Sunday, July 27, 2025
E-PAPER
Homeహెల్త్వాపు ఎందుకు వస్తుంది?

వాపు ఎందుకు వస్తుంది?

- Advertisement -

పొద్దున లేస్తూనే, మడమలో నొప్పిగా అనిపించి, కాలు కాస్త దగ్గరగా చేసుకొని చూస్తే, ఉబ్బినట్టుగా, ఎర్రగా అయ్యి ఉందంటే, వెంటనే నోటి నుండి వచ్చే మాట ‘అయ్యో, మడెం వాచింది’. వెంటనే గుర్తొస్తుంది, రాత్రి తొందరలో మెట్లు దిగుతుండగా, పాదం కొంచెం మెలిపడ్డ్డట్టు అనిపించటం, పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపడుకోవడం. ఇది మనందరికీ సుపరిచితమైన అనుభవమే కదా!
అసలు వాపు అంటేఏమిటి? ఇది వ్యాధా? శరీరానికి అనుచితమైనదా? అంటే దానికి సమాధానం కాదు/ అవును!!!
గతంలో ‘జ్వరం మంచిదే’ అని ఎలా తెలుసుకున్నామో, అదేవిధంగా, ఒకరకమైన వాపు మనకు ఎంతగానో సహాయపడే శరీర ప్రతిస్పందన. ఇది శరీరంలోని ఏభాగానికైనా దెబ్బతగిలినా, అంటుక్రిములు చొచ్చుకొని వచ్చినా, కాపాడేదిశగా రోగనిరోధక యంత్రాంగం చేపట్టే మొట్టమొదటి సహజ రక్షణ ప్రక్రియ. దీనిని ఆంగ్లంలో ఇన్ఫ్లమేషన్‌ అంటారు. దీనిలో భాగంగా దెబ్బతగిలిన భాగంలో వేడి పెరుగుతుంది, చుట్టూ ఎర్రబడుతుంది, నొప్పిమొదలయ్యి, వాచి, కదలలేనిస్థితి కలుగుతుంది.
ఆవిధంగా శరీరం గాయపడ్డ భాగం స్వతహాగా కోలుకొనేటట్టుగా చర్యలు చేపడుతుంది.
మాములుగా ఐతే ఇది ఇక్కడితో ఆగిపోతుంది. ఈవిధంగా ఇటువంటి వాపు మంచిదే. అప్పుడప్పుడు ఇలాంటి చర్యలు ఎక్కువకాలం కొనసాగుతాయి. శరీర లోపలి అవయవాల్లో కనిపించకుండా జరుగుతుంటాయి. అలాంటప్పుడు వాపువలన శరీరానికి మేలుకన్నా హాని ఎక్కువగా కలిగే అవకాశాలున్నాయి.
ఇలా శరీరంపై కనిపించే వాపు కాకుండా, ఏభాగంలోనైనా నొప్పితో వైద్యుల సంప్రతింపు కొరకు వెళితే, వారు సూచించేది కూడా వాపే, లోపలి అవయవాల్లో వాపు-కీళ్లు వాచాయనో, గొంతులో వాపు ఉందనో, ఇంకా, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, జ్వరం, వాంతులతో ప్రకటితమయ్యే మెదడువాపు, ప్రాణాంతకంకావచ్చు.
వాపు రెండురకాలు అని అర్థమైపోయినట్టే కదా!!!
1. స్వల్పకాలికవాపు
2. దీర్ఘకాలికవాపు
స్వల్పకాలిక వాపు, కొన్నిగంటలు లేదా ఒకటి రెండు రోజులున్నా, తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. పైన చెప్పినట్టుగా దెబ్బ లేదా అంటు తగిలినప్పుడు జరిగే ప్రతిచర్య. ఇది సాధారణంగా శరీరానికి ప్రయోజనదాయకంగా ఉంటుందే తప్ప హాని ఏమీ జరుగదు.
ఇందుకు భిన్నంగా, దీర్ఘకాలిక వాపు మంద్రంగా ఉండి, కొన్నిరోజులు, నెలలు లేదా సంవత్సరాలు కొనసాగవచ్చు. ఈపరిస్థితిలో, శరీరభాగాన్ని కాపాడవలసిన ఈవాపు అనే ప్రక్రియ, ఆ భాగానికి హానికలిగించడం మొదలు పెడుతుంది. ఈ రకమైన వాపు తరచుగా శరీర లోపలి భాగాల్లో ఏర్పడి, కంటికి కనిపించకుండా ప్రబలిస్తుంది. వ్యాధిని ప్రబలపరుస్తుంది. దానిపరంగా ఎటువంటి సూచనలు ఉండనందువలన, స్థూలంగా గ్రహించే ఆస్కారం ఉండదు. అనుమానిత సందర్భాల్లో, ఆరోగ్యపరంగా చేసిన పరీక్షల ద్వారానే, ఈవాపులతో కూడిన వ్యాధులు బహిర్గతమౌతాయి.
దీర్ఘకాలిక వాపు ఎందుకు, ఎవరిలో వస్తుంది?
అవసరం దాటిన తరువాత కూడా వాపును కలుగచేసే కణాలను, రసాయనాలను శరీరం రోగనిరోధక యంత్రాంగం, ఆపేయకుండా, తయారు చేస్తూ ఉండడంవలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుండెజబ్బు, రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశ జబ్బులు, ఆస్తమా, నరాలకు సంబంధించిన అల్జీమెర్స్‌, పార్కిన్సన్సీ ్ల్జ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులలో తరచుగా కలగడం జరుగుతుంది.
దీర్ఘకాలిక వాపు కారకాలు ఏవి?
పైన పేర్కొన్నవి దీర్ఘకాలికవాపు ప్రాథమిక కారకాలుగా పరిగణించవచ్చు. వాటితోబాటు, కొంతకాలంగా స్వల్పకాలిక వాపు తీవ్రత వలన తగ్గిపోయిన శారీరక శ్రమ, దీర్ఘకాల మానసిక ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, అనారోగ్య ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం, పొగపీల్చటం, మద్యసేవనం వంటివి ప్రేరేపణలుగా దోహదపడతాయి.
వాపు తగ్గడానికి ఏమి చేయాలి?
స్వల్పకాలిక వాపు మేలుచేసేదైనప్పటికీ, దానివల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి అరికట్టవల్సి వస్తుంది. కనుక వాపు రావాల్సిన అవసరం కల్పించకుండా దెబ్బ లేదా అంటును వెంటనే గ్రహించి, నిర్లక్ష్యం చేయక, ‘గుడ్వుండ్ప్రాక్టీసెస్‌’ అంటే, గాయాన్ని వెంటనే శుభ్రపరిచి కట్టుకట్టడం వంటి జాగ్రత్తలు పాటించడం వలన వాపును నివారించవచ్చు.
వాచిన శరీర భాగానికి విశ్రాంతినివ్వడం, ప్రతి రెండుగంటల కొకసారి ఒక అరగంటపాటు, వీలైన వ్యవధుల్లో ఐసు ముక్కల ప్యాకెట్‌ పెట్టడం వంటి వాటితో వాపును అదుపులో పెట్టవచ్చు.
దీర్ఘకాలిక వాపు రాకుండా చేయడం ఎలా?
ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిజంగా పెద్దసవాలు. మధుమేహం వంటి జబ్బుల్లో ఆ జబ్బు తాలూకు పరిణామాలు ప్రాణాంతకాలు. అవి వివిధ అవయవాల్లో వాపుతో కూడుకున్నవై ఉండటం వల్ల, వీరు పాటించవలసిన ఆరోగ్య జాగ్రత్తలు అనేకం. వీరు తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక జీవనశైలి పద్ధతులు అలవరచుకోవాల్సి ఉంటుంది.
ఆహార సంబంధిత మార్పులు, రోజువారీ వ్యాయామము, మానసిక ఒత్తిడికి లోను కాకుండటం, నిద్ర నియమాలు పాటించడం, నోస్మోకింగ్‌, ఆల్కహాల్‌, శరీర బరువును వయసుకు తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోవడం, వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి.
కొన్ని ఆహారపదార్థాలను రోజువారీ భోజనంలో నివారిస్తే వాపును అదుపులోఉంచవచ్చు. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, వేపుళ్ళు, తెల్లబియ్యం, మైదా, ఎరుపుమాంసం, ఆలు, కంద వంటి కొన్నిరకాల దుంపలు, చక్కర, సోడా మొదలైనవి.
బాదాం, ఆక్రోట్‌ వంటి నట్స్‌, బెర్రీస్‌, శాకాహారులైతే పాలకూర, బెల్మిర్చి, టమాటాలు, బ్రోకలీ, కాలిఫ్లవర్‌; మాంసాహారులైతే సాల్మన్చేప, గుడ్లు ఇలా కొన్నిరకాల ఆహారాలు క్రమంతప్పకుండా దైనందిన ఆహారంలో తీసుకుంటే వాపుని అరికట్టడంలో సహకరిస్తాయి.
వీటన్నిటితోబాటు, వైద్యసలహా మేరకు సూక్ష్మపోషకాలైన విటమిన్లు-ముఖ్యంగా బి కాంప్లెక్స్‌, డి, కె విటమిన్లు, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఆహార అనుబంధాలుగా తప్పనిసరిగా, రోజువారీ తీసుకోవాలి.
గుర్తుపెట్టుకోవాల్సినది: శరీరం వెలుపల వెలువడే స్వల్పకాలిక వాపు ప్రయోజనకరమైనది. శరీరంలోని రక్తనాళాల్లో, అవయవాల్లో సంభవించే దీర్ఘకాలిక వాపు ప్రాణాంతకమైనది. దాని పట్ల అప్రమత్తమై ఉండాలి.

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -