Sunday, July 27, 2025
E-PAPER
Homeసోపతిమెతుకు సీమ కొత్త బాల గీతం 'పట్లోళ్ల'

మెతుకు సీమ కొత్త బాల గీతం ‘పట్లోళ్ల’

- Advertisement -

మన ఉమ్మడి మెతుకుసీమ ఎందరో బాల సాహితీవేత్తలకు ఆలవాలమై నిలిచింది. విద్వత్కవి డా. వేముగంటి నరసింహాచార్యులు మొదలు నేటిదాకా వందలాది మంది బాల సాహితీవేత్తలు, బాల సాహితీ వికాసకారులతో పాటు అనేక రచనలు చేసి నిలుస్తున్న బాల రచయితలు ఈ ఉమ్మడి మెతుకు సీమ నుండి ఎదిగి నిలిచారు. ఒకదశలో ఇక్కడి బాలబాలికలు రచయితలుగా పురస్కారాల్లో తొలి వరుసలో నిలవడం మరింత విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా కవి, బాల సాహితీవేత్త పట్లోళ్ల బక్కారెడ్డి. ఈయన అక్టోబర్‌ 9, 1957వ తేదీన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నేగీడ్‌ మండలం, గజవాడ గ్రామంలో పుట్టారు. శ్రీమతి పట్లోళ్ల భూమమ్మ – బక్కారెడ్డి వీరి తల్లిదండ్రులు. ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన బక్కారెడ్డి కవిగా ‘సంధ్యా పుష్పాలు’ కవితా సంపుటిని అచ్చువేశారు.
పదవీ విరమణ తరువాత ఇటు సాహిత్య రచనతో పాటు, వివిధ సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలోనూ బక్కారెడ్డి నిమగమై నిలిచారు. తన కార్యక్రమాల్లో భాగంగా లయన్స్‌ క్లబ్‌, సేవ్‌ టెంపుల్స్‌ కమిటీతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌ కమిటి సభ్యులుగా ఉన్నారు. ‘ప్రక్కప్రక్కన వెలుగు నీడలు/ తూర్పు పడమర – రాత్రి పగలు/ సూర్య చంద్రులు – వెలుగు వెన్నెల/ అమావాస్య పౌర్ణమిలు/ చిమ్మ చీకటి పండువెన్నెలలు’ అంటారు పట్లోళ్ల. కవిత్వంతో పాటు ఇతర రూపాలు, ప్రక్రియల్లో రచనలు చేసిన వీరు బాలల కోసం వందల గేయాలను కూర్చి అందించారు. దాదాపు వీరి అన్ని గీతాలు పత్రికల్లో అచ్చయ్యాయి.
గేయ రచన పట్ల అత్యంత ఇష్టంతో పాటు చక్కని పట్టున్న పట్లోళ్లకి పిల్లలన్నా, పిల్లల మాటలన్నా, నవ్వులన్నా అత్యంత ఇష్టం. ఆ యిష్టం, ప్రేమతోనే ఆయన తన గీతాలను కూర్చారు. అటువంటిదే-
‘బుజబుజ రేకుల బుజ్జాయి/ ఉంగా ఉంగా ఉజ్జాయి/ బోసి నవ్వుల నవ్వోయి/ ఊహల తేరు ఊగేనోయి’ గీతం. చక్కని లయ, అంతకు మించిన భావం, భాష వంటివి ఈ గీతానికి అందంతో పాటు చక్కని రూపాన్నిచ్చాయి. ‘నిత్య నిర్మల భూషితము/ … నిత్య నూతన భూషితము/ సదా వదనం హసితము’ అంటూ బుజ్జాయిని అందంగా వర్ణిస్తూనే ‘ఏమని పిలిచినా పలికేను/ ఎత్తుకుంటే కొండంత ఎగిరేను/ కన్నులు మూయక చూసేను/ కన్నయ్య చేష్టను తలపించెను’ అని చెబుతారు ఈయన. ఆ అందచందాల బుజ్జాయి ‘ఇంటికి వెన్నెలై వెలిగేను’ అట. పిల్లలకు లయతో పాటు చిన్నప్పుడే వివిధ అంశాలను తెలిపి వాళ్ళ తెలివిడి పెంచాలన్నది ఈయన ఆలోచన. ‘జీబ్రా క్రాసింగ్‌’ గీతం ఇటువంటిదే. ఇందులో రోడ్డు నియమాలను చెబుతూ వాటిని పిల్లలు తెలుసుకొని మసలాలంటారు. ఈ గీతం ఇలా సాగుతుంది… ‘జీబ్రా క్రాసింగ్‌ చారలు/ నలుపు తెలుపు గీతలు/ రోడ్డు దాటువారికి/ పాదచారులకు రక్షణ దారులు/ పాఠశాలలు కూడళ్ల చెంత/ ఉండే స్పష్టమైన దృశ్యమానత/ అక్కడ రోడ్డు దాటుట భద్రత/ పాదచారులు చారల గుర్రమెక్కినంత’ అంటారు. ‘కిక్కిరిసిన నేటి రహదారులు’ అంటూ చెబుతూనే ‘సిగల్స్‌ లేని చోట/ పగలైన రాత్రైనా రోడ్డు దాటుట/ ప్రాణాలతో చెలగాటమాడుట’ అని పిల్లలకు నచ్చచెబుతారీయన. అక్షరాల అమరికతో ఈయన రాసిన మరో మంచిగేయం ‘అ’ క్షరాల చదువలు తొలి శిక్ష/ ‘ఆ’ వర్ణమాల సరస్వతిదేవి బిక్ష/ ‘ఇ’ది పెద్దలు చదివిన తొలి కక్ష / ‘ఈ’ తరం చదవాలి పెద్దబాలశిక్ష’ అంటారు. ‘పిల్లల లోకం’ గేయంలో పట్లోళ్ల. పిల్లల గురించి, వాళ్ళ ప్రేమల గురించి ‘అమ్మ ప్రేమ గోరుముద్దలం/ రేపటికి ఎదిగే పిల్లలం/ ఉదయించే రవి బింబాలం/ చిరునవ్వుల వదనాలం/ ఆకాశంలో తారల తళుకులం’ అని వర్ణిస్తారు. మరోగేయంలో ‘చిన్ని చిన్ని పాపలు/ చిగురాకు బోనులు/ లేత లేత బుగ్గలు/ కందిపోయే మొగ్గలు/ బడికి తప్పటడుగులు/ నవ జీవన బాటలు’గా చెబుతారు. అంతేకాదు… ఈయన బడి పంతులు కదా! ఆ బడులు ‘..కొత్తకొత్త చదువులు/ కోటి ఆశల కొలువులు’ అనడం బక్కారెడ్డి తాను నిబద్ధతతో నిర్వహించిన వృత్తిపట్ల వున్న గౌరవానికి నిదర్శనం. ఇటువంటి వృత్తి గౌరవపు దృష్టిని మరో గేయంలో ‘ఊరూరా గుడి వలె బడులు/ బడులు విద్యా విజ్ఞానానికి నెలవులు’ అని… అమ్మమ్మల ఇండ్ల గురించి, ఆ జ్ఞాపకాల గురించి, ఎండాకాలం సెలవుల గురించి, విహారాలు యాత్రలు గురించి చెబుతారు. ‘బాలల దినోత్సవం’ పేరిట నెహ్రూ గురించి గీతం రాసిన వీరు ‘బాల బాలికలు అమ్మా నాన్నల స్వప్నాలు/ బాల్యపు ఆటపాటల తువ్వాయిలు/ ఇల్లంతా సందడి చేయు సన్నాయిలు/ ఇంటిల్లిపాది తలపుల వలపోతలు’ అంటారు. చక్కని గేయాలను బాలల కోసం రాసిన ఈయన పదవీవిరమణ చేసినా కలానికి విరామమివ్వని బాల సాహితీవేత్త. నిరంతరం బాలల కోసం ఆలోచిస్తూ అక్షరాల కానుకలు అందిస్తున్న బాల గీతాల కవి. బాల సాహిత్య రచనోద్యమంలో ముందువరుసలో నిలిచిన ఈ మెతుకుసీమ సాహిత్యకారునికి అభినందనలు. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -