నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మాజ్యోతిరావుఫులై బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఆహారం వికటించి 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థినులకు స్నాక్స్ పకోడి అందించారు. తరువాత రాత్రి భోజనం క్యాబేజీ కూరతో ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే తొమ్మిది మంది విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు కావడంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. ఆ తరువాత క్రమంగా విద్యార్థినుల సంఖ్య 50 వరకు పెరిగింది. ఆదివారం ఉదయం వరకు విద్యార్థుల సంఖ్య 64 పెరిగింది.
కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని నాగర్ కర్నూల్ ఆర్డీవో సురేశ్ ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.