన్నాయి. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్‌. వీరి తల్లిదండ్రులకు తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను పెద్ద కూతురు బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క బీనా సంగీతం సాధన చేసేటపుడూ చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. ఓసారి ఆలిండియా రేడియోలోని ఓ నాటకంలో రెండేళ్ల కష్ణుడికి చిత్ర చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్‌ అదే. అది ప్రసారమయ్యాక చిత్రను పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కష్ణన్‌ నాయర్‌ కేంద్రప్రభుత్వం అందించే ‘నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్‌ షిప్‌’కి దరఖాస్తు చేసారు. కానీ, అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ చిత్ర అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతోనే ఉపకార వేతనానికి దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన న్యాయనిర్ణేతలు రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలన్న నిబందనను పక్కన పెట్టి ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో ‘డా. కె. ఓమనకుట్టి’ వద్ద కర్ణాటక సంగీతంలో విస్తతమైన శిక్షణ పొందింది. ఆమె 1979లో విడుదలైన ”కుమ్మట్టి” చిత్రంలో తొలిసారి పాడింది.

సినిమాల్లో..
ఓమనకుట్టి సోదరుడు ఎంజీ రాధాకష్ణన్‌ 1979లో ‘కుమ్మట్టి’ సినిమాకి పాడించారు కానీ, ఈ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్లీ ఓసారి అవకాశమిస్తే డ్యూయెట్‌ సాంగ్‌ పాడింది. మొదట్లో ‘ట్రాక్‌’ కోసమని రికార్డు చేశారు. ఈ డ్యూయెట్‌ని చిత్రతో పాటు ఓమనకుట్టి తమ్ముడు ఎంజీ శ్రీకుమరన్‌ పాడారు. ఆ తర్వాత శ్రీకుమరన్‌ ట్రాక్‌కి బదులు కే.జే.ఏసుదాసుని ఎంచుకున్నారు. ఆయనకోసం మరోసారి చిత్రను మల్లి పాడమన్నారు. ఏసుదాసు పక్కన నిల్చుని పాడటమన్న ఆ ఆలోచనకే భయపడటంతో రికార్డింగులో తప్పులొచ్చాయి. అయినాసరే ఏసుదాసు ఓపిగ్గా సవరణలు చెప్పి పాడించారు. ఆ పాట బయటకొచ్చాక ‘ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట!’ అంటూ ఇండిస్టీలోని మిగతా సంగీతదర్శకులూ చిత్రకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాధా కష్ణ మ్యూజిక్‌లోనే 5 సినిమాలకు పాడిన చిత్ర ఆ తర్వాత రవీంద్రన్‌ మాస్టర్‌, జాన్సన్‌ మాస్టర్‌ దగ్గర పాడింది. అయితే చెన్నైకు రికార్డింగ్‌కు తీసుకొచ్చింది మాత్రం రవీంద్రన్‌ మాస్టర్‌. కానీ, కొద్ది రోజుల్లోనే.. ‘మరీ చిన్నపిల్లల గొంతులాగా ఉంది. పెద్దవాళ్లకి పనికిరాదు!’ అనే ముద్రపడింది. కాకపోతే చిన్నపిల్లలా.. నటి నదియా కోసం పాడిన ఓ పాట ఇళయరాజా చెవిన పడి 1984లో ఆయన దగ్గర పాడే అవకాశం ఇచ్చిన తర్వాతనే చిత్ర కెరీర్‌ మలుపు తిరిగి, ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ దగ్గర పాడే అవకాశాలు చిత్రకు వచ్చాయి.
సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన ‘నేనొక సింధు..’ అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో ‘పాడలేను పల్లవైన భాషరాని దానను’ అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే వున్నాయి. తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిత్ర పాడిన వర్షం చిత్రంలో ”నువ్వువస్తానంటే.. నేనద్దంటనా..”, నేనున్నానులో ”ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో..” నిన్నే ప్రేమిస్తా లో ”ఒక దేవత వెలిసింది”, ప్రియమైన నీకు లో ”మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది..”, యమలీల లో ”చిరులోలికే చిన్ని నవ్వులే..” రాజా చిత్రంలో ”ఏదో ఒక రాగం పిలిచింది..” అంతఃపురం లో ”అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుంటే..”, నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మోమోరీస్‌ లో ”మౌనంగానే ఎదగమని మొక్క చెబుతుంది..” వంటి అనేక విజయవంతమైన పాటలు చిత్ర స్వర విన్యాసంతో శ్రోతలను ఆలరించాయి.

చిత్ర వివాహం
చిత్ర బీఏ సంగీతం చదువుకునేటప్పుడు వేరే కాలేజీకి చెందిన రాజీ అనే అమ్మాయి చిత్రతో పోటీపడుతూ ఉండేది. ఎంత స్పర్థ ఉన్నా చిత్రకు మంచి స్నేహితురాలు! ఆ అమ్మాయికి ఎలక్ట్రికల్‌ ఇంజినీరు చేస్తున్న విజరుశంకర్‌ అనే అన్నయ్య ఉన్న విషయం చిత్రకు తెలియదు. చిత్రను విజరుశంకర్‌తో వివాహం చేయమని చిత్ర వాళ్ళ నాన్న ఫ్రెండ్‌ ద్వారా అబ్బాయి తల్లిదండ్రులు కబురు చేయడం, అందరికీ నచ్చి 1988 లో వీరిద్దరికీ వివాహం జరిగింది.

చిత్ర పేరులో అమ్మ-నాన్న
కె.ఎస్‌. చిత్ర పేరులో నాన్న పేరు కష్ణన్‌ నాయర్‌ నుండి ‘కె’, అమ్మ పేరు శాంతకుమారి నుండి ‘ఎస్‌’ తో ‘కె.ఎస్‌. చిత్ర’గా నామకరణం చేసారు. ‘పిల్లలకి ఇనిషియల్‌గా తండ్రిపేరే ఎందుకుండాలి? తల్లి పేరూ ఉంటే తప్పేమిటీ!’ అని చిత్ర పేరు ముందు అమ్మ, నాన్నల పేరునీ చేర్చిన అభ్యుదయవాది కష్ణన్‌ నాయర్‌. వాళ్ళిద్దరూ ఉపాద్యాయులే. తమ సంతానంలో ఎవరైనా సంగీత రంగంలోకి వెళ్లాలనే కల ఉండేది ఆ ఇద్దరికీ. పెద్ద కూతురు బీనాకు సంగీతం నేర్పించారు. అక్క సంగీత సాధన చేసేటప్పుడు విని చిత్ర కూడా సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది.

చిత్ర మనసులో తీరని విషాదం
ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే చిత్ర మనసులో తీరని విషాదం దాగి ఉంది. తన కూతురు భౌతికంగా దూరమైనా ఇప్పటికీ కూతురు జ్ఞాపకాలతో గడుపుతున్నారు. పెళ్లయ్యాక పదిహేనేళ్లకు 2002లో చిత్ర దంపతులకు కూతురు నందన జన్మించింది. కానీ ఆ కూతురు డౌన్‌ సిండ్రోమ్‌తో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో 2011లో దుబారు లోని ఎమిరేట్స్‌ హిల్స్‌ లో స్విమ్మింగ్‌ పూల్‌ లో పడి చనిపోయింది. అప్పటి నుండి చిత్ర ప్రతి సంవత్సరం ‘నందన’ జయంతి, వర్దంతి రోజున కూతురిని తలుచుకుంటూ ఎమోషనల్‌ అవుతుంటారు. కూతురిని తలుచుకుని బాధపడే చిత్ర. ‘నువ్వు నాతో లేకపోయినా ఎప్పటికీ నాలోనే ఉంటావు. నా తుది శ్వాస వరకు నువ్వు నా గుండెల్లో బతికే ఉంటావు”అంటూ ఒక ఏడాది, ”మిస్‌ యూ నందన’ అంటూ మరో ఏడాది కూతురి ఫొటో షేర్‌ చేస్తూ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేస్తారు.

ఇళయరాజాతో
1984లో ఒక మలయాళ పాట తమిళ వెర్షన్‌ పాడేందుకు జరిగిన వాయిస్‌ టెస్ట్‌కు వెళ్ళడం జరిగింది. అప్పుడే ఇళయరాజాను మొదటి సారి చూసిన చిత్ర ఆయన దగ్గర కాపీ రాగంలో ఓ త్యాగరాజ కీర్తనను పాడింది. అయితే ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడి తడబడటంతో ఇళయరాజా ఆ పాటను కరెక్ట్‌ చేసి.. ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి పంపారు. ఆ తర్వాత రోజే చిత్రను పాట పాడేందుకు పిలిచారు. ఆయన కంపోంజింగ్‌లో పాడిన ప్రతీ పాట చిత్రకు ఒక్కో అనుభవంగా నిలవడమే కాకుండా పలు రకాల టోన్స్‌తో ఆయన దగ్గర ఎన్నో పాటలు పాడింది. ఆయనతో కలిసి ఎన్నో ఎక్స్‌పరిమెంటల్‌ ప్రాజెక్టులకు పని చేసిన చిత్రకు సింగింగ్‌ విషయంలో ఎన్నో సూచనలు ఇచ్చేవారు. జానకీ, సుశీల లాంటి సీనియర్‌ సింగర్స్‌ పాటలను వినమని సూచించేవారు.

సుశీల పాటల వేదం
చిన్నప్పుడు చిత్ర తమ్ముడిని ఉయ్యాలూపుతూ సుశీల పాడిన ‘ప్రియతమా ప్రియతమా’ పాట పాడేదాన్నని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన చిత్ర, ఆ రకంగా ఆమె పాటతోనే సంగీతరంగంలోకి వచ్చాన్నేను అంటుంది. చిత్ర ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పగా విని సుశీల ఇంటికి పిలిచి మరీ ఆమె పాడిన పాటలు చిత్ర చేత పాడించుకుని ఆనందించారు! సుశీల ప్రతిపాటా ఓ వేదంలా అభ్యసించాల్సిందేనని నమ్ముతాన్నేను అంటుంది చిత్ర.

సింగర్‌ లతా మంగేష్కర్‌తో
చిన్నప్పటి నుంచి లతా, ఆశ, సుశీల, జానకీ పాటలను వింటూ వచ్చిన చిత్ర, లతా మంగేష్కర్‌ను జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని అనుకున్నారట. కానీ లతతో ఐదారు సార్లు ఫోన్‌లో మాట్లాడటమే కాకుండా, రెండు మూడు సార్లు నేరుగా కలుసుకున్న చిత్ర, లతా బర్త్‌డేకి ఆమె ముందు పాడే అవకాశం లభించింది. లతాజీ పేరు మీద హైదరాబాద్‌లో ఓ అవార్డు కూడా అందుకున్నారు.

నీలాంటి కూతురు నాకుంటే..
చిత్ర తెలుగూ, తమిళంలో పాడటం మొదలుపెట్టిన తొలిరోజుల్లో పాటకు తగ్గ భావాన్ని ఎలా వ్యక్తీకరించాలో నేర్చుకున్నది జానకి పాటలతోనే! ఓసారి కచేరీ చేస్తుంటే జానకి అకస్మాత్తుగా వేదికపైకి వస్తే బిత్తరపోయి నోటమాట రాకుండా ఉండిపోయిన చిత్రను ఆలింగనం చేసుకుంటూ… ‘నీలాంటి కూతురు నాకుంటే ఎంత బావుణ్ణమ్మారు!’ అని అన్నారట.

రెహ్మాన్‌తో…
రోజాలోని ‘నాగమణీ నాగమణీ!’ పాటతో రెహ్మాన్‌తో చిత్ర ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి ‘మనసే తీయగా’ (ఓకే బంగారం) దాకా వారి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు అక్షరాలా నూటపదహార్లు! ‘బొంబాయి’ హిందీ వెర్షన్‌ కోసం చిత్ర పాడిన ‘కెహనాహి క్యా’ (తెలుగులో ‘కన్నానులే కలయికలు’) పాటని ప్రసిద్ధ గార్డియన్‌ ఆంగ్ల పత్రిక ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటలు’ జాబితాలో చేర్చడం వారి కాంబినేషన్‌కి దక్కిన అతిపెద్ద గౌరవం!

పురస్కారాలు
గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్న ‘కె.ఎస్‌.చిత్ర’ను భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సన్మానించింది. చిత్ర ‘ఉత్తమ మహిళా నేపథ్యగాయని’గా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు.
1986 లో సింధుభైరవి, తమిళ, తెలుగు సినిమా; 1987లో నఖక్షతంగళ్‌ మలయాళ సినిమా; 1989లో వైశాలీ, మలయాళ సినిమా; 1996 లో మిన్సార కనువు, తమిళ సినిమా; 1997 లో విరాసత్‌, హిందీ సినిమా; 2004 లో ఆటోగ్రాఫ్‌, తమిళ సినిమా చిత్రాలకు నేపథ్యగాయనిగా జాతీయ పురస్కారాలు అందుకోవాడమే కాకుండా, చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను అందుకున్నారు. అంతేకాక ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాల నుండి ఒక్కో పురస్కారాన్ని అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయని పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సష్టించారు. 8 ఫిలింఫేర్‌ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డ్‌ లు అందుకున్నారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డ్‌ పొందిన మొదటి భారత దేశ నేపథ్య గాయకురాలుగా చరిత్ర సష్టించారు. బ్రిటిష్‌ పార్లమెంటులోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది.

‘స్నేహ నందన’ ట్రస్టు
కూతురు నందన చనిపోయాక చిత్ర కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. కాలం అన్ని గాయాలను మాన్పుతుందని చెబుతారు. అలా నందన లేని లోటుని మెల్లగా సంగీతంతో పూడ్చుకోవడం మొదలుపెట్టిన చిత్ర పేదకళాకారుల కోసం పాప పేరుతో ‘స్నేహ నందన’ ట్రస్టు ప్రారంభించింది. ట్రస్ట్‌ ద్వారా పాతికమంది కళాకారులకి నెలనెలా పెన్షన్‌ ఇస్తుంది. అంతేకాకుండా, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే టీవీ పాటల పోటీలకి న్యాయనిర్ణేతగా ఇష్టంగా వెళుతుంది. ”నిజానికి, షూటింగుల్లో ఉండే దుమ్మూధూళీ, లైట్ల వెలుగులూ- ఇవన్నీ నాకు పడవు. అయినా పిల్లల అల్లరి, నన్ను చూడగానే పరుగున వచ్చి ‘చిత్రా అమ్మా’ అంటూ చుట్టుకుపోయే అభిమానాన్నీ ఆనందంగా చూస్తుంటాను. పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటాను. వాళ్ల కోసమనే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాను.” పిల్లల నోటివెంట ‘చిత్రా అమ్మా’ అన్న పిలుపు విన్న ప్రతిసారీ ‘నా నుంచి ఒకర్ని తీసుకెళ్లినా వందలమంది పిల్లల్నిచ్చావు దేవుడా!’ అనుకుంటూ ఉంటాను అని అంటుంది.


– డా. పొన్నం రవిచంద్ర,
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -