సుందరవనం అనే అడవిలో శార్దూలం అనే పెద్ద పులి ఉండేది. దానికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. అది ఒకసారి గుహలోంచి బయటకు రాగానే దానికి టక్కరి నక్క ఒకటి ఎదురైంది.
ఆ నక్క పెద్దపులితో ”పులి మామా! నీవు చాలా అందంగా ఉంటావు. పసుపు పచ్చని నీ శరీరం పైన ఆ నల్లని చారలు చూడడానికి ఎంత బాగుంటాయో!” అని అంది. అది విన్న పులి పొంగిపోయింది.
”ఓ నక్కా! ఇంకా చెప్పు. నేను ఇంకా ఎలా అందరికీ అందంగా కనబడతానో నీవే చెప్పు!” అంది.
అప్పుడు నక్క తన పని తంతే బూరెల గంపలో పడ్డట్టు అయిందనుకొని ”పులి మామా! నీవు జింకను వేటాడేటప్పుడు ఇంకా అందంగా ఉంటావు. ఆ కోపం, ఆ పంజా చూస్తుంటే అడవికి నీవే రాజువని అందరు అనుకుంటారు” అంది.
ఆ పొగడ్తలకు పులి ఉబ్బితబ్బిబ్బై ”ఓ నక్క అల్లుడూ! ఈరోజు నేను సంతోష పడేటట్లు మాట్లాడావు. నీకు జింకను వేటాడి దాని మాంసం ఇప్పుడే తెచ్చి పెడతాను” అంది.
తన పాచిక పారినందుకు నక్క ఎంతో సంతోషించింది .
ఆ పెద్దపులి జింక కోసం అడవి లోపలికి వెళ్ళింది. దానికి ఒక తోడేలు ఎదురయింది. ఆ తోడేలుతో పెద్దపులి ” ఓ తోడేలా! నేను జింక పిల్లను వేటాడితే చాలా అందంగా ఉంటానట . ఆ నక్క చెప్పింది. నిజమేనా!” అని అడిగింది.
అది విన్న తోడేలు ”అయ్యో పులి మామా! దాని మాటలు నమ్మకు. అది మిత్రుడైన నన్నే మోసం చేసింది” అని అంది.
”అయితే నిన్ను మోసం చేస్తే నన్ను మోసం చేస్తుందా! నేను దాన్ని చంపుతానని దానికి తెలియదా! నీవు నన్ను ఓర్వలేక ఈ మాటలు అంటున్నావు” అంటూ ఆ పెద్దపులి అక్కడ నుండి ముందుకు కదిలింది.
అది మరి కొంచెం దూరం పోగానే దానికి ఏనుగు ఎదురయింది. ఆ పులి ఏనుగుతో ”ఏనుగు మామా! నేను అందంగా ఉంటానట. జింకను వేటాడేటప్పుడు ఇంకా అందంగా ఉంటానట. ఆ నక్క చెప్పింది నిజమే కదూ!” అని అడిగింది.
అది విన్న ఏనుగు ”అయ్యో పులి రాజా! నీవు ఆ నక్క చెప్పింది నమ్మకు. అది జిత్తుల మారి. స్వార్థం కలది. అది తన సొంత లాభం కోసం ఏదైనా చెబుతుంది. అది చెప్పినది అంతా అబద్ధం. నీవు దానిబుట్టలో పడకు” అని అంది.
అప్పుడు పెద్దపులి ”ఇదేమిటి? నీవు ఇలా అంటున్నావు. నన్ను మీరు సహించడం లేదు. నన్ను అది కీర్తిస్తే మీకు ఇష్టం లేదు” అంది.
అది విన్న ఏనుగు ”అయ్యో పులి రాజా! నేను చెప్పే మాటలు అబద్ధాలైతే మరెవరినైనా అడుగు. అవి నీకు నిజం చెబుతాయి” అంది.
ఈలోపుగా పులిని చూసిన ఓ జింక భయపడి దగ్గరలోని కుందేలు బొరియలో చొచ్చి తనను కాపాడమని కుందేలును వేడుకొంది. ఆ కుందేలు బయటకు వచ్చి పులిని చూసి ”ఏం పులి మామా! ఈరోజు ఎప్పుడు రానిది ఇలా వచ్చావు” అని అడిగింది.
అది విన్న పులి నక్క అన్న మాటలను చెప్పింది. అప్పుడు కుందేలు ”అయ్యో పులి మామా! ఆ నక్క మాటలు నీవు నమ్ముతావా! నీవు చాలా అందంగా ఉంటావు. కానీ జింకను వేటాడినప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే నీవు అప్పుడు కోపంగా కనిపిస్తావు. ఆ జింకల పైన నీ ప్రతాపం ఏమిటి? నీవు నక్కను ఎప్పుడూ వేటాడలేదు. దానిని వేటాడితే నీ అందం ఇంకా పెరుగుతుంది. అది తన ప్రాణం కాపాడుకోవడం కోసం నీకు అబద్ధం చెప్పింది. ఇంకా ఎవరినైనా అడుగు” అంది.
అది విని అప్పుడే నక్క చేతిలో మోసగింపబడిన ఎలుగుబంటి, అడవి దున్న, ఒంటె, జిరాఫీ మొదలైన జంతువులు అక్కడికి వచ్చి కుందేలు చెప్పింది నిజమని అన్నాయి. పెద్దపులి వెంటనే నక్క వైపు ఒకే పరుగు తీసింది. దానిని దూరం నుండి చూసిన నక్క అది జింక లేకుండా కోపంగా రావడం చూసి అది తనను ఏమో చేస్తుందని భయపడి అక్కడి నుండి ఫలాయనాన్ని చిత్తగించింది. పులి దాని కొరకు వెదకి వెదకి ”ఇక ముందు కుందేలు, ఎలుగుబంటి లాంటి జంతువులు చెప్పినట్లు వింటాను. ఈ నక్క మాటలు నేను నమ్మనే నమ్మను. ఆ టక్కరి నక్క పొగడ్తలకు నేను పొంగనే పొంగను. అది కనబడనీ! దాని సంగతి చెబుతాను” అనుకొంది.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554534